మనది వ్యవసాయక దేశం! మన దేశంలో మెజారిటీ (60 శాతం) ప్రజలు వ్యవసాయం, గొర్రెలు, బర్రెలు, కోళ్లు, చేపల పెంపకాలు, తదనుబంధ వ్యాపారాలపై ఆధారపడి జీవిస్తుంటారు. వాళ్లందరి కొనుగోలు శక్తిని పెంచగలిగితే, వివిధ వస్తువులు కొంటుంటారు. తద్వారా పరిశ్రమలు, ఉద్యోగాలు, విద్య, వైద్యం, మౌలిక వసతులు పెంపొందుతాయి. తర్వాత సాంకేతిక విద్య, సేవా రంగాలకు విస్తరించాలి. ఈ ప్రణాళికతోనే రష్యాను స్టాలిన్, చైనాను డెంగ్ సియావో పింగ్ ప్రగతిపథాన పరుగెత్తించారు.
మన తొలి ప్రధాని నెహ్రూ.. స్టాలిన్ మార్గదర్శకత్వంలో, స్టాలిన్ సహకారంతో హీరాకుడ్, భాక్రానంగల్, నాగార్జునసాగర్ వంటి భారీ ఆనకట్టలతో వ్యవసాయాభివృద్ధికి పునాది వేశారు. బ్యాంకుల జాతీయీకరణ ద్వారా వ్యవసాయానికి రుణ సౌకర్యం కల్పించి హరిత విప్లవాన్ని ప్రోత్సహించారు ఇందిరాగాంధీ. తదనంతర నేతలు వ్యవసాయరంగం పట్ల శ్రద్ధ చూపని కారణంగా నేటికీ వర్ధమాన దేశంగా కునారిల్లుతున్నది భారత్.
ఈ నేపథ్యంలో దేశాన్ని ప్రగతి పథాన పరుగెత్తిస్తా, ప్రపంచం తలెత్తుకుని చూసేంత ఉన్నతస్థితికి తీసుకెళ్తానని చెప్పి గద్దెనెక్కారు మోదీ. భారతీయులంతా ఆశగా ఎదురుచూశారు. కానీ, మోదీ మాత్రం వ్యవసాయాన్ని గాలికొదిలి, కార్పొరేటీకరణ దిశగా పరుగు ప్రారంభించారు. వ్యవసాయాభివృద్ధి ద్వారా మెజారిటీ ప్రజల ఆదాయాలను పెంచకుండా ఎన్ని పథకాలు పెట్టినా, ఇసుక మీద కట్టిన భవనాల్లా కుప్పకూలటం ఖాయం.
ఇలా దేశీయంగా, మోదీ ప్రభుత్వ వైఫల్యాలకు వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకపోవటం ఒక కారణం కాగా, ప్రజాసేవకు , సంపద వికేంద్రీకరణకు తోడ్పడుతున్న ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టడం మరో కారణం. ఉదాహరణకు ఆర్టీసీ, రైల్వేలు ప్రైవేటు వ్యక్తుల పాలైతే సామాన్య ప్రజలకు ప్రయాణాలు, సరుకుల రవాణాలు సాధ్యమయ్యేవా? ప్రభుత్వ బ్యాంకులు లేకుంటే గ్రామీణ రైతాంగానికి రుణ సౌకర్యం లభించేదా? ఈ నగ్నసత్యాన్ని విస్మరించటమే మోదీ వైఫల్యానికి ప్రధాన కారణం. అయినా సరే ఆయన కార్పొరేటీకరణకు ఎంతగా అలవాటుపడ్డారంటే.. కరోనా కష్టకాలంలో పారిశ్రామికరంగం కుదేలైనా భారతీయులకు భరోసా కల్పించిన తల్లి లాంటి వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేటీకరించేందుకు చీకట్లో చట్టం చేశారు. కార్మికులను కార్పొరేట్లకు బానిసలను చేసేలా కార్మిక చట్టాలనూ సవరించారు. అన్నం పండించే అన్నదాతలకు ఒక్క రూపాయి రుణమాఫీ చేయని మోదీ.. బడా కార్పొరేట్లకు మాత్రం పదేండ్లలో రూ.12 లక్షల కోట్ల రుణమాఫీ చేసినట్టు ఆర్బీఐ నివేదిక చెప్తున్నది. కొత్తగా ఒక్క ప్రభుత్వరంగ సంస్థను నెలకొల్పకుండా, ఉన్నవాటిని వరుసబెట్టి తెగనమ్ముతున్న ఏకైక ప్రధాని మోదీ.
టెక్నాలజీ ఇంతగా పెరిగిన ఈ రోజుల్లో ఇంకా పాతకాలపు వ్యవసాయరంగాన్ని పట్టుకువేలాడటమేంటన్న మోదీ భక్త బృందానికి.. వ్యవసాయాభివృద్ధి ద్వారా, మోదీ సమకాలీనుడైన కేసీఆర్ తెలంగాణలో సాధించిన అపూర్వ, అద్భుత ప్రగతే దీటైన జవాబు.
ఉదాహరణకు రాష్ట్ర విభజన తర్వాత స్వామినాథన్ వంటి వ్యవసాయ శాస్త్రజ్ఞులతో చర్చల అనంతరం డెంగ్ సియావో పింగ్ మార్గదర్శకత్వంలో వ్యవసాయాభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళికను రూపొందించుకొని అంకితభావంతో పరిశ్రమించారు. కేవలం తొమ్మిదేండ్లలో ‘ఆకలి తెలంగాణను అన్నపూర్ణగా’- ‘అట్టడుగు రాష్ర్టాన్ని భారత రాష్ర్టాలకు దీటుగా తీర్చిదిద్దారు కేసీఆర్.
‘ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రెండవ ప్రాంతంగా తెలంగాణ’ అన్న సుప్రసిద్ధ ఆర్థికవేత్త సౌరభ్ ముఖర్జియా ప్రశంసలు, నీతిఆయోగ్, ఆర్బీఐ నివేదికలు, ప్రకటనల ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించారు కేసీఆర్. ‘దేశ్ కీ నేత కేసీఆర్’ అంటూ దేశవ్యాప్తంగా ముఖ్యంగా రైతులు ఆనందంగా స్వాగతించటానికి కారణమిదే.
దేశీయంగానే కాదు, విదేశాంగ విధానంలోనూ విఫలమైంది మోదీ ప్రభుత్వం అని పరిశీలకులు అంటున్నారు. అందుకు నిదర్శనాలు ఇవి. గత పాలకులు శత్రు దేశాలైన పాక్, చైనాలతో పరిమితంగానైనా సత్సంబంధాలను, మన చుట్టూ ఉన్న ఇతర దేశాలన్నింటితో మైత్రిని కొనసాగించారు. తద్భిన్నంగా మోదీ హయాంలో పాక్, చైనాలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవులు శ్రీలంక కూడా భారత వ్యతిరేక దేశాలుగా రూపొందాయి. పాక్ వ్యతిరేక ఆఫ్ఘనిస్థాన్ కూడా భారత్ కంటే చైనాతో మైత్రికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నది. ఒక్క భూటాన్ మాత్రం తటస్థంగా ఉంది. పహల్గాం దాడి అనంతరం పాక్‌ను ఉగ్రదేశంగా ప్రకటింపజేయాలన్న లక్ష్యంతో అఖిలపక్ష బృందాలను ప్రపంచవ్యాప్తంగా తిప్పినా, మద్దతును కూడగట్టలేకపోయారు మోదీ. కనీసం తాను చేరిన క్వాడ్ కూటమి దేశాలు ఆస్ట్రేలియా, అమెరికాల మద్దతునూ పొందలేకపోయారు. ఐరాస నివేదిక నుంచి భారత్ ప్రతిపాదించిన ఉగ్రవాదుల పేర్లను పాక్ తొలగింపజేసుకున్నది. ఉగ్రవాద పోషక దేశానికి అప్పివ్వరాదని భారత్ అడ్డుపడినా ఐఎంఎఫ్ రుణాన్ని పాక్ పొందింది. అంతేకాదు, ఐరాస ఉగ్రవాద నిరోధక కమిటీ అధ్యక్ష పదవిని, భద్రతా మండలిలోని తాలిబన్ ఆంక్షల కమిటీ అధ్యక్ష పదవిని కూడా పాక్‌కే కట్టబెట్టారు. గతంలో కశ్మీర్ విషయంలో ఒకటి, రెండు దేశాలు తప్ప, ముస్లిం దేశాలన్నీ పాక్‌కు వ్యతిరేకంగా భారత్‌కు మద్దతు ప్రకటించాయి. అలాంటి భారత్ మోదీ హయాంలో దాదాపు ఒంటరైంది.
మోదీ ప్రభుత్వ వైఫల్యాలకు పరిశీలకులు చెప్తున్న కారణాలివీ.. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకున్నంత కాలం ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని పొందింది భారత్. కానీ, మోదీ హయాంలో ‘మెజారిటీ ఓటర్ల పోలరైజేషన్ లక్ష్యంతో ప్రబలిన మత కల్లోలాలను, మైనారిటీలపై దాడులను, విధ్వంసాలను మోదీ ప్రభుత్వం నిరోధించనందున భారత్ అపఖ్యాతి పాలైంది.
ఇలాంటి ఎన్నో కారణాల ద్వారా మోదీ భారతదేశాధిపతిగా కంటే బడా కార్పొరేట్ల ప్రతిని ధిగా ఎక్కువ పేరుగడించారు. కాబట్టి వ్యవసాయాభివృద్ధికి, భిన్నత్వంలో ఏకత్వ పరిరక్షణకు, ప్రైవేటు సంస్థలకు దీటుగా ప్రభుత్వరంగ సంస్థలను తీర్చిదిద్దటానికి, సంపద వికేంద్రీకరణ ద్వా రా ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వటం ద్వారా, దేశీయంగానూ అంతర్జాతీయంగానూ ప్రభాసిస్తుంది భారత్. మోదీజీ ఆ దిశగా పయనించాలని ఆశిద్దాం.
– పాతూరి వేంకటేశ్వర రావు 98490 81889