అంక గణితం.. బీజ గణితం.. ఏ గణితంతో గుణితం చేసినా 8+8=16. ఎక్కడికి పోయి లెక్క కట్టినా 8+8=16 అవుతుంది. కానీ, మన రాష్ట్రం విషయానికి వస్తే అనుమానమే లేదు, 8+8=సున్నానే. ఏడాది కాలంగా తెలంగాణలో ఇదే లెక్క నడుస్తున్నది. ‘సారు.. కారు.. పదహారు’ ఉన్నప్పటి లెక్క వేరు.. ఇప్పుడు సాగుతున్న లెక్క మరో తీరు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు కలిసి రాష్ర్టానికి పట్టుకొచ్చిన నిధులు సున్నా. పెద్ద ప్రాజెక్టులకు, పెద్ద పెద్ద ప్రభుత్వరంగ సంస్థలకు తెచ్చిన కొత్త అనుమతులు సున్నా. నిధులు, ప్రాజెక్టుల సంగతి అటుంచితే కనీసం ప్రజా కాంక్షనైనా నెరవేర్చారా? అంటే అదీ సున్నానే.
2023 చరమాంకంలో కేసీఆర్ దిగిపోతూ.. దిగిపోతూ రూ.2,102 కోట్లు కేంద్రం నుంచి ప్రత్యేక సాయంగా తీసుకువచ్చి ఇప్పుడున్న పాలకుల చేతిలో పెట్టి వెళ్లిపోయారు. మళ్లీ కేంద్రం నుంచి రాష్ర్టానికి అందిన సాయం ఏమైనా ఉన్నదా? అంటే మృగ్యం అనే చెప్పవచ్చు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్ అటుపోను.. ఇటు రానూ ప్రయాణాలే అర్ధ నూర్లు దాటింది. కానీ, అర్ధ రూపాయి అదనపు ఆదాయమైతే అందలేదు. అటు 8 మంది, ఇటు 8 మంది ఎంపీలున్నా.. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద వచ్చే నిధులే తప్ప ప్రత్యేకంగా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు దక్కింది గుండు సున్నా. భారీ ఆయిల్ రిఫైనరీ ఇండస్ట్రీ, సెమీ కండక్టర్ పరిశ్రమలు, యూరియా బస్తాలు ఏపీకి తరలిపోతున్నయి.
‘హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం కేంద్ర మంత్రులను కలిసి నిధులు అడిగినం..’ అని సీఎం ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి సీఎంవో నుంచి ఓ మీడియా నోట్ పంపటం.. దాన్ని పతాక శీర్షికన ప్రచురించడం మీడియాకు అలవాటే. కానీ, ఇప్పటివరకు మెట్రో రైల్వే కోసం కేసీఆర్ పట్టుకొచ్చిన నిధులు తప్ప కొత్తగా రూపాయి కూడా అందలేదు. కానీ, ఏ హంగూ ఆర్భాటం లేకుండా యూపీ ప్రభుత్వం రూ.5,811 కోట్లు తీసుకున్నది. యూపీలోని లక్నో మెట్రో ప్రాజెక్టు-1బీలో 11.16 కిలోమీటర్ల కోసం రూ.5,801 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. లక్నో మాత్రమే కాదు.. మహారాష్ట్రలోని పుణె ఫేజ్-2కు సంబంధించి 12.75 కిలోమీటర్లకు రూ.3,626 కోట్లు, థానే మెట్రో రైలుకు రూ.12,200 కోట్లు కేటాయిస్తూ జూన్‌లోనే నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలోని బెంగళూరులో ఇప్పటికే 75 కిలోమీటర్ల మెట్రోలైన్ ఉండగా..
మరో 145 కిలోమీటర్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మెట్రో ఫేజ్-3 కింద మరో 45 కిలోమీటర్లు లైన్ నిర్మాణానికి కేంద్రం రూ.15,600 కోట్లు మంజూరు చేసింది. మనకు అటు 8 మంది ఎంపీలు, ఇటు 8 ఎంపీలున్నరు. వీళ్లలో ఇద్దరు మంత్రులు. అయినా తెలంగాణ మెట్రోరైలు రెండో దశ (ఏ, బీ)కు సంబంధించి కేబినెట్ నిర్ణయం సున్నా.
నిధుల సంగతి దేవుడెరుగు. రైతులు యూరియా బస్తాల కోసం అల్లాడుతున్నరు. కాలం అదను మీదికి వచ్చింది. పొద్దస్తమానం పడిగాలులు కాసినా బస్తెడు యూరియా అందుతలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో ఏడాది సగటు 7 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల వినియోగం ఉన్నది. కాళేశ్వరం, నెట్టెంపాడు, భీమా, కేఎల్ఐ ప్రాజెక్టులు అనుభవంలోకి వచ్చిన తర్వాత కోటి ఎకరాల మాగాణి సాగులోకి వచ్చింది. 27 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులు వాడిండ్రు. ఇందులో ఒక్క యూరియా 13.45 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ వినియోగం ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? అయినా ఒక్కనాడైనా రైతులు ఎరువుల కోసం పడిగాపులు కాశారా? రైతుకు ఇచ్చే ఎరువుల దుకాణం కాడ పోలీసు బందోబస్తు పెట్టిన ఆనవాళ్లున్నయా? కేసీఆర్ బ్రహ్మాండంగా రైతుకు ఎరువులు విత్తనం, రైతుబంధు అందించిండు.
మరి ఈ రోజు ఎరువుల దుకాణం దగ్గర చెప్పుల లైన్లు ఎందుకు వచ్చినయి? బస్తా బస్తాకు పోలీసు బందోబస్తు ఎందుకు పెడుతున్నరు? వానకాలం సీజన్ మొత్తానికి 24.45 లక్షల టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో యూరియా 10.50 లక్షల టన్నులు అవసరం. మే నెలాఖరు నాటికి కనిష్ఠంగా 6 లక్షల మెట్రిక్ టన్నులు, జూలై మాసం మొదటి వారంలోగా 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రంలో స్టాక్ ఉండాలి. కానీ, ఆగస్టు మాసం మొదటివారం వరకు 3 లక్షల టన్నులు మాత్రమే కేంద్రం నుంచి స్టాక్ వచ్చిందట. కేసీఆర్ ఉన్న పదేండ్లు కొరత లేకుండా స్టాకు వచ్చుడెట్లా? ఇప్పుడు అటు 8, ఇటు 8 మంది ఎంపీలుండి కింద ఒకరి ప్రభుత్వం, మీద ఒకరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా అదను మీద రైతన్నకు పెద్ద సున్నా పెట్టుడెట్ల?
రాష్ట్రంలో దాదాపు 9 నెలల నుంచి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల డ్రామా నడిపిస్తున్నరు. అది సాధ్యం కాదు, రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉందని తెలిసి కూడా సాగదీస్తున్నరు. బీసీలను మభ్యపెడుతున్నరు. బీసీ రిజర్వేషన్ల మీద అసెంబ్లీలో రెండు బిల్లులు ఆమోదించారు. గవర్నర్ ఆ రెండు బిల్లులను ఆమోదించకుండానే కేంద్రానికి పంపారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఆర్డినెన్స్ తెచ్చింది. దానికి కూడా ఆమోదం తెలపకుండానే గవర్నర్ కేంద్రానికి పంపించారు.
బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని, బిల్లుల ఆమోదానికి బీజేపీ 8 మంది ఎంపీలు తమ ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించారా? ఇద్దరు మంత్రులు, మిగిలిన ఎంపీలు బీసీ రిజర్వేషన్ల మీద పార్లమెంటు లోపల గానీ బయట గానీ ఒక్కమాట మాట్లాడలేదు. పోనీ ఇది బీసీ రిజర్వేషన్ల తమ పైలట్ ప్రాజెక్టు అని చెప్పుకొంటున్న కాంగ్రెస్ పార్టీ బయట హడావుడి చేయటమే కానీ.. బిల్లులు ఎందుకు ఆమోదించరు? అని 8 మంది ఎంపీలు పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఎప్పుడైనా నిలదీసిండ్రా? ఇండియా కూటమి ఎంపీల సహాయం తీసుకొని ఉభయ సభల్లో బీసీ రిజర్వేషన్ల చర్చను కనీస ఎజెండాగానైనా పెట్టగలిగారా? బయటి ఆర్భాటాలు తప్ప.. పార్లమెంట్ వేదిక మీద అటు 8 మంది బీజేపీ ఎంపీలు, ఇటు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు కలిసికట్టు గా సున్నా సుట్టిన మాట నిజం.
బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని, బిల్లుల ఆమోదానికి బీజేపీ 8 మంది ఎంపీలు తమ ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించారా? ఇద్దరు మంత్రులు, మిగిలిన ఎంపీలు బీసీ రిజర్వేషన్ల మీద పార్లమెంటు లోపల గానీ బయట గానీ ఒక్కమాట మాట్లాడలేదు. పోనీ ఇది బీసీ రిజర్వేషన్ల తమ పైలట్ ప్రాజెక్టు అని చెప్పుకొంటున్న కాంగ్రెస్ పార్టీ బయట హడావుడి చేయటమే కానీ.. బిల్లులు ఎందుకు ఆమోదించరు? అని 8 మంది ఎంపీలు పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఎప్పుడైనా నిలదీసిండ్రా?
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు