ఈయేడు కాలం జర జల్దే జేసేటట్టున్నది. ఆయిటి పూనంగ మల్ల రైతులు పత్తిత్తనాలకు, మక్కిత్తనాలకు దుకాణాలల్లకు ఉరుకాలే. కాలానికి ఎనుకకు పోకుండా ముందుబడి ఇత్తనాలు తేవాలంటే జేబుల గవ్వక్కలు ఉండాలే! కానీ, మల్లొచ్చే పంటకు పెట్టుబడి ఎట్ల తేవాల్నో తెలియక తెలంగాణ రైతన్న తండ్లాడుతుండు. కష్ట సమయంలో రైతు పెట్టుబడిసాయం కోసం ప్రభుత్వం మీద ఆశ పెట్టుకుందామన్న ఆడున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదాయె. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని నాళ్లు, కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు వేసిన్రు. ఆశలు చూపి అందలమెక్కిన రేవంత్‌రెడ్డి పాలనలో రైతన్నలకు దిక్కుమొక్కు లేకుండాపోయింది. గత రెండుసార్లు ఇచ్చామా అంటే ఇచ్చామన్నట్టు రైతు బంధు సాయం చేశారు. ఈసారి మొత్తానికే మంగళం పాడేందుకు సిద్ధమయ్యారు.
ఉమ్మడి రాష్ట్రంలో అప్పుల విషపు కోరల్లో చిక్కుకొని ఉరికొయ్యలకు వేలాడిన తెలంగాణ రైతున్నలు ఎందరో. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అప్పులోనికి సరిపోలేదనే ఆవేదనతో పురుగు మందు డబ్బాలకు బలైన రైతుల దుస్థితిని ఉద్యమ నాయకుడు కేసీఆర్ కండ్లారా చూశారు. అందుకే స్వరాష్ర్టాన్ని సాధించాక రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు.
మొత్తంగా 11 విడతల్లో లక్షల మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ.72,910 కోట్లు జమచేశారు. నాడు బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఈ పథకంపై అవాకులు, చెవాకులు పేలారు. బడా రైతులకు ఎక్కువగా సాయం అందుతున్నదని విమర్శలు చేసినా.. 90 శాతం (42 లక్షలు) ఉన్న రెండెకరాల్లోపు సన్నకారు రైతులకు జరుగుతున్న మేలు వైపే కేసీఆర్ మొగ్గుచూపారు.
కేసీఆర్ రైతు బంధు పథకం రైతుల విషయంలో ముమ్మాటికీ గేమ్ ఛేంజరే. రైతు బంధు పథకం అమలు ద్వారా తెలంగాణల రైతులకు అప్పుల బాధలు తప్పాయని అనేక సర్వేలు, నివేదికలు చెప్పినయి. ఇంకా చెప్పాలంటే ప్రపంచ దేశాల్లో రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన 20 వినూత్న పథకాల్లో మన రైతుబంధు పథకం కూడా ఒకటని ఐక్యరాజ్య సమితి గుర్తించడం గర్వకారణం. పరాయి పాలనలో తెలంగాణ ఎవుసం ఆకలి చావులు, అప్పులు, ఆత్మహత్యలకు నిలయంగా చేసిండ్రనే గదా నాడు కేసీఆర్ పోరాడారు. రాష్ర్టాన్ని సాధించి ఎవుసాన్ని బాగుచేసిన్రు. అప్పులు తెచ్చుకునే కాడి నుంచి అప్పులు ఇచ్చే కాడికి రైతన్నలను చేర్చిన్రు. అట్లాంటి మన తెలంగాణ ఎవుసాన్ని మార్పు పేరుతో కాంగ్రెస్ ఏమార్చింది. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎకరానికి రూ.15 వేలు రైతు భరోసా ఇస్తానని నమ్మబలికి మోసం చేసింది. ఆఖరుకు మాటమార్చి ఇస్తామన్న రూ.12 వేలకు ఎగనామం పెట్టి నయవంచన చేస్తున్నది.
గత అర్ధ శతాబ్దానికి పైగా తెలంగాణ వెనుకబాటుకు కారణమైన కాంగ్రెస్ మళ్లా ఇప్పుడు సంక్షోభం వైపునకు నడిపిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనతో రాష్ట్ర రైతాంగం మళ్లీ అప్పుల మొఖాన చూడాల్సిన పరిస్థితి వచ్చింది. లక్షల రైతు కుటుంబాలకు ధీమాగా మారిన పెట్టుబడి సాయాన్ని స్వార్థ రాజకీయాలకు బలిచేయడం సరికాదు. ఈ సీజన్లోనైనా అదును దాటకముందే పెట్టుబడిసాయం అందించాలె.
– పిన్నింటి విజయ్‌కుమార్, 90520 39109