తెలంగాణ ప్రభుత్వం అర్ధాంతరంగా ఫార్ములా-ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని భావించి 2025 జనవరి 28న ఈ ప్రాంత బిడ్డగా నార్సింగి పోలీస్ స్టేషన్లో నేను ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు పోలీస్ స్టేషన్ నుంచి కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారం రాలేదు. నేనే స్వయంగా పోలీస్ స్టేషన్ అధికారికి ఫోన్ చేసి అడిగితే ‘కేసు క్లోజ్ చేశామ’ని అన్నారు. నన్ను సంప్రదించకుండానే కేసు ఎట్లా క్లోజ్ చేస్తారని ప్రశ్నిస్తే ‘సార్ మీకు తెలుసు కదా! మీరు ఏకంగా ముఖ్యమంత్రి మీదే కేసు పెట్టారు. మేమేం చేయాలి’ అని చెప్పారు.
సుదీర్ఘ కాలం పోలీసు శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసిన నాకే, హైదరాబాద్ నడిబొడ్డున ఇలాంటి పరిస్థితి ఎదురైందంటే, ఇక ఇతర మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యవస్థ పనితీరు ఎలా ఉంటుందో ఊహకు అందడం లేదు. భారత న్యాయ సురక్ష సంహితలోని సెక్షన్ 173 ప్రకారం.. ఫిర్యాదుదారుడికి కనీస సమాచారం ఇవ్వకుండా, కేసుకు సంబంధించిన ఆధారాల గురించి వాకబు చేయకుండా కేసు మూసివేయకూడదని పోలీసు అధికారులకు తెలియదా? తెలుసు, కానీ చట్ట ప్రకారం చేస్తే ఉద్యోగాలు ఎక్కడ ఊడతాయోనని భయం. ఈ భయానికి కారణం రేవంత్‌రెడ్డే.
నిత్యం లంకె బిందెల గురించి ఆలోచించే వ్యక్తి, అబద్ధాలు చెబితేనే ప్రజలు నమ్ముతరని బహిరంగంగా చెప్పిన వ్యక్తి, రూ.50 లక్షల బ్యాగుతో లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి, దాదాపుగా 89 క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న వ్యక్తి చేతిలో రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఉంటే, అవి ఎలా పనిచేస్తాయో ఇక్కడ ప్రత్యేకంగా చర్చించుకోవలసిన అవసరం లేదు. కానీ, కనీసం రాజ్యాంగబద్ధమైన సంస్థల్లో పనిచేసే కఠోరమైన పరీక్షలు రాసి ఎంపికైన అధికారులైనా చట్టబద్ధంగా, రాజ్యాంగ విలువలను కాపాడేలా పనిచేయాలి కదా! కానీ, ‘కొందరు అధికారులు’ ముఖ్యమంత్రి ప్రతీకార వాంఛతో ఇస్తున్న అక్రమ ఆదేశాలకు ఎదురుచెప్పకుండానే అతి విధేయతతో వెంటనే లొంగిపోతున్నారు. ఈ ధోరణి వల్లే ఇబ్బడిముబ్బడిగా ప్రజలపై అక్రమ కేసులు నమోదవుతున్నాయి. అలాంటి ఓ కేసే ఫార్ములా-ఈ కేసు.
ఈ-కార్ రేస్ కేసులో అధికారులు చట్టం, రాజ్యాంగాన్ని పక్కనపెట్టి ముఖ్యమంత్రి-హోంమంత్రి ఆదేశాల మేరకే పనిచేసినట్టుగా కనిపిస్తున్నది. ఎవరిని హత్య చేయలేదు, ఎవరికి హాని తలపెట్టలేదు, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించలేదు, తెలంగాణ పరువును ప్రపంచ దేశాల ముందు కించపరచలేదు, లంచం తీసుకోలేదు. అయినా కేటీఆర్‌పై కేసు పెట్టారు. ఆయన రోడ్డు మీద నడిస్తే కేసు, మాట్లాడితే కేసు, కాళేశ్వరం ప్రాజెక్టు చూడడానికి పోతే కేసు, లగచర్ల రైతులకు అండగా నిలబడితే కేసు, ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని నిలదీస్తే కేసు, జై తెలంగాణ అంటే కేసు, హైడ్రా పేరుతో పేదలను ఆగం చేయొద్దంటే కేసు, ఆఖరికి శ్వాస తీసుకుంటే కూడా కేసులు నమోదు చేసే పరిస్థితి నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది. 18 నెలల కాంగ్రెస్ పాలనలో కేటీఆర్ మీద 14 కేసులు నమోదయ్యాయి.
ఫార్ములా-ఈ రేస్ 2011లో పారిస్‌లో రూపొందింది. 2014లో బీజింగ్‌లో మొట్టమొదటి రేస్ జరిగింది. నేటికి కూడా పన్నెండవ సీజన్ ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్నది. తొమ్మిదవ ఫార్ములా-ఈ రేస్ ఛాంపియన్షిప్ మన హైదరాబాద్ వేదికగా ఆనాటి తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ హయాంలో 2023 ఫిబ్రవరి 11న జరిగింది. దేశంలో ఏ నగరానికి దక్కని అరుదైన గౌరవం ఆనాడు మన
హైదరాబాద్‌కు దక్కింది.
పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, తద్వారా అంతర్జాతీయంగా వివిధ కంపెనీల నుంచి తెలంగాణ రాష్ర్టానికి పెట్టుబడులు రప్పించి వేలాది మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఈ రేస్‌ను నిర్వహించారు. దీనివల్ల దాదాపు రూ.700 కోట్ల ఆదాయం వచ్చిందని నెల్సన్ సంస్థ తెలిపింది. అంటే స్వల్ప పెట్టుబడితో రాష్ర్టానికి అమితమైన లాభాలు అన్నమాట! అందుకేనేమో థాయిలాండ్ ప్రభుత్వం గత వారం 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఫార్ములా-1 రేసులకు శ్రీకారం చుట్టింది.
ఫార్ములా-ఈ రేసు కోసం ఆనాటి తెలంగాణ ప్రభుత్వం తరపున హెచ్ఎండీఏ అధికారులు రూ.55 కోట్లు ఖర్చు చేశారు. ఈ సొమ్ము అధికారికంగా ప్రభుత్వం నుంచి నిర్వహణ బాధ్యతలు చేపట్టిన లండన్‌లోని ఫార్ములా-ఈ సంస్థ అకౌంట్‌కు చేరింది. వాళ్లు ఈ డబ్బులు తమ ఖాతాల్లోనే ఉన్నాయని, ఇంకా ఇవ్వాల్సిన 50 శాతం కూడా జమ చేస్తేనే 10వ సీజన్‌ను నిర్వహిస్తామని చెప్పారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరగలేదు. ఎవరి వ్యక్తిగత అకౌంట్లో ప్రభుత్వ డబ్బు జమకాలేదు. సంవత్సరం పాటు పరిశోధించిన తర్వాత కూడా ప్రస్తుత ఫిర్యాదుదారులు, పురపాలక ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇచ్చిన ఫిర్యాదులో కూడా డబ్బు తప్పుదోవ పట్టిందని ఎక్కడా పేర్కొనలేదు. మరి అలాంటప్పుడు అవినీతి నిరోధక చట్టం కింద ఇది నేరమెలా అవుతుంది?
విచిత్రమైన విషయం ఏంటంటే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెట్టుబడులను ఆకర్షించడం కోసం లేదా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పేరు, గొప్పతనం తెలియపరచడం కోసం మిస్ వరల్డ్ పోటీలు, ఎయిర్ షో, ఏఐ సమ్మిట్, కైట్ ఫెస్టివల్ లాంటి కార్యక్రమాలు నిర్వహించింది. ఒక రాష్ట్రం లేదా ప్రాంతం ఉనికిని చాటడం కోసం, ప్రపంచ దేశాలకు మన సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేయడం కోసం, పర్యాటక ప్రాంతాలు, అందమైన కట్టడాల దిశగా విదేశీ పర్యాటకులను ఆకర్షించడం కోసం, పెట్టుబడులు సాధించడం కోసం ఆయా ప్రాంత పాలకులు ప్రయత్నిస్తుంటారు.
గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా నిర్మించాలనుకున్న ఎస్ఎల్బీసీ సొరంగం కోసం దాదాపుగా రూ.4,000 కోట్లు ఖర్చు పెట్టినా, 20 సంవత్సరాలైనా అది ఇంకా పూర్తికాలేదు. ఇటీవల అందులో జరిగిన ఒక ప్రమాదంలో 8 మంది చనిపోయారు కూడా. దానికి నాటి కాంగ్రెసు ప్రభుత్వంపై కేసు పెట్టగలమా? ప్రజాస్వామిక ప్రభుత్వాల పాలనలో వ్యక్తిగత అవినీతి లేనప్పుడు, ప్రజాప్రయోజనాలే పరమావధిగా తీసుకున్న నిర్ణయాలు నేరాలెలా అవుతాయి?
కానీ, ఇలాంటి నిర్ణయాలపై కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు నమోదు చేసి, ఈడీ, ఎసీబీ విచారణ జరిపిస్తున్నది. ఎలాగైనా ప్రజల గొంతుకైన కేటీఆర్‌ను జైలుకు పంపాలనే దుష్ట ఆలోచనతో ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఈ విషయంపై గోప్యంగా విచారణలు వద్దని, తెలంగాణ ప్రజానీకానికి తెలిసేలా అసెంబ్లీలో చర్చ పెడదామని, అవసరమైతే బహిరంగంగా చర్చిద్దామని, కుదిరితే లై డిటెక్టర్ పరీక్ష కూడా చేయించుకుందామని కేటీఆర్ సవాల్ విసిరారు. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. పైగా నోటీసుల మీద నోటీసులు ఇచ్చి రికార్డులన్నీ ప్రభుత్వం వద్దే ఉన్నా ‘మీ సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సరెండర్ చేయండి’ అని కక్షసాధింపులకు దిగుతున్నారు.
ఈ విధంగా కేటీఆర్ ఒక్కరి మీదే కాదు, మాజీ మంత్రి హరీశ్‌రావు మీద కూడా ఏడు కేసులు నమోదయ్యాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కూడా అక్రమ కేసు పెట్టి విచారణకు పిలిపించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి కొణతం దిలీప్, మన్నె క్రిశాంక్ మీద కూడా అక్రమ కేసులు బనాయించారు. ముఖ్యమంత్రి కార్యాలయం అభయం ఇవ్వకపోతే ఏ అధికారి కూడా ఇలాంటి దుస్సాహసాలు చేయరన్నది సుస్పష్టం.
ఒక అవినీతి కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ నేరచరిత్ర ఉన్న వ్యక్తి సీఎంగా, హోం మంత్రిగా ఉంటే ఎలా ప్రవర్తిస్తారో తెలంగాణ ముఖ్యమంత్రిని చూస్తే అర్థమవుతుంది. ఎలాంటి పదవిలో లేని తన సోదరుడు తిరుపతి రెడ్డికి రెడ్‌కార్పెట్ స్వాగతం పలకడం, గన్మెన్లను ఇవ్వడం, సీఎం సోదరుల పేర్లు రాసి చనిపోయిన కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి కేసు దర్యాప్తు ఆగిపోవడం, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళికి ఎస్కార్ట్‌తో భద్రత కల్పించడం, మరోవైపు వందల సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు పలు అంశాలకు సంబంధించి కేసులు పెట్టినా కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం వంటి అతి వినయ ప్రదర్శనలు రేవంత్ ప్రతీకార పాలనలోనే సాధ్యం. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ నాయకుల మనోధైర్యాన్ని గాయపరచలేవు. కానీ, పట్టపగలే రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసే కుట్రలో ‘కొంతమంది అధికారులు’ భాగస్వాములు కావడం, మరికొందరు ప్రేక్షకపాత్ర వహించడం చాలా ఆందోళన కలిగిస్తున్నది.
ఇద్దరు ఎమ్మెల్యేలను (కేటీఆర్, హరీశ్‌రావులను) బహిరంగంగా పెట్రోల్ పోసి చంపుతామని హెచ్చరించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై సుమోటో కేసు నమోదు చేయకుండా కళ్లప్పగించి, అధికార పార్టీకి తొత్తులుగా మారిన ఇలాంటి ‘కొందరు అధికారుల’ వల్లే రాజ్యాంగ సంస్థలకు తీరని నష్టం జరుగుతున్నది. ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇప్పటికైనా ఈ ప్రమాదకరమైన పరిస్థితి మీద మేధోమథనం చేయాలి. ‘మీ ప్రతీకార వాంఛకు మమ్మల్ని బలిచేయకండి’ అని పాలకులకు ఖరాఖండిగా చెప్పాలి. ఈ వ్యాసం రాసే నాటికి ఉత్తర తెలంగాణలో మంత్రి కొండా సురేఖ భర్తకు అసాధారణ బందోబస్తు ఏర్పాటు చేసిన కింది స్థాయి పోలీస్ అధికారులకు ఓ పోలీస్ కమిషనర్ మెమోలు జారీచేసిన వార్త పత్రికల్లో ప్రచురితమైంది. ఆ వార్త చదువుతుంటే ఈ ప్రతీకార పాలన అంతమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఎక్కడో కొంత ఆశ చిగురించింది.
-బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్