రాజకీయాల్లో అబద్ధం తాత్కాలికంగా గెలువవచ్చేమో కానీ, సత్యం ఎప్పుడూ శాశ్వతంగా నిలబడుతుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అచంచల దార్శనికతతో రూపుదిద్దుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై, అప్పటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అల్లిన అబద్ధాల కోటలు సాక్షాత్తూ ప్రపంచ బ్యాంక్ అధికారిక గణాంకాల ఎదుట తలదించుకున్నాయి. ‘కాళేశ్వరం కొట్టుకుపోయింది.. అంతా శూన్యం.. పైసాకు పనికి రాకుండా పోయింది.. తెలంగాణ దివాలా తీసింది’ అంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం చేసిన దుష్ప్రచారం ఇవాళ మేడిగడ్డ బరాజ్ వద్ద నిండుగా వచ్చిన గోదావరి జలాల ప్రవాహంలో కొట్టుకుపోయింది. రేవంత్ ఒక అబద్ధాల పుట్ట అని తేలిపోయింది. ప్రకృతి సాక్ష్యం, ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన అద్భుత గుర్తింపు.. ఈ రెండూ రేవంత్ సర్కార్ దివాలాకోరు బురద రాజకీయాలకు చెంపపెట్టుగా మారాయి.
ప్రభుత్వ పర్యవేక్షణలోని అఫీషియల్ డ్యాష్‌బోర్డ్ డాటా ప్రకారం మేడిగడ్డ వద్ద లక్ష్మీబరాజ్‌కు ఏకంగా 89,230 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నది. నాడు కేసీఆర్ నిర్మించిన ఆ ఇంజినీరింగ్ అద్భుతమే లేకపోతే, ఇవాళ ఇంత భారీ ఎత్తున వస్తున్న ఆ జలాలను ఆపే సామర్థ్యం ఈ రాష్ర్టానికి ఉండేదా? అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ ప్రచారం చేసినట్లు మేడిగడ్డ పూర్తిగా కూలిపోతే, ఇవాళ అదే మేడిగడ్డ వద్ద 90.09 మీటర్ల గరిష్ఠ నీటిమట్టం అంత నిలకడగా ఎలా ఉన్నదో ఈ అబద్ధాల పుట్ట సమాధానం చెప్పాలి.
ముఖ్యమంత్రి ఊరూరా తిరిగి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ‘లక్ష కోట్ల అవినీతి’ అంటూ చేసిన ప్రచారం కేవలం రాజకీయ కక్షసాధింపేనని స్పష్టమైంది. నిధుల మళ్లింపు లేదు, వృథా లేదు. నాడు కేసీఆర్ దూరదృష్టి వల్లే ఇవాళ తెలంగాణలోని కోటి ఎకరాల మాగాణం పచ్చని పంటలతో కళకళలాడుతున్నది. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ సుపరిపాలన, అద్భుతమైన ఆర్థిక నిర్వహణ కారణంగానే ప్రపంచ బ్యాంక్ తెలంగాణను ‘ఎగువ మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థ’ క్యాటగిరీలో చేర్చి రేవంత్ నోటిని మూయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ తలసరి ఆదాయం రూ. 4.19 లక్షల మార్కును దాటి, దేశంలోనే అగ్రగామి రాష్ర్టాల్లో ఒకటిగా నిలిచింది.
ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ఈ గుర్తింపు, కేసీఆర్ పాలనాదక్షతకు లభించిన అంతర్జాతీయ సర్టిఫికెట్. రేవంత్‌రెడ్డి తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రాష్ర్టాన్ని దివాళా రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దారుణం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధిని పక్కనబెట్టి, కేవలం గత ప్రభుత్వంపై బురద చల్లడమే ఏకైక ఎజెండాగా పెట్టుకున్నది. రాజకీయ కక్షల కోసం ప్రాజెక్టులను నిర్వీర్యం చేయాలని చూస్తే, ఇక్కడి రైతులు, ప్రజలు క్షమించరు. అబద్ధాల పునాదులపై కట్టిన కాంగ్రెస్ కోటలు కూలిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. కేసీఆర్ దార్శనికత, చేసిన అభివృద్ధి ఎప్పటికీ తెలంగాణ ప్రజల గుండెల్లో సజీవంగానే ఉంటాయి!
– రఘువీర్ రాథోడ్ 9948480556