1951లో తెలంగాణ సాయుధ ఉద్యమం, 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమం, 2001లో మలిదశ తెలంగాణ ఉద్యమం జరిగింది. అయితే నిజాం నిరంకుశ పాలనా విముక్తి నుంచి 2000 వరకు ఆంధ్ర పాలకుల కబంధ హస్తాల్లో తెలంగాణ కొట్టుమిట్టాడింది. దశాబ్దాల తరబడి దగా పడుతున్న ఈ తెలంగాణకు విముక్తి కల్పించేందుకు స్వరాష్ట్ర సాధనే లక్షంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 2001, ఏప్రిల్ 27వ తేదీన జలదృశ్యంలో ఆవిర్భవించింది. అయితే, 1969 నుంచి తెలంగాణ సాధన కోసం 20కి పైగా పార్టీలు పుట్టినప్పటికీ, అవి స్వరాష్ర్టాన్ని సాధించలేకపోయాయి. టీఆర్ఎస్ మాత్రం అందుకు భిన్నంగా రాజీలేని పోరాటం చేసి నాలుగు కోట్ల ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాకారం చేసింది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన రాజకీయ భవిష్యత్తును సైతం పణంగా పెట్టి, చట్టసభల్లో పదవులను తృణప్రాయంగా త్యజించిన అరుదైన నాయకుడు కేసీఆర్. రాష్ట్ర సాధన ఒక్కటే తెలంగాణ కష్టాలకు పరిష్కారమని నమ్మిన కేసీఆర్ ప్రజలను ఒప్పించడంలో సఫలీకృతమయ్యారు. తెలంగాణ ఉద్యమంలో వారిని భాగస్వాములను చేశారు. చాలామంది ఉద్యమ కారులు, విప్లవకారులు, ప్రాంతీయ పార్టీలు మొదలు చాలామంది వ్యక్తులు, సంస్థలు తుపాకీ గొట్టం ద్వారానే తెలంగాణ సాధిస్తామని ప్రకటించాయి. శత్రువును పారద్రోలాలంటే దండయాత్రనే శరణ్యమని, ‘ఈట్కా జవాబ్ పత్తర్సే దేంగె’ అని శపథాలు చేశాయి.
అయినా వాటితో సాకారం గాని స్వరాష్ట్ర సాధన ఒక్క కేసీఆర్తో సాధ్యమైంది. ముఖ్యంగా కవులు, కళాకారులు, సాహితీ వేత్తలందరికీ ఒక వినూత్న చారిత్రక ఉద్యమ నిర్మాణం చేసే వేదికలో వీళ్లందరిని ఒకేతాటిపై నడపించడంలో కేసీఆర్ దాదాపు దశాబ్దన్నర కాలం ఎన్నో కష్టాలు పడ్డారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. తెలంగాణ వ్యతిరేకులను వంచేందుకు ఆయన ఎంచుకున్న బ్రహ్మాస్త్రం అహింసాయుద్ధం.
2014, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ‘మిషన్ భగీరథ’, ‘మిషన్ కాకతీయ’ వంటి బృహత్తర పథకాలతో రాష్ట్రంలో సాగు, తాగునీటికి కరువు లేకుండా చేశారు. దేశ విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించి నిధులకు కొదువలేకుండా చేశారు. అధికార వికేంద్రీకరణ కోసం జిల్లాలను పెంచారు. జిల్లాలలో దేనికీ కొదువ లేకుండా జిల్లా కార్యాలయాల సముదాయాలను నిర్మించారు.
ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగ సమస్య తీర్చారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన ఉద్యమ లక్ష్యం నెరవేరే విధంగా బృహత్తరమైన కార్యాచరణ తీసుకున్నారు. అందులో భాగంగానే సాగునీటి రంగ అభివృద్ధిలో తెలంగాణ ప్రణాళికలు దేశానికే దిక్సూచిగా నిలిచాయి. ముఖ్యంగా తెలంగాణ సాగునీటి రంగానికి ఊతమిచ్చేందుకు సాహసోపేతమైన అనేక చర్యలు కేసీఆర్ తీసుకున్నారు. అలా సాగునీటి పారుదలకు అగ్రస్థానం ఇవ్వటంతో గత తొమ్మిదేండ్ల వ్యవధిలో రాష్ట్ర నీటి పారుదల రంగం అత్యున్నత స్థితికి చేరుకున్నది.
తెలంగాణ సస్యశ్యామలం కావాలని ప్రజలు తాగు, సాగునీటి కోసం అలమటిస్తున్న పరిస్థితిని చూసి స్వరాష్ట్ర తొలి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ దాహార్తిని తీర్చడం కోసం ఎన్నో మైలురాళ్లను దాటారు. నీటి ప్రాజెక్టులను నిర్దేశించుకున్న వ్యవధిలో పూర్తి చేసేందుకు పడ్డ తపన అంతా ఇంతా కాదు. ఆ క్రమంలో ఎన్నో సమావేశాలు, కార్యక్రమాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ముందుండి నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా పూర్తయ్యేవరకు వ్యూహాత్మక చర్యలు తీసుకున్నారు. ఫలితంగా ప్రాజెక్టులన్నీ అనతికాలంలోనే పూర్తయ్యాయి. అలాగే పాత ప్రాజెక్టులను కూడా విప్లవాత్మక రీతిలో ఆధునీకరించటం వల్ల సాగునీటిరంగ విస్తీర్ణం పెరిగింది. తెలంగాణ గణాంక నివేదిక ప్రకారం సాగునీటి విస్తీర్ణం 2014లో 62 లక్షల 48 వేల ఎకరాలుండగా 2023 నాటికి 1 కోటి 35 లక్షల 60 వేల ఎకారాలకు పెరగడం ఆయన దీక్షా దక్షతకు నిదర్శనంగా భావించక తప్పదు.
అదేవిధంగా అడవులనూ 27 శాతం పునరుద్ధరించారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వగైరా ప్రోత్సాహకాలతో వ్యవసాయరంగాన్ని పరుగులు పెట్టించారు. కేసీఆర్ కృషిఫలితంగా దేశంలోనే అత్యధికంగా వడ్లను పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిన తీరును మనం కండ్లతో చూశాం. దేశ రాజకీయాలను తెలంగాణ రాజకీయాలతో పోల్చి చూసినట్టయితే, భారత్లో నూతన ఆర్థిక విధానాలు ప్రవేశించిన 1990వ దశకం నుంచి ఆర్థిక అసమానతలు ఆకాశాన్నంటుతూ వచ్చాయి.
ఎన్నో ప్రగల్భాలు పలికి గద్దెనెక్కిన మోదీ సర్కార్ పెత్తందారులకే కొమ్ముకాస్తూ, మతపరమైన విద్వేషాలతోనే కాలం గడుపుతున్నది. కోటీశ్వరులు ప్రపంచ కుబేరులుగా ఎదుగుతుంటే, కోట్ల మంది పేదలు నిరుపేదలవుతున్నారు. అతిపెద్ద ఆర్థికవ్యవస్థలో ఐదో స్థానానికి భారత్ ఎదగడం, సామాన్యుల జీవన ప్రమాణాల గణాంకాల్లో 134వ స్థానానికి దిగజారడం అందుకు ఉదాహరణ. ప్రపంచ కుబేరుల రీత్యా పదో స్థానానికి ఎగబాకిన భారత్ పేదరికాన్ని నిర్మూలించుకున్న జాబితాలో 113వ స్థానంలో నిలిచింది. ఇవన్నీ రాజకీయ లెక్కలు కావు. ప్రపంచ బ్యాంకు, తదితర సంస్థల సర్వేలు, ఐరాస అధికార నివేదికలు చెప్తున్న కఠోర వాస్తవాలు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి సుమారు ఏడాదిన్నర కావస్తున్నది. వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలు నెరవేర్చకపోగా పరిపాలన గాడి తప్పుతున్నదని, ప్రజలు అభద్రతాభావంలో ఉన్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్కో రంగం సంక్షోభంలో కూరుకుపోతున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు నాలుగు హామీలిచ్చింది.
రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా కింద ఎకరానికి రూ.15,000, వడ్లకు రూ.500 బోనస్, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల సాయం ఈ నాలుగు హామీల్లో కనీసం ఒక్కటి కూడా అమలు చేయలేకపోయింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు లెక్క ప్రకారం ఇవ్వవలసిన నిధులు ఇవ్వకున్నా నిధుల కొరతతో కటకటలాడుతున్నా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ బీజేపీ పాలనను పల్లెత్తు మాటైనా అనటం లేదు. తెల్లవారితే చాలు ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ను విమర్శిస్తూ ఇష్టమొచ్చినట్టు దూషిస్తూ ఢిల్లీకి సంచులు మోస్తున్నడు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా.. ‘రాష్ట్రం దివాలాలో ఉన్నది. నన్నేం చేయమంటారు. నన్ను కోసుకొని తినండి’ అనటంతో కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ సమయంలోనే వ్యవసాయదారుల నుంచి, ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర తిరుగుబాటును చవిచూస్తున్నది.
అయితే ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభతో అర్థమైన విషయమేమంటే కాం గ్రెస్ పాలనపై తెలంగాణ ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నది స్పష్టమైంది. అయితే ఈ అసంతృప్తి అసమ్మతిలోకి మారేలోపు కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడుతుందా లేదా అనేది పక్కనపెడితే కేసీఆర్ పాలన ఉంటే ఇలా జరిగేది కాదంటున్నారు ప్రజలు. మళ్లీ ఆయనే కావాలని తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నది తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో సోషల్ మీడియా, వివిధ మాధ్యమాల్లో వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో జననేత కేసీఆర్ కృషిని గుర్తుచేసుకోకతప్పదు. స్వరాష్ర్టాన్ని ఆవిర్భవింపజేయడమే కాదు, తెలంగాణ ఆత్మను ఆయన ఆవిష్కరించాడు.
‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అని శ్రీ శ్రీ అన్నట్టుగా మనం కూడా మనతనం ఉన్నవాళ్లను దూరంపెట్టి పరాయిలను అక్కున జేర్చుకోవడం మహాపాపం. మొన్నటి రజతోత్సవ సభలో మనతనం కనపడింది. ఆ నిండుతనం అలానే కొనసాగిస్తే రానున్నకాలంలో జనాదరణ మెండుగా చూరగొనవచ్చుననడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికైనా మాయమాటల మోసగాళ్లను దరిచేరనియకుండా మనతనం ఉన్నవాళ్లను గుర్తిస్తే మన పురోగమనం నిరాఘాటంగా సాగుతుందనేది కాదనలేని సత్యం.
బీఆర్ఎస్ రజతోత్సవ సభతో అర్థమైన విషయమేమంటే ప్రజాపాలనపై తెలంగాణ ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నది స్పష్టమైంది. ఈ అసంతృప్తి అసమ్మతిలోకి మారేలోపు కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడుతుందా లేదా అనేది పక్కనపెడితే మళ్లీ కేసీఆర్ పాలన ఉంటే ఇలా జరిగేది కాదంటున్నారు ప్రజలు.
-ఆర్ఆర్ఆర్