Congress Govt | పిల్లాపాపలతో తలదాచుకున్న గూడుపై రాబందులు విరుచుకుపడిన బీభత్స, భయానక దృశ్యం రాష్ట్ర ప్రజలను వేధిస్తున్నది. అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరిట రాష్ట్రంలోని నిరంకుశ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ధ్వంసరచన కనీవినీ ఎరుగని స్థాయిలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. హైడ్రా పేరిట సర్కారు సాగిస్తున్న కర్కోటకం ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నది. దీని ఫలితంగా ప్రభుత్వంపై వ్యక్తమవుతున్న ప్రజాగ్రహం కూడా మిన్ను ముట్టింది. పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న కలల గూడు చెదిరిపోతుంటే తెలంగాణ ఆడబిడ్డలు తిరగబడి దుర్మార్గ ప్రభుత్వంపై కురిపించిన తిట్లు వైరల్ అవుతున్నాయి. ఆందోళన తరిమి తరిమి ఆత్మహత్యలకు పురికొల్పుతుంటే మండే గుండెల్లో నుంచి తిట్లు కాక దీవెనలెలా వస్తాయి? అమాయక జనాలను మాయదారి సర్కారు ఆగమాగం చేసిన ఫలితం కాదా ఇది?
బాధ్యత గల ప్రభుత్వం పేదల బాధల గురించి ఆలోచించాలి కదా? నిన్నటిదాకా తెలియదా అక్రమమో, సక్రమమో? జాగా అమ్మకం జరిగినప్పుడు రిజిస్ట్రేషన్ ఆదాయం పొందినప్పుడు లేని, కరెంటు కనెక్షన్ ఇచ్చి బిల్లు వసూలు చేసినప్పుడు లేని, ఆస్తిపన్ను కట్టించుకొన్నప్పుడు లేని అక్రమ ముద్ర రాత్రికి రాత్రే గుర్తుకువచ్చిందా? ఇప్పటికిప్పుడు ఇంటిగోడల మీద రక్తాక్షరాలు రాయడం ఏమిటి? ప్రాణాలు బలిగొనడం ఏమిటి? యుద్ధంలో శత్రుదేశం మీదకు శతఘ్నులను తోలినట్టుగా పేదల ఇండ్ల మీదకు ఉన్నపళంగా బుల్డోజర్లను నడిపిస్తే ఎలా? వారి నుంచి ఇంతకాలంగా వసూలు చేస్తున్న పన్నులూ, సుంకాలూ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తారా? మూసీ మధ్యన ప్రభుత్వ భవనాలూ ఉన్నాయి. మరి వాటినీ కూలుస్తారా? హైదరాబాద్లోని అనేక జలవనరుల్లోని స్థలాలు కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఆక్రమణలకు గురయ్యాయి. ఆ పార్టీలను నిలదీస్తారా? సామాన్యులపై ఉక్కుపాదం మోపుతున్నట్టుగానే అస్మదీయుల ఆస్తులూ కూలుస్తారా?
బుల్డోజర్ కథ ఎక్కడో మొదలై, ఎన్నెన్నో మలుపులు తిరిగి చివరికి పేదల ఇండ్ల మీద పిడుగుపాటులా విరుచుకుపడటం మనం చూస్తున్నాం. బాధితుల హాహాకారాలు, ఆర్త నాదాలు దయలేని దగా ప్రభుత్వంపై శాపనార్థాలై విరుచుకుపడటం మనం వింటు న్నాం. దిక్కుతోచని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటున్న నిస్సహాయులకు బీఆర్ఎస్ నాయకత్వం ‘మేమున్నా’మంటూ అండగా నిలవడం ప్రశంసనీయం. జనతా గ్యారేజ్ తెరిచి 24 గంటలు అందుబాటులో ఉంటామని హామీ ఇవ్వడం హర్షణీయం. కట్టడమే తెలిసిన పాలన నుంచి కూలగొట్టడమే పనిగా పెట్టుకున్న పాలనలోకి వెళ్లిపోయామనే బాధ ప్రజల్లో స్పష్టంగా వ్యక్తమవుతుండటం గమనార్హం.
ఈ నేపథ్యంలో హైకోర్టు హైడ్రా వ్యవహారంపై వెలువరించిన తీర్పు చెడగొట్టు ప్రభుత్వానికి చెంపపెట్టు. న్యాయవ్యవస్థతోనే దోబూచులు, దొంగాటలు ఆడుతున్న ప్రభుత్వంపై, ముఖ్యంగా హైడ్రా బాధ్యులపై ఉన్నత న్యాయస్థానం తీవ్ర విమర్శలు చేసింది. అడ్డూఅదుపూ లేని దూకుడుకు కళ్లెం వేసింది. తక్షణమే దారికి రాకపోతే అసలుకే ఎసరు వస్తుందని, ఏకంగా హైడ్రానే రద్దు చేయాల్సి వస్తుందని తాఖీదు జారీచేసింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అంటూ నాలుగు ముక్కలను పట్టుకుని వీరంగం వేస్తున్న ప్రభుత్వానికి గట్టిగా గడ్డి పెట్టింది. ఇప్పటికైనా ప్రభుత్వం తన బాధ్యతను గుర్తెరిగి తప్పులు దిద్దుకోవాలి. సామాన్యులను కడగండ్ల పాలుచేస్తున్న ఇష్టారాజ్యపు నిర్వాకానికి తెరదించాలి. చేసిన హరాకిరిపై చెంపలు వేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఇప్పుడు హైకోర్టులో జరిగినట్టుగానే రేపు ప్రజాకోర్టులో పరాభవం తప్పదు.