ఏడాదిలో ఎంత మార్పు? సమైక్య పాలకులు దండుగన్న వ్యవసాయాన్ని కేసీఆర్ పదేండ్లలో పండుగలా మారిస్తే కాంగ్రెస్ సర్కారు కేవలం 12 నెలల్లోనే అంతా తారుమారు చేసింది. కేసీఆర్ దూరదృష్టితో ప్రవేశపెట్టిన రైతుబంధు పెట్టుబడి సాయాన్ని చిందరవందర చేసింది. అసాధ్యమైన అర్హతలను సాకుగా చూపి లబ్ధిదారులను సగానికిపైగా తగ్గించబోతున్న సంగతి తెలిసిందే. గడిచిన వానకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి అన్నదాతలకు అందించాల్సిన రూ.26 వేల కోట్ల పంట పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టింది. రైతుకూలీలకు సైతం అందిస్తామని చెప్పిన సాయం ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి.
ఇది ఒక పార్శ్వం మాత్రమే. ప్రభుత్వం మీద ఆశలుడిగిపోయి రైతు సొంతంగా పెట్టుబడి సమకూర్చుకొని కిందామీదా పడి సాగుచేసి పంటదీస్తే దాన్ని కొనుగోలు చేసే నాథుడే కరువయ్యాడు. వానకాలం సీజన్లో 1.56 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తే అందులో సర్కారు ఇప్పటివరకు కొన్నది 47 లక్షల టన్నులు మాత్రమే. సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామనే హామీ బోగస్‌గా మారింది. 50 లక్షల టన్నుల సన్నాల సేకరణ ప్రభుత్వ లక్ష్యం కాగా కొనుగోలు చేసింది 18.78 లక్షల టన్నులు మాత్రమే. తద్వారా తగ్గిన కొనుగోళ్ల వల్ల రైతులకు రూ.1,561 కోట్ల కోత ఏర్పడింది. ఆ కాస్త కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లించాల్సిన మొత్తంలో బకాయిలు పెట్టడం విడ్డూరం. అటు పంట పెట్టుబడి సాయంలో కోత, ఇటు ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చూపుతూ, ఆలస్యం చేస్తూ రైతులను సర్కారు తీవ్ర వేదనకు గురిచేస్తున్నది.
ఇక రైతు రుణమాఫీ అనేది పెద్ద ప్రహసనంలా మారింది. రూ.2 లక్షల పైచిలుకు రుణాల మాట దేవుడెరుగు, అంతకు లోపు ఉన్న రుణాలను ఆగం పట్టించి, అంతంతమాత్రంగా అమలు చేసింది. తూతూమంత్రం రుణమాఫీతో సరిపెట్టి చేతులు దులిపేసుకుంది. గంపెడాశతో ఎదురుచూసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. భూ యాజమాన్య హక్కులకు రక్షణ కల్పించి, బదిలీని సులభతరం చేసిన ధరణి వ్యవస్థను ధ్వంసం చేసింది. మరింత మెరుగైన వ్యవస్థ తెస్తానని చెప్పి మసిపూసి మారేడుకాయ చేసింది. అంతరించిపోయిన భూ తగాదాలకు తన అనాలోచిత నిర్ణయంతో మరోసారి తెరతీసింది.
ప్రాజెక్టులను పడావుపెట్టి సాగునీటి సరఫరాను అస్తవ్యస్తం చేసింది. ఇది రైతులను ఆందోళనకు గురిచేసే అంశమే. మరోవైపు కార్పొరేట్లకు కొమ్ముగాస్తూ పరిశ్రమల పేరుతో భూములు లాక్కొని ఆగమాగం చేస్తున్నది. ఇలా రైతుకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ సర్కారు వైఫల్యం, వారి పట్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. దీని ఫలితంగా రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. చరిత్రలో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని బీరాలు పలికే సర్కారు.. పుస్తకాల్లో పేజీలు చింపేసి తృప్తి పడుతున్నది. రైతు సమస్యల పరిష్కారంపై ఆ మాత్రం శ్రద్ధ పెడితే రాష్ర్టానికి ఎంతో మేలు జరుగుతుంది.