ఏది ఉన్నా లేకున్నా నిజాయితీ లేనివారిని మేధావులు అనవచ్చునా? తెలంగాణలో మేధావుల పేరిట ఒక బృందం చెలామణి అవుతున్నది. సాధారణ నిర్వచనాల ప్రకారం చూసినట్లయితే వారు మేధావులే. బాగా చదువుకున్నవారు. యూనివర్సిటీలలోనో, బయటనో పెద్ద ఉద్యోగాలు చేసినవారు. లేదా ఇంకా చేస్తున్నవారు. సెమినార్లలో, వర్క్‌షాప్‌లలో, సభలలో వారు గొప్పగా ఉపన్యసిస్తారు. అద్భుతమైన థియరీలు చెప్తారు. సునిశితమైన విశ్లేషణలు చేస్తారు. అంతా ప్రజల కోసమంటారు.
మేధావులైనవారికి ఇంతకన్నా ఇంకేమి కావాలి? అందువల్ల వీరిని మేధావులని తప్పకుండా ఒప్పుకోవాలి. అయితే, మేధావులైనవారికి బహుశా మరొక లక్షణం కూడా ఉండాలి కావచ్చు. అది నిజాయితీ. ఈ మాట అనటం ఎందుకంటే, ప్రజలు ఇతరత్రా ఎవరికి ఏ లక్షణాలున్నా గుర్తించి మెచ్చుకుంటూనే, నిజాయితీ అన్నది లేకుంటే మాత్రం పెదవి విరిచి కొట్టివేస్తారు. మేధావుల మేధావితనానికి, గౌరవనీయతకు, విశ్వసనీయతకు నిజాయితీ అన్నది చివరి గీటురాయి అవుతుంది.
Telangana | ఇప్పుడు నిర్దిష్ట అంశాలలోకి వెళ్దాము. ఈ మేధావులు గత అసెంబ్లీ ఎన్నిక ల్లో బీఆర్ఎస్ను వ్యతిరేకించి, కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచార రథాలకు జెండాలు ఊపి మరీ ప్రచారాలు చేశారు. సమస్య అది కా దు. అది వారి అభిప్రాయం, స్వేచ్ఛ. అదం తా వారు ప్రజల మేలును కోరి చేశారనుకోవాలి. అదేవిధంగా మరొకవైపు ప్రజలు తమ తమ కారణాల వల్ల బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారు. ప్రజాస్వామ్యంలో అది ప్రజల స్వేచ్ఛ. ఇంతవరకు దేని గురించి కూడా ఆక్షేపించవలసిందేమీ లేదు. విషయం ఆ తర్వాత నుంచి మొదలవుతుంది. ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఒక గెలిచిన పార్టీకి, ప్రజలకు మధ్య కాంట్రాక్టు ఒకటి ఏర్పడుతుంది. అధికారపక్షం ఆ కాం ట్రాక్టు ప్రకారం నడుచుకుంటే ప్రజలు హర్షిస్తారు. లేనట్లయితే నిరసిస్తారు. ఇటువంటి కాంట్రాక్టు స్థితిలో జెండా మేధావుల వ్యవహరణ ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉం డాలని స్వయంగా వారనుకుంటున్నారు?
మనకు కలిగే ఆలోచన ప్రకారమైతే, వారు జెండాలూపింది ప్రజల కోసమే అయినపక్షంలో, కాంట్రాక్టు భంగపడుతున్నదని భావించటం మొదలైనప్పుడు తాము కూడా ఆ ప్రజల పక్షాన నిలవాలి. లేక కాంట్రాక్టుకు భంగం ఏమీ కలగటం లేదని తమకు తోచినట్లయితే అదే మాట ప్రజలకు వివరించి చెప్పాలి. లేదా కాంట్రాక్టు చక్కగా అమలవుతున్నదనుకున్నట్లయితే ప్రభుత్వాన్ని ధైర్యం గా బలపరచాలి. కాంట్రాక్టు అమలుకు ఇం కా సమయం అవసరమని, ప్రజలు కొంత ఓపిక పట్టాలని అనిపించితే అదైనా చెప్పాలి.
ఈ నాలుగు కాకుండా, తాము అనేక థియరీలు చదివిన మేధావులు గనుక, ఇతర పద్ధతులు ఏమైనా ఉంటే అవన్నా పేర్కొనాలి. కానీ వారు ఏదీ చేయటం లేదు. సమస్య అక్కడే వస్తున్నది. ఇంతకూ వారు జెండాలూపి ప్రభుత్వం మారాలని ప్రజలకు సలహా ఇచ్చింది ప్రజలపై ప్రేమ వల్లనా లేక కాంగ్రెస్ పట్ల ప్రేమతోనా? అనే అనుమానాలు మొదలయ్యేది అటువంటప్పుడే. అది గ్రహించలేని వారేమీ కాదు వీరు. అయినప్పటికీ మౌనంగానే మిగిలిపోతే రోజులు గడిచి న కొద్దీ ఈ అనుమానాలు సహజంగానే బలపడుతాయి.
ప్రజలకు పరిపాలనాపరమైన కాంట్రాక్టు అధికారపక్షంతో అయితే, నైతికమైన కాంట్రా క్టు ఈ జెండా మేధావులతో ఉంటుంది. సమాజంలో మేధావులది ఒక ప్రత్యేక స్థానం గనుక. ఇందుకు ఒక పోలిక చెప్పాలంటే, ఒక ఉత్పత్తికి ఫలానా మంచి గుణాలు లేకపోయినా ఉన్నాయంటూ ప్రచారాలతో ప్రమోట్ చేసే సినీతారలకు నైతిక బాధ్యత ఉండటం వంటిదన్న మాట. వారికి అటువంటి బాధ్యత ఉంటుందని కోర్టులు తీర్పు చెప్పాయి కూడా. అటువంటి సందర్భాలలో కొందరు తారలు, క్రీడాకారులు ఆ ప్రచారాల నుంచి ఉపసంహరించుకునే నిజాయితీ చూపటం మనకు తెలుసు.
నిజాయితీ లేని మరికొందరు ఏవో ప్రయోజనాల కోసం అట్లానే కొనసాగుతున్నారు. వారి గురించి ఏమనుకుంటాము? ప్రజల బాగోగులతో నిమిత్తం లేకుండా సదరు కంపెనీలతో కాం ట్రాక్టులే వారికి ముఖ్యం అనుకుంటాము. ఈ మేధావుల విషయంలోనూ అట్లాగే భావి ంచవలసి వస్తుంది. అటువంటి అనివార్య స్థితిని సృష్టిస్తున్నది వారే. ఆ పని ఇతరులు చేసినట్లయితే పట్టించుకోనక్కరలేదు. కానీ మేధావులనేవారు చేయడమంటే వారిని ఏమనాలో తోచదు. నిజాయితీగా, నిష్పక్షపాతంగా, ద్వంద్వ ప్రమాణాలు లేకుండా, కప ట బుద్ధి లేకుండా ఉండాలని కోరటం తప్ప.
ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాము. ఎన్నికల సమయంలో ప్రజలకు, కాంగ్రెస్‌కు మధ్య కాంట్రాక్టు జరిగినవి కొన్నున్నాయి. అందుకు జెండా మేధావులు తమ ప్రచారాల కారణంగా పరోక్ష సంధానకర్తలయ్యారు. చెప్పుకోవలసిన విషయాలు చాలానే ఉన్నాయి గాని ముఖ్యమైన కొన్నింటిని చూద్దాము.
వాటిని ముఖ్యమని పరిగణించటం ఎందుకంటే, తెలంగాణ ప్రజలలోని పెద్ద సంఖ్యల వారితో వాటికి నిమిత్తం ఉంది. వారి జీవితాలలో అవి చాలా ముఖ్యమైన విషయాలు. అటువంటి వాటిలో ఉద్యోగ నియామకాలు ఒకటి. రైతాంగం కోసం చేస్తామన్నవి మరొకటి. పేదల సంక్షేమ సంబంధమైనవి మూడవది. ఈ మూడింటిని మాత్రం చెప్పుకుందాము.
ఉద్యోగాలకు సంబంధించి కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఈ విధంగా ఉంది. ‘అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, స్పెషల్ డిపార్టుమెంట్ నియామకాల మిషన్ ద్వారా చేపట్టబడుతాయి. దరఖాస్తుదారులు ఎవ్వరూ ఒక్క రూపాయి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.’ కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7న ఏర్పడింది. ఈ వ్యాసం రాసే రోజుకు 8 నెలల 5 రోజులు పూర్తయ్యాయి. ఇంకా మిగిలింది 3 నెలల 25 రోజులు. గడిచిన 8 నెలల 5 రోజులలో ప్రస్తుత ప్రభుత్వం తన వైపు నుంచి ఇచ్చిన ఉద్యోగాలు శూన్యం. అనగా, తక్కిన 3 నెలల 25 రోజులలో ఇవ్వవలసినవి 2 లక్షలు. ఆరు గ్యారెంటీలలో భాగంగా బాండ్‌పేపర్‌పై రాసి, సంతకం చేసి, రాహుల్‌గాంధీతో చెప్పించి, ఇంటింటికి వెళ్లి హామీ ఇచ్చిన మొత్తానికి మొత్తం 2 లక్షలన్నమాట.
ఇక ఇందుగురించి జరుగుతున్న వాటిని మాట్లాడుకోవాలంటేనే అలసట కలుగుతున్నది. ఇంత సుదీర్ఘకాలంలో ఒక్కటంటే ఒక్క కొత్త ఉద్యోగమైనా ఇవ్వకపోవటమే గాక, గత ప్రభుత్వ ఉద్యోగాలు 30 వేలను తమవని నిర్భయంగా అబద్ధపు మాటలు పదే పదే చెప్తున్నారు. చివరికి అసెంబ్లీలోనూ గవర్నర్‌తో అదే అబద్ధం చెప్పించి, బడ్జెట్ ప్రసంగంలో సైతం అబద్ధమాడారు. అది అబద్ధమని స్వయంగా నిరుద్యోగులే తిరస్కరిస్తున్నా ధోరణి మారటం లేదు. ఒక్క ఉద్యోగమిచ్చినట్లు రుజువు చేసినా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అసలు రాజకీయాలనే వదిలివేయగలనని కేటీఆర్ పలుమార్లు సవాలు చేసినా ప్రభుత్వ పెద్దల నుంచి స్పం దన లేదు. ఇది చాలదన్నట్లు, రాబోయే 90 రోజుల్లో ‘మరో 30 వేల’ ఉద్యోగాలిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జూలై 26న ప్రకటించారు. ఆ విధంగా జరుగుతుందనుకు న్నా ఇంకా లక్షా డబ్భు వేల ఉద్యోగాలు, వాటి గడువుకు కేవలం 72 రోజుల సమయం మిగులుతాయి.
ఇంతకుముందే, అసలు ఏడాది గడువంటూ మొదలైన నెలన్నరకే సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జనవరి 24న మాట్లాడుతూ, చదువుకున్న వాళ్లందరికీ ఉద్యోగాలు సాధ్యం కాదని, అర్హులైన వారికి ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు మాత్రం ఇవ్వగలమని స్పష్టం చేశారు. ప్రభుత్వపు అసలు ఆలోచనలు బయటపెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇవ్వక యువతీ యువకులను మోసం చేసిందంటూ కాంగ్రెస్‌తో పాటు మేధావులు సాగించిన ప్రచారంలోని నిజానిజాలను పక్కన ఉంచుదాం. కానీ, ఆ పార్టీ వారు, ఈ మేధావులు కలిసి నిరుద్యోగులకు హామీ ఇచ్చిన ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కాంట్రాక్టు ఒప్పందం అమలుతీరు ఇంత దగాకోరుతనంగా ఎందుకున్నట్లు? నిరుద్యోగుల ఆందోళనలపై ప్రభు త్వం స్పందించదు సరే. మేధావుల పెదాలు ఎందుకు విప్పుకోవటం లేదు?
రైతాంగం విషయానికి వస్తే, మ్యానిఫెస్టోలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట 9 అంశాలు, ‘వ్యవసాయము-రైతు సంక్షేమం’ పేరిట మరికొన్ని ఉన్నాయి. వీటిలో, అధికారానికి వచ్చిన ‘వెంటనే’ చేసేవి, సత్వరం చేసేవి, క్రమక్రమంగా చేసేవి మొత్తం మూడు విధాలుగా ఉన్నాయి. వీటి అమలు ఏ విధంగా ఉన్నదో రైతులు రాష్ట్రవ్యాప్తంగా మాట్లాడుతున్నారు.
ఒకే ఉదాహరణ చెప్పాలంటే, మ్యానిఫెస్టో ప్రకారం రైతు భరోసా పథకం రైతులకు, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు వంద రోజుల్లోనే అమలు కు తేవటంతో పాటు వరికి బోనస్ ఇవ్వాలి. అన్ని పంటలకు ఇవ్వగలమని తర్వాత ప్రకటించారు. ఇవేవీ 100 కాదు గదా 250 రోజులైనా అమలుకాకపోవటమే గాక, వ్యవసాయమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నెల 6న మాట్లాడుతూ ఈ పని ఇప్పట్లో జరిగేది కాదని సూచించారు. అసలు ప్రభుత్వం ఇంతవరకు రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీల లెక్కలైనా తేల్చలేదు. రైతుబంధుపై అసెంబ్లీలో చర్చ అన్నారు. మంత్రుల కమిటీతో అన్ని జిల్లాలలో అభిప్రాయ సేకరణ అన్నారు. ఏవీ జరగలేదు.
సంక్షేమాల మాటైతే చెప్పనే అక్కరలేదు. ఉదాహరణకు 100 దినాలు కాదు గదా 250 గడిచినా ఎవరి పింఛన్లూ పెరగలేదు. పలు ఇతర హామీల అమలు అసలు మొదలు కాకపోగా రెండు మూడు మాత్రం పేరుకు ఆరంభించి పక్కన పెట్టారు. నిధులు కష్టమని ముందే తెలిసినా, కేవలం ఓట్ల కోసం మభ్యపెట్టి మోసగించారని ప్రజలకు అర్థం కావటం మొదలైంది. తాము చేస్తున్నది మోసమని ముందే తెలియని అమాయకులు కాదు కాంగ్రెస్ వారు. అదే పద్ధతిలో, కాంగ్రెస్‌తో కలిసి తాము కూడా మోసం చేస్తున్నట్లు ముందే గ్రహించలేని అమాయకులా జెండా మేధావులన్నది ప్రశ్న. ఇటువంటి నిజాయితీ రహితులు, ఇప్పటికీ నోరు విప్పనివారిని మేధావులనగలమా?
– టంకశాల అశోక్