‘ఇప్పటి వరకు మా రాష్ట్ర ప్రతిపత్తి కోసమే ఉద్యమం జరిగింది. అది ఎవరి మీదనో కోపంతోనో, కక్షతోనో కాదు. తెలంగాణలో స్థిరపడ్డ ఆంధ్రులు నిర్భయంగా ఉండవచ్చు. వారు తెలంగాణ ప్రజలతో సమానంగా పరిగణింపబడుతారు. ఇక మీదట మన రెండు రాష్ర్టాలు సమస్యలు పరిష్కరించుకొని అభివృద్ధి సాధిద్దాం’ ఇదీ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఉద్యమ నాయకుడు, రాష్ట్ర సాధకుడు కేసీఆర్ చేసిన ప్రకటన. ఎంతో హుందాగా, గౌరవప్రదంగా ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు ఆంధ్ర రాజకీయ నాయకులకు గానీ, తెలంగాణలో వ్యాపారాలు, ఉపాధి ఏర్పరుచుకొని సంపన్నులైన ఆంధ్రా వాళ్లకు గానీ అర్థం కాలేదనిపిస్తున్నది. లేకపోతే కేసీఆర్ విశాల భావాల స్థాయిలో వారు లేరేమో అనిపిస్తున్నది.
వలస పాలకుల విధ్వంసాన్ని సరిచేసి, తెలంగాణలో ప్రశాంతత, అభివృద్ధి సాధించి అన్ని రంగాల్లో తెలంగాణ ముందంజ వేయాలన్న లక్ష్యంతో 2001 నుంచి రాష్ట్రంలో మూలమూల తిరిగి ఉద్యమాన్ని నిర్మించిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ పునర్నిర్మాణం కోసం కూడా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సహా మేధావులు, నిపుణులతో చర్చించి, పటిష్టమైన ఎజెండాను తయారు చేశారు. రక్తం బొట్టు చిందకుండా ఉద్యమాన్ని సాగించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిమిషం కూడా వృథా చేయకుండా పాలనలోకి దిగారు. అందరినీ కలుపుకొనిపోతూ ‘లక్ష్య రాజకీయాలు’ చేసి ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించాలనేది ఆయన సిద్ధాంతం. అయితే, అప్పటివరకు తెలంగాణలో అన్ని రంగాల మీద ఆధిపత్యం సాధించిన, సామాన్య ప్రజలకు ఇక్కడి వనరులు, సంపద అందకుండా చేసిన ఆంధ్ర పాలకులు ఎట్లా ప్రవర్తించారు?
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు గెలిచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు అక్కడ డిస్కమ్‌లు ఆపేసి, తెలంగాణకు కరెంట్ రాకుండా చేశాడు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను బలవంతంగా లాక్కొని రకరకాలుగా కక్ష సాధించాడు. అంతేకాకుండా, కొత్త రాష్ట్రం పురిటిలో నుంచి బయట పడకుండానే కుట్ర రాజకీయాలు నడిపి, తెలంగాణ ప్రభుత్వాన్ని పడదొయ్యడానికి యత్నించాడు. ‘పకోడీలు చేసేవాడికి అవే చేతనైతాయి, పులిహోర చేయలేడు’ అన్నట్టుగా మోసపూరిత విధానంలో పిల్లనిచ్చిన మామను పడదోసి, సొంత మనుషులను వంచించి పీఠమెక్కిన వాడు చంద్రబాబు. అలాంటి నాయకుడు సరైన రాజకీయాలు చేస్తాడా? అవే విధానాలు 2014 నుంచి ఈ రోజు వరకు కూడా పాటిస్తున్నాడు.
వేదకాలంలో కూడా ఆధ్యాత్మికవేత్తలు, వివిధ రంగాల్లోని నిపుణులు, సమాజంలోని విద్యావంతులైన స్త్రీలు, పురుషులు కలిసి తమ పాలకుడిని ఎన్నుకొనేవారు. ఆ వ్యక్తి ‘ఉన్నత విద్యావంతుడు, నైపుణ్యాలు కలిగినవాడు, ధర్మాన్ని ఆచరించేవాడు, విద్వాంసుడు, నిజాయితీ, నిబద్ధత కలిగినవాడు, బాధ్యతగా, నిష్పక్షపాతంగా పాలించగలిగే ఉన్నత భావాలు కలిగినవాడు, ప్రజలను ఉత్సాహపరుస్తూ, వారి అభివృద్ధికి పథకాలు రచించి అందించేవాడు, ప్రజల వ్యక్తిగత అభివృద్ధి, సమాజ శ్రేయస్సు తన లక్ష్యాలుగా కలిగినవాడు అయి ఉండాలి’ (యజుర్వేదం,
అధ్యాయం 7, మంత్రం 36).
ఇటువంటి మంత్రాలు వేదాల్లో వేల సంఖ్యలో ఉన్నాయి. అవి పాలకుడికి చక్కటి మార్గాన్ని సూచిస్తాయి. సమస్యలకు పరిష్కారాలను చూపుతాయి. ఆ తరహాలో జూన్ 2014 నుంచి నవంబర్ 2023 వరకు కేసీఆర్ సారథ్యంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచిన రాజకీయ నాయకులే కాక, స్థానిక తెలంగాణ నాయకులు ప్రభుత్వ విరోధులుగా ప్రవర్తించినప్పుడు, ప్రజాహితం, ప్రజా సంక్షేమం కాకుండా, ఎన్నికైన ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు, ధ్వంసమైన రాష్ర్టాన్ని అతి తక్కువ కాలంలో అంత అభివృద్ధి చేయగలగడం ఇంకెవరికైనా సాధ్యమయ్యేదా? కానీ కేసీఆర్ మొక్కవోని ధైర్యంతో, సకారాత్మక ఆలోచనలతో సర్వశక్తులు వెచ్చించి, రాష్ట్రంలో సామాన్య ప్రజలకు వ్యవసాయం, విద్యుత్తు, తాగునీరు, పల్లెల్లో కూడా అన్ని రకాల సదుపాయాలు, సాంకేతిక అభివృద్ధి సాధించి కేంద్రం ఇచ్చే 16 అవార్డుల్లో 13 తెలంగాణకు దక్కేటట్టు కృషి చేశారు.
తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన సునిశితమైన విషయం ఒకటుంది. తెలంగాణలో అధికారం చేజిక్కించుకొన్న కాంగ్రెస్‌కు, కేసీఆర్ అంటే అసూయ, కక్ష సహజ లక్షణాలుగా కలిగిన తెలుగుదేశం పార్టీకి, దేశంలోని అన్ని రాష్ర్టాల్లో విపక్ష పార్టీలను, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను నాశనం చేసేందుకు అనైతిక మార్గాలు కూడా నిస్సిగ్గుగా అమలు చేస్తున్న బీజేపీకి, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కంటే తమ మేధ గొప్పదని నిరూపించుకోవాలన్న తాపత్రయం కలిగిన నకిలీ మేధావులకు (ఈ గుంపులో ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, విద్యావంతులు కూడా ఉన్నారు). 2023 ఎన్నికల ముందు నుంచీ నేటికీ వారందరికీ ఒక్కటే లక్ష్యమయింది. అదే కాళేశ్వరం. తెలంగాణ శత్రువులకు కాళేశ్వరం ప్రాజెక్టు కండ్ల మంటలు ఎందుకు కలిగిస్తున్నదో ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి.
మేడిగడ్డ బరాజ్‌లో కేవలం రెండు పిల్లర్లు కొద్దిగా కుంగితే, వాటిని సరిచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే ఆదేశాలివ్వని ఎన్డీఎస్ఏకు, రెండున్నరేండ్ల తర్వాత మిగతా స్తంభాలు- అన్నారం, సుందిళ్ల దగ్గర కుంగుతాయని రిపోర్ట్ ఇచ్చే అర్హత ఉన్నదా? మేడిగడ్డలోని రెండు పిల్లర్ల దగ్గర ఈ రెండేండ్లు ప్రభుత్వం ఇసుకను తోడించిందన్న రిపోర్టులు ఉన్నాయి.
సాక్ష్యం చెప్పే వాళ్లు కూడా ఉన్నారు. ఎవరైనా ఒక బరాజ్ పిల్లర్ల వద్ద ఇసుక తవ్వవచ్చా? ఎందుకు తవ్వారు? ఆ పిల్లర్లు ఇంకా కుంగాలనే కదా! మరి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ కక్ష, నిర్లక్ష్యం అందరికీ కనపడటంలేదా? రేవంత్‌రెడ్డి ఇట్లా తెలంగాణ వ్యతిరేక ప్రణాళికలు మిగతా రంగాల్లో కూడా అమలు చేస్తున్నారు. అయితే కాళేశ్వరాన్ని భ్రష్టు పట్టించాలన్న పట్టుదల చంద్రబాబుకు, మోదీకి కూడా ఎందుకు? కారణాలు వెతకడం కష్టం కాదు. మోదీ రాజకీయ లక్ష్యం విపక్ష పార్టీలు, ముఖ్యంగా వివిధ రాష్ర్టాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల నాశనం. బెంగాల్లో ఎన్నికైన తర్వాత 5,000 ఈవీఎంలు తగలబెట్టారంటే అక్కడ బీజేపీ ఏ రకంగా అనైతిక విజయం సాధించిందో అర్థమవుతున్నది కదా! మోదీది రాజకీయ లక్ష్యమైతే, చంద్రబాబుది వ్యక్తిగత అసూయ.
తెలంగాణ రాష్ట్రం తమ కబంధ హస్తాల నుంచి పోయిందన్న కక్ష. చంద్రబాబు అక్రమ ఆస్తులు తెలంగాణలోనే ఉన్నాయి. చంద్రబాబుకు ప్రజల క్షేమం పట్టదు, ఇక్కడ సంపద దోచుకోవడమే ఆయన లక్ష్యం. విభజన తర్వాత ఏపీకి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఐదేండ్ల పాలనలో అమరావతి సినిమా సీడీలు ప్రజలకు చూపించాడే తప్ప, రాజధాని కట్టలేదు, కట్టలేడు కూడా. ప్రపంచంలో కాళేశ్వరం ఎనిమిదో వింత అని విదేశీయులు సైతం పొగిడారు.
అలాంటి ప్రాజెక్టు తెలంగాణకు ఉంటే చంద్రబాబు సహించగలడా? ఆంధ్రను అభివృద్ధి చేయాలన్న కోరిక లేదు కానీ, తెలంగాణను నాశనం చేయాలన్న లక్ష్యం మాత్రం ఆయనకు గాఢంగా ఉన్నది. తెలంగాణకు చెందిన గోదావరి జలాలు 1956 నుంచీ ఆంధ్రకు పారాయి. మరి ఇప్పుడు కాదంటే ఎలాగ? అందుకే ‘హైదరాబాద్ మీ అయ్య జాగీరా?’ అని కావ్ కావ్ అంటున్న చిన్న నాయకుడితో కలిపి దుష్ట చతుష్టయం తెలంగాణ ప్రాణధార అయిన కాళేశ్వరాన్ని కూల్చాలని కంకణం కట్టుకున్నది. పొరపాటో, గ్రహపాటో 57 ఏండ్లపాటు తెలంగాణ విధ్వంసమైంది. అది తెలిసి కూడా ప్రత్యేక రాష్ట్రంలోనూ ప్రజలు కాంగ్రెస్‌ను గద్దెనెక్కించారు. ఇప్పుడైనా కండ్లు తెరిచి, జ్ఞానం తెచ్చుకొని ఉద్యమం చేసైనా కాళేశ్వరాన్ని కాపాడుకోకపోతే, రేపు సింగరేణిని అదానీకి, భద్రాచలం రాముడు, యాదాద్రి నరసింహుడు బీజేపీ దోపిడీకి, మిగతా వనరులను కక్షపూరిత ఆంధ్ర పాలకులకు వశమైపోతాయి. తెలంగాణ ప్రజలు మేలుకోవాలి.
– కనకదుర్గ దంటు