తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సగకాలం పూర్తి కావస్తుండగా రైతుల తీవ్రమైన కష్టాల వార్తలు క్రమంగా పెరుగుతున్నాయి. బీఆర్ఎస్ పాలన పోయినప్పటి నుంచి ఇప్పటికి నాలుగు పంట కాలాలు ముగిసి ప్రస్తుతం ఐదవది నడుస్తుండగా, కాంగ్రెస్ పాలనలో రైతుకు మొదటి పంట నుంచే సమస్యలు మొదలయ్యాయి. కొత్త ప్రభుత్వం గదా నెమ్మదిగా సర్దుకుంటుందని రైతు భావించగా, అది జరగకపోగా పంటపంటకు సమస్యలు ఇంకా పెరుగుతున్నాయి. ఒరిజినల్‌గా కాడెద్దులు, రైతు గుర్తుతో ప్రస్థానం ప్రారంభించి, మధ్యలో ఆవు దూడ గుర్తును తెచ్చుకుని, ప్రస్తుతం రైతులతో సహా ప్రజలందరికీ అభయహస్తాన్ని చూపుతున్న కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ పరిస్థితి ఎందుకు?
ఈ ప్రశ్నలు ముందుకు రావటంతో అసలు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి ఏముందని చూడగా ఈ కిందివి కనిపించాయి. ‘వరంగల్ రైతు డిక్లరేషన్’ పేరిట గల రెండు పేజీల భాగంలో 9 అంశాలున్నాయి. వాటిలోని 14 హామీలతో పాటు, 10 రకాల పంటలకు మద్దతు ధరలు, అది గాక 6 గ్యారెంటీలలో భాగంగా వరికి క్వింటాలుకు (అన్ని రకాల వడ్లకు) రూ.500 బోనస్ అనేవి కనిపించాయి. అనగా మొత్తం 16 హామీలు.
మేనిఫెస్టో ప్రతులుగాని, ఆరు గ్యారెంటీల కార్డు గాని రైతుల వద్ద ఉండే అవకాశం లేదు గనుక, ఇప్పుడు పరిపాలనకు సగకాలం గడిచినందున, ఆ 16 హామీలేమిటో గుర్తుచేసుకోవటం అవసరం. దానిని బట్టి వాటిలో అమలు అయినవేమిటో, కానివేమిటో రైతులు స్వయంగా తెలుసుకోగలరు. అదేవిధంగా మిగిలిన కాలంలో అవి ఎట్లా అమలు కావచ్చునో కూడా ఈ మొదటి సగకాలంలో తమ అనుభవాన్ని బట్టి వారు ఒక అంచనాకు రావచ్చును.
1) ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ, 2) భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.15 వేలు, 3) భూమిలేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, 4) అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో ప్రభుత్వమే కొనటం, 5) మూతపడిన చక్కెర కర్మాగారాలు తెరిపించి, పసుపు బోర్డు ఏర్పాటు, 6) ‘నరేగా’లో వ్యవసాయ పనుల అనుసంధానం, 7) వివిధ కారణాలతో పంట నష్టం జరిగితే తక్షణ పరిహారం అందేట్లు పటిష్టమైన పంటల బీమా పథకం, 8) రైతు కూలీలకు, భూమిలేని రైతులకు కూడా రైతు బీమా వర్తింపు, 9) పోడు రైతులకు, అసైన్డ్ భూముల వారికి క్రయవిక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు, 10) ధరణిని రద్దు చేసి అందుకు బదులు, అందరి భూములకు రక్షణ కల్పించే సరికొత్త రెవెన్యూ వ్యవస్థ, 11) నకిలీ విత్తనాలు, పురుగు మందులపై ఉక్కుపాదం, అందుకు బాధ్యులపై పి.డి. చట్టం కేసులు, కఠిన చర్యలు, వారి ఆస్తులు జప్తు చేసి రైతులకు పరిహారం, 12) ప్రతి ఎకరానికి నీరు అందేట్లు నిర్దిష్ట సమయంలో అసంపూర్ణ ప్రాజెక్టుల పూర్తి.
13) రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం, చట్టపరమైన అధికారాలతో రైతు కమిషన్ ఏర్పాటు, 14) లాభసాటి వ్యవసాయం లక్ష్యంగా, తెలంగాణ పరిస్థితులకు అనువుగా, కొత్త వ్యవసాయ విధానం, పంటల ప్రణాళిక, 15) పంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించగల మద్దతు ధరల పట్టిక. ఇందులో మొత్తం 10 పంటలను పేర్కొన్నారు. అవి వరి ధాన్యం, మొక్కజొన్న, కందులు, సోయా, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్నలు. ఈ 10 పంటలలో దేనికెంత మద్దతు ధర ఇవ్వగలదీ లెక్కలు చెప్పారు. మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకును మినహాయించి తక్కిన ఆరు పంటలకు అప్పుడెంత ఉందో, తామెంత ఇవ్వగలమో పేర్కొన్నారు. ఉదాహరణకు వరికి అప్పుడున్న మద్దతు ధర రూ.2,183 కాగా, తమ వాగ్దానం రూ.2,683 అని ప్రకటించారు. అనగా, రూ.500 పెరుగుదల. ఇది మద్దతు ధర కాగా, ఆరు గ్యారెంటీలలో భాగంగా క్వింటాలుకు రూ.500 బోనస్ అన్నారు. ఆ విధంగా వరికి రూ.1,000 పెరుగుదల అన్నమాట. ఈ బోనస్ 16వ హామీ అయింది.
కొత్త ప్రభుత్వం ఏర్పడినాక వీటి అమలు వేగంగా జరిగిపోవాలని రైతులేమీ ఆశించి ఉండరు. కాని, ప్రభుత్వం 2023 డిసెంబర్‌ల్లో పరిపాలనను మొదలుపెట్టి మొదటి యాసంగి ముగిసినాక కనీసం వానాకాలం పంట నాటికైనా అధికార యంత్రాంగం సిద్ధం కావాలి. హామీలలో కొన్ని ఆర్థికపరమైనవి, కొన్ని పరిపాలనాపరమైనవి ఉన్నాయి. పరిపాలనా చర్యల పరమైనవి కూడా ముఖ్యమే అయినా అవి కొంత వెనుక ముందులుగా జరిగినా రైతులు ఓపిక పట్టగలరు. ఆర్థికపరమైన వాటిలో అట్లా ఉండదు. అవి వారి వ్యవసాయ కార్యకలాపాలపై, జీవితాలపై ఎప్పటికప్పుడు వత్తిడి సృష్టిస్తుంటాయి. ఉదాహరణకు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు, ధరణి రద్దు, ‘నరేగా’ను వ్యవసాయ పనులకు అనుసంధానం చేయటం, పథకాల పూర్తి వంటివి క్రమక్రమంగా జరగవచ్చు గాక. కాని రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా, మద్దతు ధరలు, పంట బీమా, పంట కొనుగోలు వంటివి అట్లా కాదు. రైతుకు తక్షణ సమస్యలు.
ఆ విధంగా కాంగ్రెస్ హామీలను వేర్వేరుగా వర్గీకరించి చూడటం, వాటి గురించి అభిప్రాయాలు ఏర్పరచుకోవటం, రైతులకు ఎవరో చెప్పనక్కరలేదు. స్వయంగా అర్థం చేసుకోగలరు. పైన అనుకున్నట్లు ఇప్పటికి నాలుగు పంట కాలాలు గడిచి, ఐదవది నడుస్తున్న సమయంలో, మొదటి పంటను వదలివేసినా, ఆ తర్వాత మూడు పంట కాలాల్లోనూ జరిగిందేమిటో తెలంగాణ రైతాంగం అనుభవించింది. ప్రస్తుతం యాసంగిలో నాల్గవసారి అనుభవిస్తున్నది. ఈ స్థితిలో కాంగ్రెస్ పార్టీని, ఆ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రైతాంగ న్యాయస్థానం విచారించటం కొద్ది వారాలుగా ప్రతిరోజు కనిపిస్తున్నది.
వారు ఇప్పటికిప్పుడు చూస్తున్నది వడ్లు, జొన్నలు, మొక్కజొన్నల వంటి వంటల కొనుగోలు అధ్వాన్నమైన రీతిలో సాగుతుండటం. కొనుగోలు కేంద్రాలు తెరవటం, కాంటాలు వేయటం, తరుగులు, గన్నీ సంచులు, మద్దతు ధరలు చెల్లించని వైనం, బోనస్‌లు..అన్నీ సమస్యలే. ఫలితంగా రైతులు రోజుల తరబడి రాత్రింబవళ్లు పంట రాశులతో, ఈ మండుటెండలలో సరైన తిండీతిప్పలూ లేక వేదనలు పడుతూ రోదించటం. అధికారుల, పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకోవటం. తెలంగాణ రైతాంగం కొంతకాలం క్రితం మరిచిపోయిన ‘బాంచెన్ కాల్లు మొక్తా’ మాటలు మళ్లీ వినవలసి రావటం. ఇంకొకవైపు ముఖ్యమంత్రి మొదలు, ఇతర మంత్రులు, మొదలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదలు, అధికారుల వరకు అంతా సవ్యంగానే ఉందనే అబద్ధాలు. పుండు మీద కారం చల్లినట్లు తాజాగా రైతు ఉత్సవ స న్నాహాలు. అది కూడా రైతులు ఆత్మహత్యలకు పాల్పడటమో, ప్రభుత్వం కొనని పంట కుప్పలపై కూలి చనిపోవటమో జరుగుతున్న వేళ.
ఈ మొత్తం దృశ్యాలన్నీ రీళ్లు చూపినట్లు, మాటలన్నీ రికార్డు వేసినట్లు, గత పంటల కాలాలన్నిటా తెలంగాణ రైతాంగం చూస్తూ వచ్చింది. ఇపుడు మరొకసారి చూస్తున్నది. అందుకే శాపనార్థాలు పెడుతున్నది. ఆ పని ఎవరో చేయమంటే చేయరు రైతులు. కడుపు మండినపుడు, దుఃఖం పొర్ల్లినపుడు, కోపం తన్నుకొచ్చినప్పుడు తామే చేస్తారు. జరుగుతున్నది అదే.
ఇందుకు మరికొన్ని తోడవుతున్నాయి. అవి కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేకపోవచ్చు గాక. కాని వ్యవసాయ రంగానికి, తద్వారా గ్రామీణ ఆర్థిక రంగం మెరుగుపడితే దానిపై ఆధారపడి జీవించే వివిధ వృత్తి కులాల వారి బతుకులకు సంబంధించినవి. అనగా మేనిఫెస్టోలోని హామీలతో పరోక్ష సంబంధం గలవి. కొన్ని ప్రత్యక్ష సంబంధం ఉన్నవి. ఉదాహరణకు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేవలం కేసీఆర్‌పై కక్షతో కాళేశ్వరాన్ని మరమ్మతులు చేయటం లేదన్న విషయం వెంటనే కాకున్నా రోజులు గడిచేకొద్దీ రైతాంగానికి అర్థమవుతున్నది. అది వారి మాటలలోనే కనిపించటం ఎక్కువ అవుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వాలు నీటి ప్రాజెక్టులను, వ్యవసాయ పథకాలను రైతులకు అవసరమైన అనేక కార్యక్రమాలను, సంస్కరణలను, సహాయ చర్యలను నిర్లక్ష్యం చేయటం, వారు దళారుల నుంచి దోపిడీపాలు కాకుండా, అప్పుల భారం పడకుండా కాపాడలేకపోవటం మొదట నుంచి ఉన్నదే. అందుకే రైతు పరిస్థితిగాని, వ్యవసాయ రంగంగాని వెనుకబాటుతనంలో మిగిలిపోయాయి. ఆ పరిస్థితి క్రమంగా మారేందుకు అనేక చర్యలు వేగంగా తీసుకుని ఫలితాలు కూడా చూపిన నాయకుడు కేసీఆర్ అనటం నిర్వివాదం. ఆ స్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తన నిజాయితీ రాహిత్యంతో, అసమర్థ పాలనతో తిరగదోడుతున్నది.
ఈ మొత్తం దృశ్యాలన్నీ రీళ్లు చూపినట్లు, మాటలన్నీ రికార్డు వేసినట్లు, గత పంటల కాలాలన్నిటా తెలంగాణ రైతాంగం చూస్తూ వచ్చింది. ఇపుడు మరొకసారి చూస్తున్నది. అందుకే శాపనార్థాలు పెడుతున్నది. ఆ పని ఎవరో చేయమంటే చేయరు రైతులు. కడుపు మండినపుడు, దుఃఖం పొర్ల్లినపుడు, కోపం తన్నుకొచ్చినప్పుడు తామే చేస్తారు. జరుగుతున్నది అదే. ఇందుకు మరికొన్ని తోడవుతున్నాయి. అవి కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేకపోవచ్చు గాక. కాని వ్యవసాయ రంగానికి, తద్వారా గ్రామీణ ఆర్థిక రంగం మెరుగుపడితే దానిపై ఆధారపడి జీవించే వివిధ వృత్తి కులాల వారి బతుకులకు సంబంధించినవి. అనగా మేనిఫెస్టోలోని హామీలతో పరోక్ష సంబంధం గలవి. కొన్ని ప్రత్యక్ష సంబంధం ఉన్నవి.
– టంకశాల అశోక్