బీహార్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఐదింట నాలుగు వంతుల మెజారిటీతో తిరుగులేని విజయం సాధించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా గఠ్ బంధన్ (ఎంజీబీ) మట్టికరిచింది. ఊహించని విజయం కానప్పటికీ, గెలిచిన సీట్లు అంచనాలను మించిపోయాయని చెప్పాలి. అద్వితీయ ఫలితాలను చూసి దేశమే విస్తుపోయింది. ఇంతకూ ఎన్డీయే ఈ అపురూప విజయాన్ని ఎలా సాధించింది?
ఎన్డీయే మహోధృతి, ఎంజీబీ ఘోర దుర్గతికి కారణాలేమిటనేది ఆలోచిస్తే, ముఖ్యంగా నాలుగు అంశాలు మన దృష్టికి వస్తాయి. అందులో మొదటిది ఓటర్ల జాబితా ఉధృత సవరణ క్లుప్తంగా ‘సర్’. ఇది బీజేపీకి అనుకూలంగా జరిగిన గోల్మాల్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరున్నొక్క రాగంలో ప్రచారం చేశారు. పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్లతో అదరగొట్టారు. అందులో నిజానిజాలు ఇంకా పూర్తిగా తేలలేదు కానీ, ఓటర్లు మాత్రం ఆ విషయాన్ని ఏమాత్రం ఖాతరు చేయలేదని ఫలితాలు నిరూపిస్తున్నాయి. ఆడలేక మద్దెల ఓడు అన్న తరహాలో కాంగ్రెస్ నాయకుడు పదేపదే ఇదే రాగం ఎత్తుకుంటున్నారని ఎన్డీయే నేతలు కొట్టిపారేశారు.
అయినా ఎన్నికల సంఘం గురించి ప్రజలకు ఏం ఆసక్తి ఉంటుంది? రెండోది, ఐక్యత. ఎన్డీయే కూటమి మొదటి నుంచి ఐక్యంగా నిలిచి ప్రచారంలో చెట్టపట్టాలు వేసుకొని ముందుకుసాగింది. ఎంజీబీ కూటమి సీట్ల లెక్క తేల్చేందుకే అధిక సమయం తీసుకోవడం, ప్రచారంలో సమన్వయం లేకపోవడంతో ప్రజల దృష్టిలో ఆ కూటమి నేతలు పలుచనయ్యారు. మూడోది, సీఎం అభ్యర్థి. సిట్టింగ్ సీఎం నితీశ్ కుమార్‌ను ముందు పెట్టుకుని ఎన్డీయే ఎన్నికల గోదాలోకి దిగింది. సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించి, అభివృద్ధి సాధించిన నేతగా ఆయన గురించి ఎన్డీయే ప్రచారం చేసుకున్నది. ఇటు ఎంజీబీ తేజస్వీ యాదవ్ పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. నితీశ్ కుమార్ అనుభవం, పాలనా నైపుణ్యం ముందు తేజస్వీ తేలిపోయారు. నాలుగోది, వ్యూహం.
బీజేపీ మతతత్వాన్ని కులతత్వంతో అడ్డుకట్ట వేస్తున్నానని కాంగ్రెస్ అనుకున్నది. కానీ, ఎన్ని చెప్పినా చివరకు యాదవ్-ముస్లిం పరిమితి దాటలేకపోయింది. ఎంజీబీకి ఈ విషయంలో ఎన్డీయే కొత్త ఎత్తుగడతో గట్టి ప్రతిఘటనే ఇచ్చింది. ఓటర్లను మహిళలు, మగవారుగా చీల్చి మహా విజయానికి బాటలు వేసుకుంది. అలా చీల్చేందుకు డబ్బును ఉపయోగించుకున్నది. వలసకూలీల రాష్ట్రంగా పేరొందిన బీహార్‌లో మగవారు వేరే ప్రాంతాలకు పని వెతుక్కుంటూ వెళ్లిపోతే, ఇంట్లోని మహిళలు ఒంటిచేత్తో సంసారాలు ఈదాల్సిన అవసరం ఉంటుందనేది తెలిసిన సంగతే. దీన్ని లక్ష్యంగా చేసుకునే ఎన్డీయే వ్యూహరచన సాగింది.
ఎన్నికల్లో డబ్బులు పంచడమనేది మొదటినుంచీ ఉన్నదే. అయితే అది చాటుమాటుగా జరిగిపోతుంది. ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగం గట్టి నిఘా ఏర్పాటు చేసి లెక్కకురాని డబ్బు దొరికితే స్వాధీనం చేసుకుంటుంది. ఇదంతా అసురక్షితమైన పద్ధతి అని ఎవరిని అడిగినా చెప్తారు. ఉచితాలు ఇవ్వడమే రేవడీ (తాయిలం) అంటూ గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈసడించిన సంగతి తెలిసిందే. కానీ, బీహార్‌లో మాత్రం ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద ప్రతి మహిళకు పదేసి వేల రూపాయల చొప్పున మోదీ స్వయంగా పంచారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే బృహత్తర లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టినట్టు ఎన్డీయే పాలకులు చెప్పుకొచ్చారు.
అంతేకాదు, మహిళలు తమ వ్యాపారాల్లో విజయవంతమైతే ఈ పథకం కింద అదనంగా మరో రూ.2 లక్షలు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే, అధికారికంగా, బ్యాంకు ఖాతాల్లోకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో జరిగిన ఈ పథకం/పంపిణీపై ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. అదీ ఎన్నికలకు కొద్ది ముందుగా. ఈ పథకానికయ్యే వ్యయం, ఆచరణీయత అనేవి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదనేది వేరే విషయం. ఈ పంపిణీ మొత్తం మూడు విడతల్లో జరిగింది.
గత సెప్టెంబర్ 26న ఎన్నికలకు రెండు నెలలు ముందుగా ప్రధాని మోదీ స్వయంగా ఈ పథకాన్ని ప్రారంభించి, 75 లక్షల మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.7,500 కోట్లు వేయించారు. రెండో విడత అక్టోబర్ 3వ తేదీ మరో 25 లక్షల మందికి, మూడో విడత అక్టోబర్ 6న మరో 21 లక్షల మందికి రూ.పదేసి వేలు వేశారు. చివరి విడత రోజే ఎన్నికల కోడ్ మొదలుకావడం గమనార్హం.
మొత్తం 1.21 కోట్ల మంది మహిళలకు రూ.12,100 కోట్లు బదిలీ అయ్యాయి. దీనిని ప్రత్యర్థులు ‘డైరెక్ట్ ఓటర్ పర్చేజ్’ (నేరుగా ఓటరును కొనుగోలు చేయడం)గా అభివర్ణించారు. ఆ సంగతి అలా ఉంచితే ఈ పథకం ప్రభావం పోలింగ్‌పై ప్రస్ఫుటంగా కనిపించింది. మహిళా ఓటర్లు బూత్‌లకు పోటెత్తారు. పురుష ఓటర్లలో 62 శాతం ఓటింగ్ మాత్రమే నమోదు కాగా, మహిళా ఓటర్ల పోలింగ్ మాత్రం 71 శాతం దాటడం విశేషం.
ఈ ఒక్క అంశమే ఎన్డీయే కూటమికి అనుకూలంగా పనిచేసిందని చెప్పలేము. కొందరు రాజకీయ విశ్లేషకులు దీన్ని నితీశ్ సాధించిన మహిళాభివృద్ధికి ఓ ‘టాప్ అప్’ మాత్రమేనని అంటున్నారు. అయితే ఈ ‘టాప్ అప్’ ఎన్డీయే తిరిగి గెలిస్తే కొనసాగుతుందని, ఓడిపోతే ఆగిపోతుందని లోపాయికారీగా సోషల్ మీడియాలో ప్రచారం జరిపారనే ఆరోపణలూ ఉన్నాయి.
ఏదేమైనప్పటికీ మహిళల ఓటింగ్ పెరగడం, ఎన్డీయేకు ఘనమైన లబ్ధి చేకూరడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మహిళల ఓటుతో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తే, ఎంఐంఎం స్థాయికి పడిపోయి కాంగ్రెస్ కేవలం ఐదు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ లెక్కలన్నీ అలా ఉంచితే ఎన్డీయే విజయాన్ని కేవలం పైన తెలిపిన నాలుగు అంశాలకే పరిమితం చేసి చూడలేం. నేతల ఇమేజ్‌లు, వ్యూహాలు, ప్రచారసరళి అన్నీ విజేతలకు కలిసి వస్తే పరాజితులకు పనికిరాలేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే బీహార్‌లో జాతీయ పార్టీలు ఏవైనా సరే, ప్రాంతీయ పార్టీల పొత్తుతోనే గెలువగలవని ఈ సందర్భంగా మరోసారి రుజువైంది.
– తుమ్మలపల్లి రఘురాములు 93463 28291