రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ విధించే చలానాలు ఇప్పుడు పేద, మధ్యతరగతి ప్రజల రోజువారీ ఖర్చులో భాగమైపోయాయి. కష్టపడి సంపాదించిన డబ్బుతో కడుపు నింపుకోవడం, ఇంటి అద్దె కట్టడం, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించడం.. ఇవే పెద్ద భారంగా ఉన్న పరిస్థితుల్లో తరచుగా పడుతున్న ఈ జరిమానాలు వారి ఆర్థికస్థితిని ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. ఒక సామాన్య కూలీ ఒక రోజు కష్టపడితే వచ్చేవి రూ.600 నుంచి రూ.700. అలాంటి వ్యక్తి వారంలో ఒకటి, రెండు రోజులు పోలీసు తనిఖీల్లో చిక్కి రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానా కడుతున్నాడు. ఆ జరిమానా ఖర్చుతో వారి కుటుంబానికి తీరని నష్టం వాటిల్లుతున్నది. డబ్బు నష్టమే కాదు, రెండు రోజుల శ్రమ కూడా వృథా పోతున్నది. ‘కష్టపడేది మేము, కట్టేది ప్రభుత్వానికి’ అన్న భావనతో సామాన్య ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భద్రత మాటున వసూళ్ల వేట: ట్రాఫిక్ నిబంధనల అమలు, రోడ్డు భద్రత కోసమే చలానాలు విధిస్తున్నట్టు పోలీసులు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీరు మాత్రం భిన్నంగా ఉన్నది. పగటి పూట కంటే, కూలీలు పని ముగించుకొని ఇంటికి తిరిగివెళ్లే సాయంత్రం వేళల్లోనే పోలీసులు విచ్చలవిడిగా తనిఖీలు నిర్వహిస్తూ చలానాలు విధిస్తున్నారు. దీనివెనుక ఉన్న ముఖ్య లక్ష్యం పైసల వసూలే తప్ప, భద్రత కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడం కంటే, వాళ్లు ఎక్కడ దొరుకుతారా అని కాపు కాయడంపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు, పశువులు తిరుగుతున్నా పట్టించుకునే వారుండరని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతలు పూడ్చడంలో నిర్లక్ష్యం వహించే ప్రభుత్వం చలానాల వసూలులో మాత్రం వేగం ప్రదర్శిస్తుండటం విడ్డూరం. పన్నులు, చలానాలు, బిల్లులు వసూలు చేయడంలో చూపే చురుకుదనాన్ని, ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో చూపడం లేదన్నది వాస్తవం.
చలానాలు ఎటు మళ్లుతున్నాయి?: ట్రాఫిక్ నిబంధనల అమలు ద్వారా వస్తున్న ఈ భారీ ఆదాయం ఎక్కడికి చేరుతున్నదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చలానాల ద్వారా వసూలైన డబ్బును రోడ్ల మరమ్మతులు, మెరుగైన ట్రాఫిక్ సిగ్నలింగ్, వాహనాల భద్రత కోసం వెచ్చిస్తున్నట్టు ప్రభుత్వం ఎక్కడా తెలపడం లేదు. ఈ నిధులను ప్రభుత్వం పారదర్శకంగా ప్రజా సౌకర్యాల కల్పనకే వినియోగిస్తున్నట్టు నిరూపించగలిగితే ప్రజల్లో ఉన్న ఆగ్రహం కొంతవరకైనా తగ్గుతుంది.
– వెంకగారి భూమయ్య 98485 59863