రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన తప్పుల తడక అని తేలింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే పేరుతో నిర్వహించిన ఈ ప్రహసనంలో బీసీల జనాభాను తక్కువగా చూపించింది. మండల్ కమిషన్ అంచనాల ప్రకారం దేశంలో బీసీల జనాభా 52 శాతం. ఏ రాష్ట్రంలో చూసినా బీసీల జనాభా 50 కంటే తక్కువ ఉండదు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో మాత్రం బీసీల జనాభా 46 శాతమని ప్రభుత్వం ప్రకటించిన లెక్కలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేలో బీసీల జనాభా 51 శాతంగా తేలింది. పదేండ్లలో బలహీనవర్గాల జనాభా కోటి 85 లక్షల నుంచి కోటి 64 లక్షలకు తగ్గింది.
రాష్ట్ర జనాభా పెరిగినప్పుడు అదే నిష్పత్తిలో బీసీల జనాభా పెరగాలి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నది. మొత్తంగా పదేండ్లలో కేవలం రెండు లక్షల జనాభా పెరిగిందనటం ఈ సర్వేను నమ్మటానికి వీల్లేకుండా చేసింది. తెలంగాణలోని బలహీన వర్గాలను రేవంత్రెడ్డి సర్కారు నమ్మించి మోసం చేసింది. తెలంగాణలో చేసిన సర్వేను పూర్తి అసంబద్ధంగా ఎలాంటి శాస్త్రీయత లేకుండా చేశారు. బీసీల జనాభాను లెక్కించాలని పార్లమెంట్లో 2010లో తీర్మానం చేసిన కాంగ్రెస్ సోషియో ఎకానమిక్ సర్వేను కూడా ఇలాగే అశాస్త్రీయంగా నిర్వహించి నవ్వుల పాలైంది.
జనాభా లెక్కల చట్టాన్ని సవరించి కులగణనను చేర్చాల్సిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అవేమీ చేయకుండా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా నిర్వహించిన ఆ సర్వే తప్పులమయంగా మారింది. ఇప్పటివరకూ ఆ నివేదిక బహిర్గతం చేయలేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో, రాష్ట్రంలో బీసీల గణనపై ఎప్పుడేం చేసినా ఎలాంటి నిబద్ధత లేకుండా మొక్కుబడిగా చేయటం వల్లే బలహీన వర్గాలకు దక్కాల్సిన వాటా దక్కట్లేదు.
మరోవైపు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి… ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాత్రం పార్టీపరంగా ఇచ్చేందుకు సిద్ధమంటున్నారు. రాష్ట్రంలో సగం కంటే ఎక్కువ మంది ఉన్న బీసీలకు ఈ తప్పుడు గణన వల్ల సంక్షేమ పథకాల్లో, రాజకీయ ప్రాతినిధ్యంలో తీవ్ర అన్యాయం జరగనున్నది. ఆ పార్టీ ఎమ్మెల్సీయే ఆ నివేదికను కాల్చేయడం గమనార్హం. బీసీ రిజర్వేషన్ల బిల్లును శాసనసభలో ప్రవేశ పెట్టకుండా నివేదికను మాత్రమే చర్చకు పెట్టడం కచ్చితంగా మోసమే.
– అనిల్ కుర్మాచలం, కార్పొరేషన్ మాజీ చైర్మన్