అబద్ధం ఏనాటికైనా దూదిపింజల్లా తేలిపోతుంది. కానీ, సత్యం అశోక స్తంభంలా కాలాన్ని జయించి నిటారుగా నిలబడే ఉంటుంది. ఇది చరిత్ర తేల్చిన సత్యం. తెలంగాణ ప్రథమ సీఎం కేసీఆర్ పరిపాలన గురించి కాంగ్రెస్ పాలకులు ఎన్ని అవాకులు చవాకులు పేలితేనేం నిజం ఎగదన్నుకు వస్తున్నది. కేసీఆర్ దార్శనికత రాష్ర్టాన్ని ప్రగతి పరుగులు పెట్టించి అద్భుత విజయాలు సమకూర్చారని ఘంటాపథంగా చాటే నివేదికలు ఇంకా వెలుగుచూస్తూనే ఉన్నాయి.
ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఐసీఆర్ఏ) కొద్దిరోజుల కిందట విడుదల చేసిన 2025 నివేదిక ఇందుకు తాజా ఉదాహరణ. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తలసరి ఉత్పాదక విలువ వృద్ధి, అంటే గ్రాస్ స్టేట్ వ్యాల్యూ యాడెడ్ (జీఎస్వీఏ)లో తెలంగాణ సాధించిన అద్వితీయ విజయాలను ఆ నివేదిక మరోసారి ధ్రువీకరించింది. తెలంగాణ ఆవిర్భవించిన 2014లో జీఎస్వీఏ వృద్ధిలో 9వ స్థానానికి పరిమితమైన రాష్ట్రం 2023-24లో దేశ సగటునే అధిగమించి ప్రథమ స్థానానికి ఎగబాకడం మామూలు విషయం కాదు.
వ్యవసాయం, ధాన్యం ఉత్పత్తి, పారిశ్రామికం, సేవారంగం, వాణిజ్యం, రియల్ ఎస్టేట్ రంగాల్లో 6 నుంచి 9 శాతం వృద్ధి సాధించింది. నీటి పారుదల రంగం ఏకంగా 26 శాతం పెరుగుదల నమోదు చేయడం విశేషం. ఒకప్పటి కరువు రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్ స్థానానికి రాకెట్లా దూసుకుపోయింది. ఈ అభివృద్ధి అంతా కూడా నీటిపారుదల చుట్టే అల్లుకోవడం విశేషం.
సాగు రంగంలో కొత్త శిఖరాలకు చేరుకున్నాం. అదే సమయంలో పారిశ్రామికంగానూ రాష్ట్రం వెలుగుబాట పట్టింది. తెలంగాణ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 6.5-6.9 శాతంగా నమోదైనట్టు ఐసీఆర్ఏ నివేదిక వెల్లడించింది. ఇది జాతీయ సగటు 5.7 శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం. వాణిజ్య విభాగంలో 9 శాతం, రియల్ ఎస్టేట్ రంగంలో 8 శాతం, రవాణా రంగంలో 7 శాతం వృద్ధిని సాధించి జాతీయంగా ‘అవ్వల్ దర్జా’కు చేరింది. ఐఆర్సీఏ ఒక్కటే వీటిని నిర్ధారించలేదు.
2024-25 ఆర్థిక సర్వే, ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వంటి ఇతర అత్యంత విశ్వసనీయ నివేదికలూ ఈ గణాంకాలనే వెలువరించాయి. కేసీఆర్ అవధులు లేని దార్శనికత, అసమాన ప్రణాళికా సామర్థ్యం, అద్వితీయమైన పరిపాలనా నైపుణ్యం ఈ విజయాలకు కారణం. సంపద పెంచడం, నలుగురికీ పంచడం అనే తాత్త్వికత ఫలితంగా రాష్ట్రం ముఖచిత్రమే మారిపోయింది. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడుగుర్రాలుగా పరుగెత్తించిన కారణంగా అన్నివర్గాలు సంతోషించే మంచిరోజులు వచ్చాయి.
కానీ, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి పరుగులకు బ్రేకులు పడ్డాయి. పరిపాలనపై అవగాహన లేక, ఆర్థిక నిర్వహణ చేతకాక చతికిలపడుతున్న ఫలితంగా రాష్ట్రం తిరోగమన దిశగా వెళ్తున్నది. జీఎస్పీ వృద్ధి రేటు 0.94 శాతం పడిపోవడం, తలసరి ఆదాయం వృద్ధిరేటు 4.5 శాతం తక్కుగా నమోదైంది. జీఎస్టీ వసూళ్లు తగ్గిపోయాయి. రవాణారంగం రాబడి వేగం తగ్గింది. ఇక రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తున్నది.
లెక్కలు అప్పుడు తీసినా, ఇప్పుడు తీసినా అంకెల విలువ మారదు. ఒకటి ఒకటే, సున్నా సున్నాయే. అద్దం అబద్ధం చెప్పదు. రాష్ట్రం సాధించిన అభివృద్ధికి నివేదికలు జేజేలు కొడుతుంటే, రాష్ర్టాన్ని దివాళా తీయించారని, ఖాళీ ఖజానా చేతికిచ్చారని పిచ్చిమాటలతో కాలక్షేపం చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటింది. ఇంకా సీఎం రేవంత్‌రెడ్డికే తాను సీఎంననే భావన కలుగడం లేదు. ఇక ప్రజల సంగతి చెప్పేదేముంది? వారు నిరంతరం కేసీఆర్ పాలన స్వర్ణయుగాన్నే నెమరు వేసుకుంటున్నారు.