ఏండ్ల తరబడి పురిటి నొప్పులు భరిస్తూ, ప్రాణాలకు తెగించి మరీ బీఆర్ఎస్ ప్రసవించిన బిడ్డ తెలంగాణ. బిడ్డకు తల్లిని మించిన సంరక్షకులు లేనట్టే, తెలంగాణకు బీఆర్ఎస్ను మించిన రక్షకులు లేరన్నది చరిత్ర నిరూపించిన సత్యం. ఎలాగంటే, ఆరు దశాబ్దాల పాటు అన్య పార్టీల పాలనలో అట్టడుగున ఉన్న ‘చీకటి వెలుగుల ఆకలి తెలంగాణ’ నవ వసంతాల బీఆర్ఎస్ పాలనలో ‘వెలుగుల అన్నపూర్ణ’గా భారతాగ్ర రాష్ర్టాల సరసన తలెత్తుకు నిలబడటమే అందుకు నిలువెత్తు నిదర్శనమంటున్నారు ఆర్థికవేత్తలు. బీఆర్ఎస్ పాలనలో వివిధ రంగాల్లో తెలంగాణ 100 శాతం నుంచి 400 శాతం వరకు వృద్ధి సాధించింది.
అభివృద్ధి, సంక్షేమాలను రెండు పట్టాలుగా నిర్మించి, వాటిపై ‘వందే తెలంగాణ’ అని కూత పెట్టిస్తూ ప్రగతి రైలును పరుగులు పెట్టించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్. తత్కారణంగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రెండో ప్రాంతంగా తెలంగాణను గుర్తించారు ప్రగతి పరిశోధకులు. అందుకు మేమే సాక్షులమంటున్నాయి ఆర్బీఐ, నీతిఆయోగ్ నివేదికలు. అలా బీఆర్ఎస్ పాలనలో శుక్లపక్ష చంద్రునిలా దినదినాభివృద్ధి చెందిన తెలంగాణ రెండేం డ్ల పాలనలోనే కృష్ణ పక్ష చంద్రునిలా నానాటికీ దిగజారుతుండటాన్ని చూశాక ఇప్పుడు వెనక్కి తిరిగి ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు ప్రజలు.
వాళ్ల ఊకదంపుడు ఉపన్యాసాలను, అబద్ధపు హామీలను, కూలీ ఇచ్చి వాళ్లు చేయించుకునే మీడియా ప్రచారాలను నమ్మి, ఆశపోతులకు అధికారమిస్తే అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. ఉన్న ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్లకు తెగనమ్మి, లక్షల కోట్ల అప్పులను తమ నెత్తిన పెడుతారని కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్ పాలన ద్వారా తెలిసిందంటున్నారు ప్రజలు. బీఆర్ఎస్ను జారవిడుచుకోవడం తల్లిని కోల్పోవడమేనంటూ ఇప్పుడు వాపోతున్నది తెలంగాణ.
అతి స్వల్పకాలంలో ఇంతటి అభివృద్ధిని ఎలా సాధించగలిగారు కేసీఆర్? దేశవ్యాప్తంగా తలెత్తిన ఈ ప్రశ్నకు రాజకీయ పరిశీలకులు చెప్తున్న జవాబిది. నాయకుడికి కేవలం ప్రజల పట్ల ప్రేమ ఉంటే చాలదు. వాళ్ల సమస్యల పరిష్కారం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం ఏం చేయాలో స్పష్టమైన జ్ఞానం కూడా కావాలి. నిరంతర పరిశీలన, అధ్యయనాల వల్లనే నాయకుడికి జ్ఞానపుష్టి కలుగుతుంది. కానీ, నేడు రాబోయే ఎన్నికల గురించి ఆలోచించే రాజకీయ వ్యాపారులే తప్ప, భావితరాల భవితవ్యం కోసం అధ్యయనం చేసే రాజనీతిజ్ఞులే కరువయ్యారు. ‘వేలాది మందిలో ఎవడో ఒకడు జ్ఞానసిద్ధికి యత్నిస్తాడు.
అట్టి జ్ఞానార్థుల్లోనూ ఎవడో ఒకడు సత్యాన్ని యథాతథంగా గ్రహించగలుగుతాడు’ అంటున్నది భవవద్గీత (గీత 7-3). అరుదైన అలాంటి జ్ఞానశ్రేష్ఠుల్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అగ్రగణ్యులు. వివిధ దేశాల పరిశీలన, నిరంతర అధ్యయనాల వల్లనే తెలంగాణల ప్రగతికి సుస్థిర పునాదులను నిర్మించి చరితార్థులయ్యారు కేసీఆర్. ‘నీళ్లు ఎక్కడో, అభివృద్ధి అక్కడ!’ అన్న చారిత్రక అనుభవాన్ని; వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు ప్రగతి రథానికి రెండు చక్రాలన్న చారిత్రక సత్యాన్ని గ్రహించిన కేసీఆర్ తొలుత ఆ దిశగానే తమ కృషిని ప్రారంభించారు.
మిషన్ కాకతీయ పేరిట కాకతీయుల కాలం నాటి చెరువుల పునరుద్ధరణ, కాళేశ్వరం పేరిట ప్రపంచైక భారీ ఎత్తిపోతల పథకం ద్వారా 100 శాతానికి పైగా సాగు, తాగునీటిని విస్తరింపజేసి వ్యవసాయాభివృద్ధికి; ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ, వేలాది గురుకులాలు, ఎడ్యుకేషన్ హబ్‌ల ద్వారా విద్యాభివృద్ధికి; ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణ, జిల్లాకో మెడికల్ కళాశాల ద్వారా వైద్యాభివృద్ధికి; విస్తృత మౌలిక వసతుల కల్పన, ‘టీ పాస్-ఐపాస్’ విధానం ద్వారా పారిశ్రామికాభివృద్ధికి; ఐటీ హబ్‌ల ద్వారా సాంకేతిక విద్యాభివృద్ధికి దృఢమైన పునాది నిర్మించారు తెలంగాణ పిత కేసీఆర్.
గొలుసుకట్టు చెరువుల ద్వారా వాన నీటిని వృథా పోకుండా, ఎత్తు నుంచి పల్లపు ప్రాంతాలకు సాగు, తాగునీటినందించి చరితార్థులయ్యారు కాకతీయులు. అలాగే నదీజలాలను వృథాగా పోనివ్వకుండా గొలుసుకట్టు రిజర్వాయర్ల ద్వారా పల్లపు ప్రాంతం నుంచి 1,600 అడుగుల ఎత్తున గల గ్రామాల దాకా 1,530 కిలోమీటర్ల దూరం వరకు గోదావరి జలాలను ప్రవహింపజేసి అభినవ భగీరథునిగా చరితార్థులయ్యారు కేసీఆర్. ఇంతటి బృహత్తర ప్రాజెక్టును నిర్మించడం మాట అటుంచి.. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతల్లో ఏ ఒక్కరూ కనీసం దాన్ని ఊహించలేరని చెప్తున్నారు తెలంగాణ ప్రజలు.
ఇలా తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి దృఢమైన పునాదిని రూపొందించడమే గాక, అపూర్వ ఆధ్యాత్మిక శిల్పకళా క్షేత్రం యాదగిరిగుట్ట, ఎడ్యుకేషన్ హబ్, ఐటీ హబ్, సుందర, కళాత్మక సచివాలయం, అద్భుతమైన అంబేద్కర్ విగ్రహాలను తెలంగాణ తల్లికి చిరస్మరణీయ ఆభరణాలుగా సమర్పించారు కేసీఆర్. అంతేకాదు, బీజేపీ పాలనలో పుల్వామా, పహల్గాం వంటి ఉగ్రవాద విధ్వంసాలు, పలు మత ఘర్షణలతో మన దేశం కల్లోల భారతం కాగా, బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఉగ్ర విధ్వంసం గాని, మత ఘర్షణకు గాని తావులేని ప్రశాంత రాష్ట్రంగా విరాజిల్లింది తెలంగాణ. బీజేపీ హయాంలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా రాజధాని ఢిల్లీ తలవంచుకుంటే, బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ‘క్లీన్ అండ్ గ్రీన్ సిటీ’గా తలెత్తుకు నిలిచింది. దటీజ్ బీఆర్ఎస్. దటీజ్ కేసీఆర్.
ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్.. ‘రాష్ర్టాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చి వెళ్లింది’ అంటూ అనుకూల మీడియా ద్వారా హోరెత్తిస్తున్నది. అది పచ్చి అబద్ధమని పార్లమెంట్ స్పష్టం చేసింది. 2014 నుంచి 2024 మార్చి వరకు తెలంగాణ అప్పులెన్ని? పెరిగిన ఆస్తులెన్ని? అంటూ ఎంపీ రఘునందన్‌రావు అడిగిన ప్రశ్నకు పార్లమెంట్ ఈ విధంగా జవాబిచ్చింది. ‘తెలంగాణ అప్పులు మొత్తం రూ.3.50 లక్షల కోట్లు. అందులో కొత్తగా రేవంత్ సర్కార్ చేసిన అప్పు రూ.40 వేల కోట్లు పోను, కేసీఆర్ సర్కార్ చేసిన అప్పు రూ.3.10 లక్షల కోట్లు మాత్రమే.
బీఆర్ఎస్ హయాంలో పెరిగిన ఆస్తులు 4.15 లక్షల కోట్లు’ అని. అయితే, రెండేండ్లలో రూ.2 లక్షల కోట్ల అప్పులు చేసిన కాంగ్రెస్ పార్టీ పదేండ్లలో రూ.3.10 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసిన బీఆర్ఎస్ వైపు వేలెత్తిచూపడం విడ్డూరమంటున్నారు తెలంగాణ ప్రజలు. అంతేకాదు, పున్నమి చంద్రునిలో మచ్చల్ని లెక్కించి, వెక్కిరించాలన్న వక్రబుద్ధితో కాళేశ్వరంపై కమిషన్లు వేసి, విచారణలు చేసి వాటికి సాక్ష్యాలను సృష్టించే పనిలో బిజీ బిజీగా ఉన్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు. కేసీఆర్ మీదే కాదు, తమకు రాజకీయ లబ్ధి కలుగుతుందనుకుంటే కాకతీయులు, కాటన్ దొరల మీద కూడా విచారణ కమిషన్లు వేసేందుకు వెనుకాడని పార్టీలు కాంగ్రెస్, బీజేపీ.
ఇలాంటి రాజకీయ కాలుష్య సమయంలో మంచేదో, చెడేదో సహేతుకంగా వివరిస్తూ, ప్రగతి మార్గాన పయనించేలా ప్రజలను చైతన్యపరచాల్సిన మేధావులు, మీడియా పెద్దలు ఏటివెంట కొట్టుకెళ్లే నిర్జీవపు కొయ్య మొద్దుల్లా అధికార ప్రవాహం వెంట కొట్టుకుపోతున్నారు. కాబట్టి, తెలంగాణ ప్రజలారా, సామాజిక శ్రేయోభిలాషులారా దయచేసి ఆలోచించండి. ‘అంతరాత్మ సహాయంతో ప్రజలు తమకు తామే ఉద్ధరించుకోవాలి’ అన్న భగవద్గీత (గీత 6-5) ప్రబోధాన్ని పాటించండి. మనకేదీ శ్రేయస్కరమో దాన్ని స్వయంగా ఎంచుకోవాలన్నది దీని భావం. ఆయా పార్టీల పాలనా ఫలితాలను బేరీజు వేసుకొని, మనకు ఏ పార్టీ పాలన శ్రేయస్కరమో దాన్ని ఎన్నుకుందాం.
-పాతూరి వేంకటేశ్వరరావు,98490 81889