దశాబ్ద కాలానికి పైగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి పరిపాలనలో దేశ ఆర్థిక స్థితి దిగజారిందని, అభివృద్ధి, సంక్షేమం అడుగంటిందని గణాంకాలు, అంతర్జాతీయ సూచీలు తెలియజేస్తున్నాయి. అత్యధిక కాలం పదవిలో కొనసాగిన కాంగ్రెసేతర ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సొంతం చేసుకున్నారు. ఆ రికార్డు వల్ల ఆయనకు, బీజేపీకి లాభమేమో గానీ దేశానికి మాత్రం ఆయన పాలన సాధించి పెట్టిందేమీలేదని చెప్పవచ్చు. దేశంలో పెరుగుదల అంటూ ఏదైనా ఉన్నదీ అంటే అది కేవలం రుణాల విషయంలోనే. ‘మోదీ రాజ్’లో రుణభారం పతాకస్థాయికి చేరుకున్నది. ప్రభుత్వ అంచనా ప్రకారమే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి మొత్తం రుణం రూ.200 లక్షల కోట్లకు చేరుకోనున్నది. ఇక తలసరి అప్పు విషయానికి వస్తే, గత రెండేండ్లలోనే రూ.90 వేలు పెరిగింది.
2023 మార్చిలో రూ.3.9 లక్షలుగా ఉన్న తలసరి రుణం 2025 మార్చి నాటికి రూ.4.8 లక్షలకు చేరుకున్నది. ఇంతటి అప్పు తెచ్చి సాధించిందేమిటా అని ఆలోచిస్తే ఏమీ కనిపించదు. ప్రజలూ రకరకాల వనరుల ద్వారా తీసుకొంటున్న అప్పు పెరుగుతుండటమే అందుకు నిదర్శనం. సామాన్యుల ఆదాయంలో 25 శాతానికి పైగా అప్పులు ఇదివరకే చేసిన అప్పులను తీర్చడానికే పోతున్నది. ఖర్చులు పెరగడం, అందుకు అనుగుణంగా సిసలైన ఆదాయాలు పెరగకపోవడమే ఇందుకు కారణం. దీని ఫలితంగా జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. ఈ సంగతి మనకు సూచీల ద్వారా తెలుస్తున్నది.
ఆకలి, పిల్లల్లో పోషకాహార లోపం వంటి అంశాల ఆధారంగా రూపొందించే హంగర్ ఇండెక్స్ (ఆకలి సూచీ)లో 2014లో 76 దేశాల్లో భారత్ స్థానం 55 కాగా, అది నేడు 123 దేశాల్లో 102వ స్థానానికి పడిపోవడం ఏ రకం ప్రగతికి ప్రతీక అవుతుంది? ఇంకా అనేక సూచీలు భారత్ పతనాన్ని ఎత్తిచూపుతున్నాయి. ముఖ్యంగా సామాజిక అంశాల విషయంలో ఈ పతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఆర్థిక స్వాతంత్య్ర సూచీలో భారత్ స్థానం 120 నుంచి 126కు, ప్రజాస్వామ్య సూచీలో 27 నుంచి 41కి, చట్టబద్ధ పాలన సూచీలో 66 నుంచి 79కి, హ్యాపీనెస్ సూచీలో 111 నుంచి 126కు పడిపోయింది. అవినీతి సూచీలో 85 నుంచి 96కు చేరుకున్నది. ఈ పతనం ఇంతటితో ఆగకుండా పత్రికారంగం మీద కూడా ప్రభావం చూపింది. పత్రికా స్వాతంత్య్రం సూచీలో భారత్ స్థానం 140 నుంచి 151కి పడిపోయింది. అంటే మోదీ పాలనలో ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వాతంత్య్రాలు అట్టడుగుకు చేరుకున్నాయని ఈ పతనాల పరంపర సూచిస్తున్నది.
గణాంకాలు, సూచీలు అలా ఉంటే మోదీ సర్కారు సాకులతో, ఎదురుదాడులతో కాలం గడుపుతున్నది. దేశంలోని అత్యంత కీలకమైన పదవిలోకి వచ్చే ముందు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా తప్ప కేంద్రంలో మోదీ ఎలాంటి పదవిని నిర్వహించలేదు. సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తిగత ఇమేజీ పెంచుకుంటూ తన పరిపాలనా దక్షతను గీటురాయిగా ‘గుజరాత్ మోడల్’ను చూపుతూ ఆయన విజయాన్ని చేజిక్కించుకున్నారు. నిజానికి గుజరాత్ మోడల్ అనేది కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానం తప్ప మరోటి కాదు. మైనారిటీల అణచివేత అనేది ఆ మోడల్‌కు ఉన్న మరో లక్షణం.
ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన తర్వాత మోదీ తన గుజరాత్ మోడల్‌ను దేశమంతటికీ విస్తరించారు. అచ్చేదిన్ అని ఊరించారు. వికసిత్ భారత్ అని అరచేతిలో స్వర్గం చూపించారు. నోట్లరద్దు, జీఎస్టీ వంటి అవకతవకలతో సాగిన పాలనలో ఉత్పాదక రంగం కుదేలైంది. ఈ దేశంలో వ్యాపారం చేయడం కష్టమే అంటూ ఇటీవలే అసోచామ్ స్వయంగా ప్రకటించింది. మేక్ ఇన్ ఇండియా ఓ డొల్ల నినాదంగానే మిగిలిపోయింది. మోదీ సర్కారు విధానాల అంతిమ లబ్ధిదారుగా సంపన్నులు నిలిచారు. దీని ఫలితంగా ధనిక-పేద అంతరాలు దారుణంగా పెరిగిపోయాయి. అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరకుండా కార్పొరేట్ల జేబుల్లోకి పోతున్నాయి. రెండు విడతల తిరుగులేని అధికారం ఈ తరహా కార్పొరేట్ అనుకూల పాలన నిరాఘాటంగా కొనసాగించడానికి మోదీకి అనుకూలించింది. అయితే మూడో విడతలో మాత్రం మెజారిటీ లేకుండా చేసి, ఆయన అప్రతిహత ప్రస్థానానికి ప్రజలు అడ్డుకట్ట వేయడం కొసమెరుపు.