ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న నిచ్చెన మెట్ల కులస్వామ్యంలో రాజ్యాంగంలోని లోపాలు నేడు బీసీ జాబితాలోని బీసీ, ఎంబీసీ, సంచార, అర్ధ సంచార, విముక్త జాతుల కులాలకు శాపంగా మారాయి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 78 ఏండ్లు గడుస్తున్నప్పటికీ పాలకుల చేతుల్లో బీసీ కులాలు నయవంచనకు గురవుతూనే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు బీసీ కోటా 42 శాతం అమలు చేయలేమనేది కాంగ్రెస్ పెద్దలకు తెలియని విషయం కాదు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించినంక పదేండ్లకు మొదటిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. శాసనసభ ఎన్నికల ముందు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం వర్గీకరణతో బీసీ కోటా అమలుచేస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా రెండు బీసీ బిల్లులను ప్రతిపక్షాల సంపూర్ణ మద్దతుతో చట్టసభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వ ఆమోదం కోసం దాన్ని పంపింది. కానీ, కేంద్రం ఆమోదించలేదు. దీంతో 2018లో తీసుకువచ్చిన పంచాయతీ, మున్సిపల్ చట్టాలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. గత అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలను సవరించి గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. గవర్నర్ దానికి ఆమోదముద్ర వేయలేదు. ఇక లాభం లేదనుకొని బీసీ రిజర్వేషన్లను పెంచి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని భావించి జీవో నంబర్ 9ని జారీచేసింది. కానీ, జీవో 9 చెల్లుబాటును హైకోర్టులో సవాల్ చేశారు. ఒకవేళ కోర్టుల్లో బీసీ రిజర్వేషన్లకు అడ్డుకట్టపడితే పార్టీపరంగా 42% సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ సందర్భంగా అసలు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలోని లోపాలు, నేటివరకు సుప్రీంకోర్టు తీర్పులను చూద్దాం.
1992లో నాటి కేంద్రప్రభుత్వం 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 243వ అధికరణను రాజ్యాంగంలో చేర్చింది. దాని ప్రకారం దేశంలోని ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా పద్ధతిలో, మహిళలకు 33 శాతంతో పాటుగా వెనుకబడిన తరగతుల పౌరులకు (Backward Class Citizens) స్థానిక సంస్థ ల్లో రిజర్వేషన్లను కల్పించి అమలు చేసింది. ఈ క్రమంలో 2010లో ఐదుగురు జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కె.కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండి యా కేసు తీర్పులో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల అమలుపై ప్రత్యేకంగా మూ డు నిబంధనలను పెట్టింది. వాటిలో మొదటిది, వెనుకబడిన తరగతుల పౌరుల వెనుకబాటు కు సంబంధించి ప్రత్యేక బీసీ కమిషన్ ద్వారా ఆమోదయోగ్యమైన లెక్కలు తీయాలి. రెండవది, ఆ లెక్కలతో బీసీ కోటాను నిర్ధారించాలి.
మూడవది, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లతో కలిపి 50 శాతం నిలువు రిజర్వేషన్లు దాటకూదు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల జాబితా; స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం వెనుకబడిన పౌరుల జాబితా వేర్వేరుగా ఉండాలని అదే తీర్పులో రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పింది. కానీ, పాలకులు మాత్రం విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల రిజర్వేషన్లలో బీసీ జాబితాను ఒక్కటిగానే చూపుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో జీవో 9పై కేసు నడుస్తున్నది. ఈ కేసులో నెగ్గాలంటే స్థానిక సంస్థల్లో 1994 నుంచి 34 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసినప్పటికీ, బీసీ జాబితాలోని ఎంబీసీ, సంచార, అర్ధసంచార, విముక్త కులాలకు నేటికీ ప్రాతినిధ్యం లభించడం లేదని నిరూపించాలి. అందుకు సంబంధించిన లెక్కలను హైకోర్టు ముందుంచాలి.
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు ఇటీవల తప్పుబట్టింది. రాజకీయ వెనుకబాటును ప్రామాణికంగా తీసుకొని బీసీ జాబితాను గుర్తించి స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 2021లో వికాస్ కిషన్‌రావు గవాళి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు తీర్పులో సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీచేసింది. బీసీ రిజర్వేషన్లను ట్రిపుల్ టెస్ట్ ద్వారా అమలు చేయాలని పేర్కొంది. లేనట్టయితే బీసీ రిజర్వేషన్లు లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. అయితే, నేటికీ బీసీ రిజర్వేషన్ల పంచాయితీ తేలనందున మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు నిర్వహించలేదు.
2022లో మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సురేశ్ మహాజన వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసు తీర్పులో ట్రిపుల్ టెస్ట్ ద్వారానే స్థానిక సంస్థల్లో బీసీ కోటా అమలు చేయాలని సుప్రీం త్రిసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని పేర్కొంది. బీసీ గణాంకాలు లేకపోతే బీసీ రిజర్వేషన్లు అమలుచేయవలసిన అవసరం లేదని నొక్కిచెప్పింది. అంతేకాదు, రాజ్యాంగం ప్రకారం ప్రతి ఐదేండ్లకు తప్పనిసరిగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వంతోపాటు దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అంటే 2022 నుంచి దేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా అమలు చేయాలంటే బీసీ గణాంకాలు తప్పనిసరి. అదే విధంగా మొత్తం నిలువు రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ కోటాతో కలిపి 50 శాతానికి మించకూడదు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కులగణన చేసి బీసీ జనాభా 56 శాతం ఉన్నట్టు తేల్చింది.
1992లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన మండల్ కమిషన్ తీర్పులో నిలువు రిజర్వేషన్లు 50 శాతం మించరాదని 9 మంది జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం నిబంధన విధించింది. అయితే, ఒకవేళ బీసీ గణాంకాలు ఆమోదయోగ్యంగా ఉండి, ప్రత్యేక పరిస్థితులుంటే, బీసీల ప్రాతినిధ్యం లేనట్టయితే 50 శాతానికి మించి కూడా రిజర్వేషన్లు అమలు చేసుకోవచ్చని అదే తీర్పులో సుప్రీం తెలిపింది. ఇదిలా ఉంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండానే ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడం వల్ల నిలువు రిజర్వేషన్లు విద్య, ఉద్యోగాల్లో 54 శాతానికి చేరుకున్నాయి. 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి అవి 64 శాతానికి చేరుకున్న విషయం అందరికీ విదితమే.
తెలంగాణలో 134 కులాలను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులుగా గుర్తించి విద్య, ఉద్యోగాల్లో 29 శాతం రిజర్వేషన్లను వర్గీకరణ ద్వారా అమలు చేస్తున్నారు. ఇందులో 14 ముస్లిం కులాలు బీసీ-ఈ గ్రూపులో కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో జీవో 9పై కేసు నడుస్తున్నది. ఈ కేసులో నెగ్గాలంటే స్థానిక సంస్థల్లో 1994 నుంచి 34 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసినప్పటికీ, బీసీ జాబితాలోని ఎంబీసీ, సంచార, అర్ధసంచార, విముక్త కులాలకు నేటికీ ప్రాతినిధ్యం లభించడం లేదని నిరూపించాలి. అందుకు సంబంధించిన లెక్కలను హైకోర్టు ముందుంచాలి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో రిజర్వేషన్లు ఉమ్మడిగా ఉండటం వల్ల నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో జనసంఖ్య తక్కువ ఉండి, ఆర్థికంగా బలంగా లేని 100కు పైగా బీసీ కులాలు కనీసం వార్డు మెంబర్ స్థానానికి కూడా పోటీ చేయలేని పరిస్థితుల్లో జీవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీచేసిన జీవో 9ని సవరిస్తూ 42 శాతం రిజర్వేషన్లను వర్గీకరణ ద్వారా అమలు చేయాలి. అదే విధంగా బీసీ రిజర్వేషన్లపై న్యాయపరమైన సమస్యల శాశ్వత పరిష్కారానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. రాజ్యాంగాన్ని సవరించాలి. రాజ్యాంగంలో విద్య, ఉద్యోగ, ఇతర అంశాలకు సంబంధించిన అధికరణల్లో బీసీ తరగతులను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలుగా (Socially and Educationally Backward Castes) గుర్తించాలి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అధికరణల్లో కూడా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలుగా గుర్తించాలి. లేదంటే బీసీ రిజర్వేషన్ల అమలు ఎప్పటికీ సమస్యగానే ఉంటుంది.
– కోడెపాక కుమారస్వామి 94909 59625