ప్రతిపక్షాలు ఇరకాటంలో పడేలా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు నెలల ముందే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే బీఆర్ఎస్ అభ్యర్థుల్లో 115 మందిని ప్రకటించారు. అందులో దాదాపు 110 మంది సిట్టింగ్ అభ్యర్థులకే మళ్ళీ టికెట్టు కేటాయించారు. అలాగే కొద్దిమార్పులతో మిగతా టికెట్లు ప్రకటించారు. ఇంతకు ముందు ఇలాంటి ప్రయోగం దక్షిణ భారతదేశంలో ఎవరూ చేయలేదు. మొదటిసారి ఇలాంటి సాహసం చేసింది ముఖ్యమంత్రి కేసీఆరే. అది ఆయన నమ్మకం, ధైర్యం.
కేసీఆర్ ఏది చేసినా అందులో సర్ప్రైజ్ ఉంటుంది. అలాగే వాస్తవికత ఉంటుంది. ఈ ప్రకటన కూడా పార్టీకి, పార్టీ కార్యకర్తల కు, ప్రజలకు సర్ప్రైజ్ అనుకోవాలి. ఇదెవరు ఊహించనిది. ఒకే పనిని భిన్నంగా చేయడం కేసీఆర్ గొప్పతనం. ఇది రాజకీయాల్లో కొద్దిమందికి మాత్రమే సాధ్యం. అంతేకాదు మళ్లీ గెలుపు మాదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ మాటలు ప్రజలను మభ్యపెట్టడానికి చెప్పలేదు. అభివృద్ధి చేశారు. ప్రగతిని సాధించారు. కాబట్టి చెప్తున్నారు. ఇవాళ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో దానికి అదనంగా కేసీఆర్ అభివృద్ధి చేసి చూపించారు. తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో ఎన్నో ప్రయోగాలు జరిగాయి. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసి మెరుగైన వ్యవస్థను తీసుకువచ్చారు. ఎందుకంటే గతంలో పరిపాలన విభాగాలు చాలా మూస ధోరణిలో ఉండేవి.
ప్రజలకు సకాలంలో ప్రభుత్వ ఫలాలు అందేవి కావు. అవి అందే దాకా నమ్మకం ఉండేది కాదు. ఇవాళ పరిపాలన చాలా వేగవంతమైంది. సకాలంలో ప్రభుత్వ ఫలాలు ఎలాంటి అవినీతి లేకుండా అందుతున్నాయి. ఉదాహరణకు రైతుబంధు కానీ, షాదీ ముబారక్ గాని, సీఎంఆర్ ఫండ్గాని, కల్యాణ లక్ష్మి గాని, రుణమాఫీ గాని. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఒక సాంకేతిక విప్లవం. ఎందుకంటే ఒకసారి భూమి పట్టా అయినా తర్వాత పట్టాదారుని ప్రమేయం లేకుండా దాన్ని ఎవరు మార్పు చేయడానికి వీలు లేదు. ధరణి తెలంగాణలోని అనేక భూ సమస్యలను పరిష్కరించింది. ఇవాళ ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తాం అంటున్నాయి. ధరణి రద్దు చేయడమంటే ఆధునిక వ్యవస్థను, సాంకేతిక రంగాన్ని నాశనం చేయడమే అవుతుంది. ఎన్నో దేశాలు సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందాయి. అదే బాటలో తెలంగాణ నడుస్తుంది నేడు. ధరణిని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. అధికారం అనుభవించారే గానీ వారు ఈ దేశాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారు.
‘గత కాలం కంటే వచ్చేకాలం మేలు’ అన్నారు గురజాడ. కానీ తెలంగాణలోని ప్రతిపక్షాలు వచ్చే కాలం కంటే గతకాలమే మేలంటున్నాయి. వీళ్లకు అధికారాన్ని అప్పగిస్తే రాష్ర్టాన్ని అంధకారం చేస్తారని అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఒక నూతన వ్యవస్థను అమలు చేసినప్పుడు అది అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంటుంది. ఒకప్పుడు డిగ్రీలో ప్రవేశం పొందాలంటే కాలేజీకి పోయి దరఖాస్తు చేసుకోవలసిన పరిస్థితి ఉండేది. ఇవాళ మారుమూ ల గ్రామంలో ఉన్న విద్యార్థి కూడా చాలా సులువుగా ప్రవేశం పొందే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఇవాళ తెలంగాణ రైతాంగానికి జరిగినంత మేలు దేశంలో ఏ రైతుకు జరుగుతలేదు. ఎందుకంటే రైతుబంధు లాంటి పథకం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. రైతుబంధుతో పాటు రైతు బీమా కూడా అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. పక్క రాష్ర్టాలకు చెందిన రైతులు ఈ పథకాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఇవాళ బీమా అనేది దేశంలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకే లేదు. ఒకవేళ ఉంటే వారి వ్యక్తిగత బీమా తప్ప ప్రభుత్వం ఇచ్చే బీమా లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం రైతులకు బీమా కడుతున్నది. ఇది రైతు కుటుంబాలకు మేలును చేకూరుస్తుంది. ఈ పథకాన్ని చూసి మహారాష్ట్ర రైతులు చాలా ఆశ్చర్యపోతున్నారు. అందుకే అక్కడి రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన కోరుకుంటున్నారు. ఇక రుణమాఫీ విషయానికి వస్తే రాష్ట్రంలో లక్షలోపు రుణమున్న ప్రతి రైతుకు మాఫీ అవుతున్నది.ఇలా చెప్పుకుంటూ పోతే రైతులకు విత్తనాలు, ఎరువులు, పరికరాల మీద సబ్సిడీ ఇస్తున్నారు.అలాగే నూతనపంటలకు కూడా సబ్సిడీ ఇస్తున్నారు.
ఇవాళ తెలంగాణ ఆపిల్, అంజీర్, పామ్ ఆయిల్ పంటలు పండించే శక్తిని సాధించింది. తెలంగాణలో రైతాంగానికి సాగునీరు అందించడంలో ముఖ్యమంత్రి బ్రహ్మాండమైన విజయం సాధించారు. ఇవాళ కాళేశ్వరం కింద అనేక రిజర్వాయర్లను నిర్మించుకున్నాం. వీటి ద్వారా ఎన్నో చెరువులను నింపుకోగలుగుతున్నాం. కొన్ని లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురాగలిగాం. ఇదంతా ఒక ప్రణాళికతో జరుగుతున్న ప్రజాభివృద్ధి.
తెలంగాణ స్వరాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి ఫలాలు పొందుతున్నాం. ఈ అభివృద్ధి ఫలాలు నిరంతరం సజావుగా సాగడానికి ముఖ్యమంత్రి సంకల్పమే కారణం. ఆసరా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, బీమా, దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, గృహలక్ష్మి వంటి అనేక పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయి. వీటిలో ఏదో ఒక ఫలం తెలంగాణలోని ప్రతి కుటుంబానికి అందుతుందనడంలో అతిశయోక్తి లేదు. దళిత బంధు ద్వారా దళితులు లబ్ధి పొందడమే కాకుండా ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. తెలంగాణ ప్రజల కొనుగోలు శక్తిని సీఎం పెంచారు. ఈ ఫలాలన్నీ లబ్ధిదారులకు నేరుగా చేరుతున్నాయి. అది ఎలా సాధ్యమంటే సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవడం వల్లనే. సాంకేతిక విజ్ఞానాన్ని పరిపాలన కోసం వినియోగించుకోవడంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో ముందంజలో ఉన్నది. ప్రతిపక్షాలు సాంకేతిక రంగంలోని లోపాలు చెప్పకుండా సాంకేతిక సంఘాన్ని రద్దు చేస్తామనడం విడ్డూరంగా ఉన్నది.
ముఖ్యమంత్రి మూడవసారి కూడా బీఆర్ఎస్దే విజయం అన్నారు. ఇది వాస్తవం ఎందుకంటే కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగుతో పాటు ఆత్మవిశ్వాసం తీసుకొచ్చారు. అలాగే అన్ని సామాజిక వర్గాలు కూడా ఈ ప్రభుత్వంలో లబ్ధిదారులే. ఈ తొమ్మిదిన్నర ఏండ్లలో ప్రజలు ఊహించని విధంగా అభివృద్ధిని, పరిపాలనను చూశారు. అందుకే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం.
– మాందాల భాస్కర్ 97050 53483