‘మోసపోతే గోసపడతాం. మళ్లీ కాంగ్రెస్ వస్తే అదే గతి పడుతుంది. మళ్లీ చెప్పుల లైన్లు, కరెంటు కోతలు వస్తయి’ అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2023లో ఒక సభలో ప్రజలకు చెప్పారు. ఆయన చెప్పినట్టే తెలంగాణలో నేడు అచ్చం అదే పరిస్థితి కనిపిస్తున్నది. ‘పాలిచ్చే బర్రెను అమ్మి దున్నపోతును కొనుక్కున్నట్టే ఉన్నది. మాయమాటలు, అబద్ధపు హామీలను నమ్మిన తెలంగాణ నేడు మోసపోయి గోసపడుతున్నది.
పాలనానుభవం లేని రేవంత్‌రెడ్డి హయాంలో రాష్ట్రం అన్నిరంగాల్లో ఆగమైంది. ముఖ్యంగా వ్యవసాయ రంగం, రైతాంగంపై కక్ష గట్టిన కాంగ్రెస్ పాలకులు వారికి మరణశాసనాన్ని లిఖిస్తున్నారు. కేసీఆర్ తన పాలనలో 24 గంటల కరెంటు ఇచ్చి, పెట్టుబడి సాయం అందించి, ఎరువులు ఇచ్చి పచ్చని పంటలతో రైతాంగాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపితే, రేవంత్‌రెడ్డి మాత్రం రైతాంగాన్ని గోసపుచ్చుతున్నారు. రుణమాఫీ అరకొరగా చేశారు. రైతుబంధును ఎగ్గొట్టారు. ఇక కరెంటు ముచ్చట చెప్పనవసరం లేదు. ‘ఆనాటి రోజులు తెస్తాడు’ అన్నట్టే నిజంగానే చీకటి రోజులు మళ్లీ తెచ్చారు రేవంత్‌రెడ్డి.
కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు, రైతుల వెతలు. రాష్ట్రంలో యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొలాల్లో వ్యవసాయం చేయవలసిన రైతన్నలు ఒక్క యూరియా బస్తా కోసం రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. ఎక్కడ చూసినా చెప్పుల లైన్లు దర్శనమిస్తున్నాయి. ఇది రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం. ఈ దేశ చరిత్రలో పోలీస్ స్టేషన్లో రైతులను కూర్చోబెట్టి యూరియా ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది. కాంగ్రెస్‌ను నమ్మి ఓటు వేసినందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నామని, కేసీఆర్‌ను దూరం చేసుకొని నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు.
22 నెలల కాంగ్రెస్ పాలనలో సంక్షేమం ఆగిపోయింది. అభివృద్ధి కుంటుబడింది. కేసీఆర్ మొదలుపెట్టి దాదాపు పూర్తి చేసిన పనులకు రిబ్బన్ కట్ చేయడానికి ముఖ్యమంత్రి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నారు. జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులను నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు పెట్టి, ఫలితాలు ఇచ్చిన ఉద్యోగాల నియామక పత్రాలిచ్చి, 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటు. అశోక్‌నగర్ వేదికగా రాహుల్‌గాంధీ నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోగా కనీసం అటువైపు చూసిన పాపాన పోలేదు.
ప్రజలకు ఇచ్చిన హామీలు మరిచిన కాంగ్రెస్ ఎంతసేపు డైవర్షన్ రాజకీయాలే చేస్తున్నది. కేసీఆర్ పాలనలో పచ్చదనం, పరిశుభ్రతతో విరాజిల్లిన గ్రామాల్లో నిధుల కొరతతో పారిశుద్ధ్య నిర్వహణ కూడా చేయలేని పరిస్థితి దాపురించింది. పంచాయతీ ట్రాక్టర్లలో డీజిల్ పోసుకునేందుకు డబ్బులు లేని దుస్థితి ఏర్పడింది. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి పంచాయతీ ఎన్నికలంటేనే జంకుతున్నది కాంగ్రెస్ పార్టీ.
తెలంగాణపై కేసీఆర్‌ది చెరగని ముద్ర. ఆయన ఆనవాళ్లను చెరిపేయాలనుకోవడం మూర్ఖత్వమే. అలాంటి నాయకునిపై కక్ష సాధించాలని చూస్తే తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు. పరిపాలన చేతగాని వారు, పాలనపై పట్టులేనివారు, ప్రాంతంపై ప్రేమ లేనివారే కక్షలకు దిగుతారు. బీఆర్ఎస్ ఎప్పటికీ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుంది. రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, ఫిరాయింపు ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో జరగనున్న ఉప ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. కనుచూపుమేరలో ఎక్కడా కనబడకుండా కాంగ్రెస్‌ను పాతరేసేందుకు ప్రజలు సంసిద్ధులవుతున్నారు.
– తెలంగాణ విజయ్ 94919 98702