ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగబాకిందని సామెత. ఉన్న నగరాన్ని సరిగా నిర్వహించడం చేతకాని కాంగ్రెస్ సర్కార్ ‘ఫ్యూచర్ సిటీ’ అని తెగ ఊరిస్తున్నది. కాంగ్రెస్ ఊరిస్తే, ఉబ్బేస్తే ప్రజలు అధాటున అధికారం కట్టబెట్టారు. వారి ఆశలు, ఆకాంక్షలు ఎప్పుడో గంగలో కలిసిపోయాయి. కాంగ్రెస్ సర్కార్ ఏదో ఒరగబెడుతుందనే భరోసా ఇప్పుడు ఎవరికీ లేదు. కొత్తగా ఇస్తానన్నవి ఇవ్వకపోగా ఉన్నవి ఊడగొడుతూ తన ప్రతాపం చూపిస్తున్న కాంగ్రెస్ సర్కార్‌ను ప్రజలు నమ్మడం మానేసి చాలా కాలమైంది. అయితే, కాంగ్రెస్ లెక్కలు వేరే ఉన్నాయి.
ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చింది ఏవో నాలుగు మంచి పనులు చేసి పేరు తెచ్చుకోవడానికి కాదు. ఇప్పుడు వారి దృష్టంతా కమీషన్లు తెచ్చిపెట్టే ప్రాజెక్టుల మీదే ఉన్నది. మేడిగడ్డ బదులు తుమ్మిడిహెట్టి అన్నా, మూసీ సుందరీకరణ అన్నా కాసుల వేట కోసమే. ఫ్యూచర్ సిటీ కూడా ఆ కోవ లోనిదే. రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని చూసుకోవాల్సిన ప్రజలెన్నుకున్న ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీగా మారుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణకు మహోన్నత భవిష్యత్తును అందించగల రాజధాని నగరముంది. ఉన్నట్టుండి ఓ కొత్త నగరాన్ని నిర్మించాల్సిన అగత్యం లేదు. పోనీ సామాన్య ప్రజల కోసం గృహనిర్మాణ ప్రాజెక్టు ఏమైనా కడుతున్నారంటే అదీ కాదు. ఫ్యూచర్ సిటీ తరహా ప్రాజెక్టులు కాంగ్రెస్ మార్క్ కాసుల కక్కుర్తి మాత్రమే. అది సర్కార్ మెడకు గుదిబండగా మారి అనాలోచిత, ఆచరణ సాధ్యం కాని రియల్ ఎస్టేట్ వెంచరే అవుతుంది. ఇంకా ముగ్గు కూడా పోయని, ఒక్క ఇల్లు కూడా మొలవని ఫ్యూచర్ సిటీని అమరావతి నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవేతో కలపాలనేది మరింత మూర్ఖపు ఆలోచనే. పేదలను ఆదుకొనే ఏ పథకానికీ డబ్బుల్లేవని ఏడుపులు, పెడబొబ్బలు పెట్టే కాంగ్రెస్ సర్కార్ ఆ భావినగర నిర్మాణానికి డబ్బు ఎక్కడినుంచి తెస్తుంది? మళ్లీ అప్పులే గతి. తట్టెడు మట్టి ఎత్తకుండా రెండేండ్లలో రెండు లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ సర్కార్ ఆశల్లేని సిటీని అప్పు మీద అప్పు చేసి మరీ కడతామంటున్నది.
కమీషన్లు దండుకుంటే చాలు, కట్టిన ఊరు ఏమైపోతేనేం అనేది బహుశా కాంగ్రెస్ ఆలోచన కావచ్చు. ఇప్పటికే హైడ్రా కూల్చివేతలు, అస్తవ్యస్థ పాలన ఫలితంగా హైదరాబాద్‌లోనూ, తెలంగాణలోనూ రియల్ ఎస్టేట్ రంగం మూలకు పడి మూలుగుతున్నది. నిర్మాణం పూర్తిచేసుకొని అమ్ముడుపోని నివాస, వాణిజ్య స్థలాల విషయంలో హైదరాబాద్ నగరం మెట్రోల్లో అగ్రస్థానంలో ఉండటం గమనార్హం. అమ్మకాలు రోజురోజుకూ అడుగంటుతుండటమే అందుకు కారణం.
ఆన్‌రాక్ సంస్థ నివేదిక ప్రకారం క్రితం ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 2025లో 23 శాతం తగ్గిపోయాయి. ముఖ్యంగా మధ్యతరగతి లక్ష్యంగా నిర్మించే రూ.80 లక్షలు-కోటిన్నర సెగ్మెంట్లోనే అమ్ముడుపోనివి కుప్పలు తెప్పలుగా పోగవుతుండటం సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నది. హెచ్ఎండీఏ స్వయంగా ప్లాట్ల అమ్మకం చేపట్టి అమ్ముడుపోక బొక్కబోర్లా పడ్డ సంగతి తెలిసిందే. ఇటీవల సర్కారు 103 ప్లాట్లు వేలానికి పెడితే అందులో అమ్ముడయ్యింది మూడు మాత్రమే. ఈ నేపథ్యంలో ఏకంగా మరో సిటీ నిర్మాణం అంటూ ఉరుకులాడటం అనాలోచితం, అర్థరహితం, అంతిమంగా అనాచరణీయం.