‘మార్పు కావాలి – కాంగ్రెస్ రావాలి’ అని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊరూవాడా తిరిగి కాంగ్రెస్ నాయకులు ఊదరగొట్టారు. కాంగ్రెస్ నేతల ప్రగల్భాలు చూసిన కేసీఆర్ ప్రజలకు హితవు పలికారు. ‘కాంగ్రెస్‌కు అవకాశమిస్తే తినే కంచంలో మన్ను పోసుకున్నట్టే’నని ప్రతి సభలోనూ చెప్పారు. కానీ, ప్రజలు మాత్రం కాంగ్రెస్ నేతల మాయమాటలను నమ్మారు, అధికారం కట్టబెట్టారు.
రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే అన్నింట్లో ‘మార్పు’ చేసి చూపిస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టే తెలంగాణలో వారి పాలన సాగుతున్నది. 11 నెలల రేవంత్ పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న మార్పులే అందుకు నిదర్శనం. సంక్షేమం నుంచి సంక్షోభం వైపు, వికాసం నుంచి విధ్వంసం వైపు, నిర్మాణం నుంచి కూల్చివేతల వైపు… మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది.
తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని గతంలో కాంగ్రెస్ నేతలు పదే పదే ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే అప్పులే చేయబోమని కూడా చెప్పారు. కానీ, గద్దెనెక్కిన 11 నెలల్లోనే సుమారుగా రూ.80 వేల కోట్ల అప్పు చేసి కాంగ్రెస్ మార్క్ మార్పును చూపించారు. అధికార పీఠమెక్క గానే రుణమాఫీ చేస్తామని, రైతుభరోసా పథకం ద్వారా ఎకరాకు రూ.7500, కౌలు రైతులకు ఏడాదికి రూ.15 వేలు, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. కానీ, అవన్నీ చేయకపోగా కేసీఆర్ సర్కార్ ఇస్తున్న రైతుబంధును కూడా నిలిపివేశారు. రైతుల జీవితాలను రోడ్డున పడేసి కొత్త మార్పు తెచ్చారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో గుండె మీద చెయ్యి వేసుకొని, మీసం మెలేసిన రైతన్నలు కాంగ్రెస్ హయాంలో అష్టకష్టాలు పడుతుండటమే అందుకు తార్కాణం.
ఆడబిడ్డల పెండ్లిళ్లకు కేసీఆర్ సర్కార్ రూ.లక్ష ఇస్తుం టే.. దానికి అదనంగా తులం బంగారం కూడా ఇస్తామని హస్తం పార్టీ నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు తులం బంగారం సంగతి దేవుడెరుగు కల్యాణలక్ష్మికే కాసులు లేవని చెప్తూ పెద్ద మార్పే తీసుకొచ్చారు. పింఛన్ రూ.4 వేలకు పెంచకపోగా.. రూ.2 వేలను ఎగ్గొట్టి అసలైన మార్పు చేశారు.
రేవంత్ పాలనలో ధర్నాలు, నిరసనలతో తెలంగాణ అట్టుడుకుతున్నది. పదేండ్ల పాటు కానరాని ఆందోళనలు మళ్లీ ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన పోలీస్ యాక్ట్ అసలు సిసలు మార్పు. ఉద్యోగ నియామకాలపై నిరుద్యోగులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ అటకెక్కగా.. అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాల మార్పులకు అశోక్‌నగర్ సాక్ష్యంగా నిలుస్తున్నది.
బంగారు పళ్లెంలో పంచభక్ష పరమాన్నాలతో కూడి న రాష్ర్టాన్ని కాంగ్రెస్ చేతిలో కేసీఆర్ పెట్టారు. వడ్డించిన విస్తరిలా ఉన్న తెలంగాణను సర్వనాశనం చేసిన రేవంత్ సర్కార్ ధనిక రాష్ర్టాన్ని దివాలా తీయించి సరికొత్త మార్పునకు నాంది పలికింది. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరిట పేద, మధ్యతరగతి ప్రజల గూళ్లను కూలుస్తూ వారి బతుకుల్లో మార్పును తీసుకొచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసం కారణంగా ఖజానాకు భారీగా గండిపడిన మార్పు స్పష్టంగా లెక్కలతో సహా కనిపిస్తున్నది. గొర్రెలు, చేప పిల్లల పంపిణీ ద్వారా కేసీఆర్ పశుసంపదను పెంచి, కులవృత్తులను ప్రోత్సహించారు. చేప పిల్లలు, గొర్రెల పంపిణీని నిలిపివేసి కులవృత్తులకు ఉరివేసిన రేవంత్‌రెడ్డి.. ఊహకందని మార్పు తీసుకొచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నించినవారిపై, తమ హక్కుల కోసం నినదిస్తున్నవారిపై, గళమెత్తుతున్నవారిపై అక్రమ కేసులు పెట్టే మార్పు వచ్చింది.
తెలంగాణవ్యాప్తంగా అనేక రంగాల్లో వచ్చిన మార్పు మన కండ్లముందే కనిపిస్తున్నది. అంటే చెప్పిన విధంగా కాంగ్రెస్ మార్పు తీసుకొచ్చినట్టే కదా? ‘మార్పు కావాలి- కాంగ్రెస్ రావాలి’ అన్న నినాదం విజయవంతమైనట్టే కదా!
– శ్రీధర్ ప్రసాద్