“బంగారు పంట మనది..
మిన్నేరు గంగ మనది…
ఎలుగెత్తి చాటుదామురా..
ఇంట్లో ఈగల్ని తోలుదామురా..!”
102.8 ఎఫ్ఎం జనరంజనిలో ఆత్రేయ ‘ఆకలి రాజ్యం’ సినిమా పాట వస్తున్నది ఈ వ్యాసం రాస్తూండగా. చాలా అంశాల్లో మన దేశపు పరిస్థితి ఆ సినిమా వచ్చిన 1980ల కంటే పెద్దగా బాగు పడలేదు. ప్రపంచంలో ఐదో ఆర్థికశక్తి మనం… అయినా మన సంపద, మన కీర్తి అన్నీ దేశంలో రెండో మూడో శాతం పెద్ద కుటుంబాల చేతిలో ఉన్నయి. జన సామాన్యం గోస 78 ఏండ్ల స్వాతంత్య్రం తీర్చలేకపోతున్నది.
తెలంగాణలో ఈ చిత్రం మెరుగుపడింది పదేండ్ల కేసీఆర్ పాలనలోనే. అన్ని అభివృద్ధి సూచీలలో, సంక్షేమంలో దేశంలోనే మొదటి స్థానం. ప్రత్యర్థి పార్టీ అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రగతి నివేదికలు బయట పెడుతూ తెలంగాణకు ఎన్నో అవార్డులూ, రివార్డులూ ఇచ్చింది, ప్రతి ఏటా అలుపు లేకుండా! మొన్ననే రాష్ట్ర ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించిన్రు- 2014-24 మధ్యకాలంలో తెలంగాణ జీడీపీ 15 లక్షల కోట్లు దాటిందని. కేసీఆర్ పాలనలో 3.25 లక్షల పెట్టుబడులు; ఐటీ ఎగుమతుల్లో 31 శాతం వాటా; జీఎస్డీపీ, తలసరి ఆదాయం, సాగు విస్తీర్ణం అన్నిట్లోనూ తెలంగాణ రికార్డ్ అంటూ ఎంఎస్ఎంఈ-ఈపీసీ నిన్ననే కితాబిచ్చింది.
ఊసర క్షేత్రాలు సస్యశ్యామలమై, సంపదాభిరామమైన చరిత్ర మన కండ్ల ముందే ఉన్నది. రైతుబంధు సవ్యంగా, సకాలంలో ఇచ్చి, పండిన పంటను లాభసాటి ధరకు కొంటే… రైతులు అప్పులపాలు కారు; రుణాల ఊబిలో కూరుకుపోరు; సోనియమ్మ పుట్టిన రోజు గిఫ్ట్ కోసం ఏండ్ల తరబడి ఎదురుచూసే దౌర్భాగ్యంలోకి రైతులు తోసివేయబడ్డరు! పదేండ్ల బంగారు పాలనలో రైతాంగం పొందిన ఊరట గురించి నేను రాసే కంటే, ఇప్పుడు అది కోల్పోయిన రైతాంగం పెడుతున్న శాపనార్థాలు, కొండొకచో బూతులు సవివరంగా చెప్తాయి!
రేవంత్ మాత్రం ప్రగతి గణాంకాలు దాస్తున్నరు, మరెన్నో విజయగాథలు మాయం చేస్తున్నరు, తెలంగాణ సాధకులుగా ఎవరెవరినో నిలపాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నరు. మొత్తంగా, అన్నిరంగాల్లో తెలంగాణను విఫల రాష్ట్రంగా నిలిపిన్రు! ఆయన పద్నాలుగు నెలల పాలనపై రాష్ట్రమంతా నిరసనలు పెల్లుబుకుతున్నయి. ప్రతీ వర్గమూ ఆందోళనలో ఉన్నరు. సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కని వారు లేరు! లగచర్ల నుంచి నిర్మల్ దాకా కడుపు మండిన రైతాంగం అధికారులను తరిమికొడుతున్నది. ప్రజల నిరసనలు అణచివేసే కొత్త కోరలను ప్రభుత్వంలోని నాయకులు, అధికారులు తొడుక్కుంటున్నరు. దీపం ఉండగానే చక్కబెట్టుకునే పనిలో రేవంత్, ఆయన కుటుంబం బిజీగా ఉన్నది. భూములూ, డబ్బూ పోగేసుకుంటున్నరు, అధిష్ఠానానికింత పడేస్తున్నరు. సీఎం దగ్గర ఉన్న పోర్ట్ ఫోలియోల శాఖలన్నీ పడకేసినయి. అవి శాంతిభద్రతలు కావచ్చు, నానాటికీ తీసికట్టవుతున్న విద్య కావచ్చు, దారుణంగా విఫలమైన శాంతిభద్రతలు కావచ్చు, కటిక నేల మీద పడుకోబెట్టి లేదా చేతులకు బేడీలు వేసి అందిస్తున్న వైద్యం కావచ్చు! సాధారణంగా తండ్రి వంటి పాలకుడిని అన్నమో రామచంద్రా అని అర్థిస్తరు అన్నార్తులు. ‘మీరు పెట్టే అన్నం వద్దు మహాప్రభో’ అంటున్నరు హాస్టల్ విద్యార్థులు. రేవంత్ రెడ్డి ద్వేషం నికార్సైనది కానీ, ఆయన ఒలకబోసే ప్రేమ విషతుల్యం!
సరస్వతి కవుల అనే సామాజిక కార్యకర్త రాసిన్రు మొన్నొక వ్యాసంలో నా సలహా పాటించండి, నేను ఉపయోగించడం లేదనే చమత్కారమైన సామెత కాంగ్రెస్ పార్టీకి బాగా వర్తిస్తుంది. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను తెలంగాణలో ఉల్లంఘిస్తున్నది. బాపూజీ, బాబాసాహెబ్ ఆదర్శాలకు విరుద్ధంగా పాలన చేస్తున్నది. ఇతర రాష్ర్టాల్లో మాత్రం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఉద్యమాలు నిర్వహిస్తున్నది!
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహా ఎంతో మంది కేసీఆర్ పాలనను బహిరంగంగానే పొగుడుతున్నరు. ‘కేసీఆర్ ఫొటో పెట్టుకుంటే తప్పు ఏంటి?’ అని అధికార శిబిరంలోని ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపిస్తున్నరు. ‘వరుస తప్పిదాలతో అణువణువునా, అడుగడుగునా రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను గురుతుతెస్తున్నడు’ అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నిట్టూరుస్తున్నరు. మంత్రులకు సైతం సీఎం పేరు గుర్తురావడం లేదు. పార్టీపై, పాలనపై, రాష్ట్రంపై ఏదైనా సన్ముద్ర వేస్తే కదా గుర్తు రావడానికి?
మిత్రులారా! రేవంత్‌రెడ్డి అడుగుజాడలవి. ఆయన చూపించే దిగుడు ఊబి అది.
కాబట్టే, మొన్న ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలోనూ, నిన్న తెలంగాణ భవన్ విస్తృత స్థాయి సమావేశంలోనూ కేసీఆర్‌కు ఇసుకేస్తే రాలనంత జనాభిమానం, హృదయామోదం. రెండు గంటల తన దిశా-నిర్దేశపు ప్రసంగంలో కేసీఆర్ చెప్పిన అంశాల సారం ఒక్కటే లైన్ మనం అధికారంలోకి వస్తం, అది కాదు విషయం. తెలంగాణను మళ్లా ఎట్లా నిలబెట్టాలె అన్నదే. ఇది ఉత్తి మాట కాదు. ఒక మహా స్వాప్నికుడతను. ప్రజల కోసం రక్తంతో రాసుకున్న ప్రేమలేఖ. ఆయనకు ఎన్ని సార్లు సాష్టాంగ ప్రమాణం చేసినా తక్కువే.
కేసీఆర్ అడుగుజాడలు అవి. ఆయన చూపించే బంగారు భవిత అది.
సిసలైన తెలంగాణ ప్రేమికులకు కేసీఆర్‌లోని దార్శనికత, తెలంగాణ తనం అర్థం అవుతది, హత్తుకుంటది! తన బిడ్డ మల్ల ఎప్పుడు ఒస్తడో అని ఇప్పుడు తెలంగాణ తపిస్తున్నది. భూమి పుత్రుని ఏలుబడిలోని వసంతమాసం మళ్లా రావాలని గ్రీష్మతాడిత వనం లాంటి రాష్ట్రం ఎదురుచూస్తున్నది. మోసపోయిన జనం ఇప్పుడు జాగరూకులు అయితున్నరు. ఏడాది కాలపు అరణ్యవాసం తొలగిపోవాలని కోరుకుంటున్నరు. ఎవరి అడుగుజాడలు తమకు బంగరు తోవను చూపగలవో తెలుసుకుంటున్నరు. వారి ఆకాంక్షలను తీర్చడం ఇప్పుడు బీఆర్ఎస్ పని.
ఈ వ్యాస శీర్షిక ఆలోచించే పెట్టిన. ఎవరి అడుగుజాడలు భద్రమైన భవిష్యత్ ఇస్తయో; ఎవరి అడుగుజాడలు అధఃపాతాళానికి తోసివేస్తయో ఎరుకతో ఉండాలి. సొంత కూటమిలోని పార్టీలను ఓడించడం తమ విధానంగా పెట్టుకున్న, దాన్ని నిర్లజ్జగా ప్రకటిస్తున్న భావదారిద్య్ర పార్టీ ఈ దేశానికీ, రాష్ర్టానికీ ఏం చేయగలదు?
బంగ్లాదేశ్‌లో అధికార మార్పిడి జరిగిన సందర్భంలో ఆ దేశ విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ ఒక గొప్ప మాట అన్నరు. విధాన నిర్ణయాలు ప్రభుత్వాల మార్పిడితో మరుగు కాకూడదని. యూపీఏ హయాంలో వచ్చిన ఎన్నో చట్టాలు తదనంతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్పులు లేకుండా అమలులో పెట్టినయి. ప్రస్తుత ముఖ్యమంత్రికి ఆ సోయి లేదు. కేసీఆర్ కూర్చిపెట్టిన వ్యవస్థలను కంటిన్యూ చేసి ఉంటే, ఈ సంవత్సర కాలంలో ఆయనకు కొన్ని మంచి మార్కులు పడి ఉండేవి. ఆరు గ్యారెంటీలలో కొన్నైనా అమలు చేయగలిగే సంపద సృష్టి జరిగి ఉండేది. అట్లా ఉంటే ఆయన రేవంత్‌రెడ్డి ఎందుకైతడు? పేర్ల మార్పు, వాస్తు మార్పు, మొత్తంగా ప్రజల ఏమార్పు తప్ప మరో ధ్యాస లేదు. సొంత నియోజకవర్గాన్ని శాంపిల్‌గా రాష్ర్టాన్ని భయంలో ముంచెత్తిన్రు. నిర్బంధాలు, అరెస్టులు అంటూ భయపెట్ట జూస్తున్నరు. అవన్నీ తెల్లారి పతాక శీర్షికలుగా మాత్రమే మిగిలిపోతున్నయి తప్ప ఎవరూ భయపడటం లేదు. దాంతో మరింత ఆక్రోశం, మరింత రెచ్చిపోవడం! ‘ఆడలేక పాత గజ్జెలు’ అన్నట్టు సహచర నాయకుల మీద, సివిల్ సర్వెంట్ల మీద తప్పులు మోపుతున్నరు రేవంత్. వేస్తున్న ప్రతి అడుగూ తనను ఊబిలోకి లాక్కుంటున్నదనే ఎరుక రాదు!
తెలంగాణపై మొక్కవోని ప్రేమతో పోరాడుతున్న బీఆర్ఎస్ శ్రేణులకు అభినందనలు. మొన్న పెద్దాయన చెప్పిన మాటలు మననం చేసుకుందాం. మిగతా పార్టీలకు తెలంగాణ అంటే రాజకీయం; మనకు తెలంగాణ అంటే టాస్క్! మిగతా పార్టీలకు వాటి పుట్టుక మాత్రమే చరిత్ర; మనకు తెలంగాణ జీవనయానమే చరిత్ర. మన ప్రస్థానం, మన బతుకు చిత్రం వేర్వేరు కాదు.
ఎంత లోతైన చూపు? ఎంత తడి? కాబట్టే ‘గెలుపు కాదు, తెలంగాణ నిలుపు’ అని స్ఫటిక స్పష్టమైన మార్గం చూపిన్రు. సారు అడుగుజాడలే మన వెలుగు తొవ్వ! పదకొండేండ్ల కింద నిన్నటి ఫిబ్రవరి 20వ తేదీన రాజ్యసభలో ‘ది బిల్ ఈజ్ పాస్డ్’ అన్న ఆ మాట తెలంగాణకు ప్రాణస్వరం. సమున్నతంగా నిలబడే తెలంగాణ అనే అవర్ ‘విల్ షల్ బి పాస్డ్’ లక్ష్యంతో పునరంకితమవుదాం.
‘మంచి ఆశయాలుంటే..
మానవులందరూ/ మచ్చలేని వెలుగునే..
చేరుకొందురూ!’ అన్నరు
డాక్టర్ సి.నారాయణ రెడ్డి. అది మన గురించే!
జై కేసీఆర్, జై తెలంగాణ!!
– శ్రీశైల్ రెడ్డి పంజుగుల 90309 97371