2025, జూలై 16న ఢిల్లీలో బనకచర్ల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటైన సందర్భంగా తెలంగాణ వికాస సమితి ఈ లేఖను విడుదల చేస్తున్నది. రేపటి సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఈ డిమాండ్లను చర్చకు పెట్టాలని కోరుతున్నది.
1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టాన్ని, గోదావరి, కృష్ణా అవార్డులను ఉల్లంఘించి పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును చేపడుతున్నది.
2. ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవు. గోదావరి బోర్డు అనుమతి లేదు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రాజెక్టు ప్రాథమిక నివేదికను (Pre Feasib ility Report)ను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ప్రాజెక్టుకు నిధులు సమకూర్చమని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాసింది.
3. పోలవరం నుంచి 200 టీఎంసీల వరద జలాలను తరలించి ఏపీలోని కరువు ప్రాంతాలకు సాగు నీరు, తాగు నీరు అందించడానికి ఈ ప్రాజెక్టును ప్రతిపాదించామని ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు.
4. సముద్రంలో వృథాగా కలుస్తున్న వరద జలాలను మాత్రమే తాము ఈ ప్రాజెక్టు ద్వారా తరలిస్తున్నామని, దీనివల్ల తెలంగాణకు ఏ విధంగానూ నష్టం కలుగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు.
5. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘించి చేపడుతున్న పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు గోదావరి జలాల్లో తెలంగాణ నీటి హక్కులకు భంగకరంగా పరిణమించనున్నదన్న భావన అందరిలో కలుగుతున్నది.
6. రాష్ట్ర విభజన చట్టం, 2014 షెడ్యూల్ XI పేరా 7 ప్రకారం తెలంగాణ రాష్ట్రం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టును చేపట్టడానికి వీల్లేదు.
7. క్లాజ్ 84 ప్రకారం కొత్త ప్రాజెక్టు డీపీఆర్‌ను మొదట గోదావరి/ కృష్ణాబోర్డు, కేంద్ర జల సంఘం పరిశీలించి అపెక్స్ కౌన్సిల్‌కు సిఫారసు చేయాలి. ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించి అనుమతి పొందిన తర్వాతనే కొత్త ప్రాజెక్టును చేపట్టాలి.
8. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిబంధనను ఉల్లంఘించి నేరుగా ప్రాథమిక నివేదికను కేంద్ర జలసంఘానికి పంపించింది.
9. గోదావరి అవార్డు ప్రకారం ఉమ్మడి రాష్ర్టానికి దక్కిన 1,486 నికరజలాల వాటాలో తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించినవి 968 టీఎంసీలు. ఫిబ్రవరి 2014లో రాష్ట్ర శాసనసభలో చర్చ కోసం విభజన చట్టం ముసాయిదాను కేంద్రం పంపినప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా శాసనసభ్యులకు పై సమాచారాన్ని అందజేసింది. అందులో ప్రాజెక్టుల వారీ కేటాయింపులను నమోదు చేసింది.
10. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కేటాయింపులను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాసింది. పైగా తమ ప్రాజెక్టుల కేటాయింపులే 902 టీఎంసీలని పట్టుబట్టింది. తెలంగాణ రాష్ట్రం లోయర్ గోదావరి (జీ-10) సబ్ బేసిన్లో సమర్పించిన కాళేశ్వరం, సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్ ప్రాజెక్టుల డీపీఆర్‌లకు ఆమోదం ఇవ్వొద్దని ఆ లేఖల్లో పేర్కొన్నది.
11. 2023లో ఐఎస్ఆర్డబ్ల్యూడీ చట్టం 1956, సెక్షన్-3 ప్రకారం గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. వారి కోరిక మేరకు త్వరలోనే గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటయ్యే అవకాశం ఉన్నది. గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటుకు ముందే పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును గ్రౌండ్ చేసి వేల కోట్లు ఖర్చుచేసి గోదావరి ట్రిబ్యునల్ ముందు నీటి కేటాయింపులు చేయమని కోరితే తెలంగాణ నికరజలాల కేటాయింపుల్లో కోత పడే అవకాశం ఉన్నది.
12. గతంలో ఇదే వ్యూహాన్ని అనుసరించి కృష్ణా బచావత్ ట్రిబ్యునల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువ కేటాయింపులు పొందగలిగింది. అదే వ్యూహాన్ని గోదావరిలో కూడా అనుసరిస్తున్నది.
13. తెలంగాణ నీటి హక్కులపై చర్చ జరగాలి. ఈ కింద పేర్కొన్న అంశాలపై రేపటి ముఖ్యమంత్రుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన, రాతపూర్వక హామీ ఇవ్వాలి.