రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగానే సాగుతున్నట్టుగా కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్‌లోని సీనియర్లను పక్కనబెట్టి పూర్తిగా రేవంత్‌రెడ్డిని నమ్ముకొని ముందుకుసాగుతున్న అధిష్ఠానం ఆయనకు పగ్గాలు వేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నది. కాంగ్రెస్ బ్లడ్ కాని రేవంత్‌తో అధిష్ఠానం తాము కోరుకున్న ఫలితాలను రాబట్టుకోలేకపోతున్నదనే చెప్పాలి. ఈ నెల 15న ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో తెలంగాణ మంత్రుల భేటీలో ఇలాంటి ఎన్నో అంశాలు చర్చలోకి వచ్చాయి. ఏడాది పాలనపై ఢిల్లీలో జరిగిన ఈ సమీక్షలో రేవంత్ బృందంలో ఏకాభిప్రాయం లేని విషయం కూడా చర్చకు వచ్చింది. జనవరి 8 నాడు గాంధీభవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో కూడా ఆయన ముఖ్యమంత్రి, మంత్రివర్గం కలిసి పనిచేయడం లేదనే అభిప్రాయం వ్యక్తపరిచారు. ఇప్పటికీ వారి మధ్య సమన్వయం కుదరలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
అందుకు ఉదాహరణలుగా ఆయన కొన్ని విషయాలను లేవనెత్తారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పాలనపై చేస్తున్న విమర్శలకు మంత్రులు ధీటుగా సమాధానాన్ని చెప్పడం లేదు. పథకాల అమలుపై వస్తున్న విమర్శల విషయంలో సీఎం ఒంటరిగా పోరాడవలసి వస్తున్నది. వీరి మౌనం రేవంత్ నిర్ణయాల పట్ల మంత్రివర్గంలో ఏకీభావం లేనట్టుగా అందరు భావిస్తారని వేణుగోపాల్ అన్నారు. మంత్రుల సర్దుబాటు మాటలతో ఆయన సంతృప్తి చెందినట్టు తెలిసింది. బీఆర్ఎస్ నేతల విమర్శలకు కొందరు జవాబులు ఇచ్చినా బీజేపీ పట్ల మంత్రులు, నాయకులు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆయన తప్పు బట్టారు. కేంద్రంలోని బీజేపీ పాలసీలతో రాష్ట్రంలోని మంత్రులు సంబంధం లేనట్టుగా ఉంటున్నారు. దీనివల్ల అర్థాలు మారిపోతాయి. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు స్థానిక బీజేపీ నేతలతో కేంద్రాన్ని దృష్టిలో పెట్టుకొని నడవాలి కానీ, అలా జరగడం లేదు.
ఇటీవల మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పార్టీ వైఖరిని మరిచినట్టు మాట్లాడారు. బీజేపీ పాతకాపు అయిన విద్యాసాగర్ రావుపై రేవంత్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇలా చాలా సందర్భాల్లో రేవంత్ కాంగ్రెస్ కట్టుబాటు తప్పుతున్నారు. వాస్తవానికి కేంద్రంలోని బీజేపీ పాలనను కాంగ్రెస్ కార్యకర్తలుగా రాష్ట్రస్థాయిలో కూడా నిలదీయవలసిన అవసరం ఎంతో ఉన్నది. అలా లేకుంటే రాష్ట్రంలోని బీజేపీ నేతలతో కాంగ్రెస్ నాయకులు కలుపుగోలుగా ఉంటున్నారనే అపవాదు మోయవలసి వస్తున్నది. కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ప్రతినిధులుగా రాష్ట్రంలో కూడా వ్యవహరించవలసిన అవసరం ఉన్నది. అయితే, ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలే బీజేపీ వైఖరిని ఎదుర్కొంటారు అన్నట్టు వీరు వదిలేస్తున్నారు.
అంబేద్కర్‌ను కేంద్రమంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా అవమానిస్తున్నట్టు మాట్లాడినా తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. ఇది అధిష్ఠానానికి మింగుడుపడలేదు. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని అధిష్ఠానం వీరికి గుర్తు చేయవలసి వస్తున్నది. ఫార్ములా వన్ రేస్ నిర్వహణకు జరిగిన చెల్లింపులో నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ను ఏసీబీ కేసు వేసిన సమయంలో ఈడీ కూడా రంగప్రవేశం చేసింది. గంటల తరబడి ఈడీ, ఏసీబీల విచారణకు బదులు ఇద్దరం లై డిటెక్టర్ పరీక్షను ఎదుర్కొందామని కేటీఆర్ సీఎం రేవంత్‌కు సవాల్ విసిరారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ మూకుమ్మడిగా బీఆర్ఎస్ను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్న తీరు చూస్తుంటే రాష్ట్రంలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ కలిసి అడుగేస్తున్నట్టుగా భావించవచ్చు.
మరోవైపు హైదరాబాద్ పాతబస్తీలో ఫ్లై ఓవర్ ప్రారంభించినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంఐఎం నాయకులను ప్రశంసించడం, వెనుకేసుకురావడం పట్ల కొందరు కాంగ్రెస్ నాయకులు వేణుగోపాల్ దృష్టికి లోపాయికారిగా తెచ్చినట్టు తెలుస్తున్నది. ఆ వైఖరి వల్ల కాంగ్రెస్‌లోని ముస్లిం నాయకులు నిరాశ చెందుతున్నారు. కొన్ని రాష్ర్టాల్లో కాంగ్రెస్ ఓటమికి కారణమైన ఎంఐఎంతో రేవంత్ చెట్టాపట్టాలు వేసుకోవడం కూడా అధిష్ఠానానికి మింగుడు పడని విషయమే. పైకి పార్టీ పట్ల వినమ్రంగా కనిపించినా ప్రతి సందర్భంలోనూ రేవంత్ సొంత వైఖరితో వ్యవహరిస్తున్నారు. ఇది పార్టీకి నష్టం చేస్తుందని తెలిసినా ఏమీ చేయలేని స్థితి అధిష్ఠానానిది.
జనవరి 26న జాతీయస్థాయిలో మొదలయ్యే రాహుల్‌గాంధీ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రకు రాష్ట్రం సంసిద్ధత ఉండాలనేది కూడా ఢిల్లీ మీట్లో ప్రధాన విషయమే. రాహుల్‌గాంధీ పాదయాత్ర ఇప్పుడు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఒక పరీక్షగానే భావించాలి. ఎందుకంటే బీఆర్ఎస్ జెండాపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. గులాబీ గుర్తుపై గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తాను కాంగ్రెస్ వాడినని ప్రకటించడంతో పెద్ద రగడ మొదలైంది. ప్రతి ప్రభుత్వ సమావేశంలో ఆయన సాటి శాసనసభ్యుల మధ్య భంగపడే పరిస్థితి ఏర్పడింది. కడుపు మండిన ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండబట్టలేక ఆయనను కరీంనగర్లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ‘తమరిది ఏ పార్టీ?’ అని నిలదీయడంతో పెద్ద గొడవే అయింది.
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా లేని ఆ ఎమ్మెల్యే తప్పని పరిస్థితుల్లో తాను కాంగ్రెస్ తరపున వచ్చానని చెప్పక తప్పలేదు. ఇలాంటి సందర్భంలో రాహుల్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర రాష్ట్రంలో అబాసుపాలు కావచ్చు. చిన్న రాజ్యాంగ ప్రతిని పట్టుకొని పార్లమెంట్లో కనబడుతున్న రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనను తప్పుబట్టడం లేదు. కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఒక పాత్ర, పాలనలో ఉన్న చోట దానికి భిన్నమైన పాత్ర పోషించడంతో ఆయనకు రాజ్యాంగంపై ఉన్న గౌరవం బయటపడుతున్నది. ఇదే ప్రశ్న తెలంగాణలో ప్రతిపక్షాలు ఆయనను ప్రశ్నించే అవకాశం ఎంతో ఉన్నది. ఇలా రాష్ట్రం తమదే అన్న భావన కాంగ్రెస్ పెద్దలకు కలుగకుండా సాగుతున్న రేవంత్ వైఖరిని వారు భరించక తప్పదు.
– నర్సన్ బద్రి 94401 28169