ఒక సామ్రాజ్యం, కుటుంబం, రాష్ట్రం, వ్యాపార సంస్థ ఏదైనా కావచ్చు. నాయకత్వం వహించేవారిలో జ్ఞానం, అనుభవం, సామర్థ్యం లేకపోతే ఆ సామ్రాజ్యం కూలిపోతుంది. సకల సంపదలతో తులతూగే సంపన్న రాజ్యాన్ని అప్పగించినా పాలకుడికి సామర్థ్యం లేకపోతే కొద్దికాలంలోనే రోడ్డున పడేస్తాడు. కౌన్ బనేగా కరోడ్‌పతి పోటీలో కోట్ల రూపాయల బహుమతి పొందిన వ్యక్తి స్వల్పకాలంలోనే డబ్బు పోగొట్టుకొని, భార్యకు దూరమై, తిరిగి ఉద్యోగ వేటలో పడ్డాడు. డబ్బును హోల్డ్ చేసే సామర్థ్యం లేకపోవడం వల్లనే అలా జరిగింది.
పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకువెళ్లింది. గ్రామ పంచాయితీ మొదలుకొని రాష్ట్రం వర కు జాతీయస్థాయిలో అనేక అవార్డులు గెలుచుకున్నది. రాష్ట్ర పర్యటనలకు వచ్చిన కేంద్రమంత్రులు ఇక్కడున్నది ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వమైనా రాష్ట్రంలో పథకాల ను జాతీయస్థాయిలో అమలు చేయాల్సినవ నిమెచ్చుకున్నారు. అంతేకాదు, రైతుబంధు, ఇంటింటికీ మంచినీరు వంటి పథకాలను దేశవ్యాప్తంగా పూనుకున్నారు. అదే తెలంగాణను ఇప్పుడు స్వయం గా ముఖ్యమంత్రి దివాలా తీసినట్టు చెప్తున్నా రు. అప్పు కోసం వెళ్తే చెప్పులు ఎత్తుకు వెళ్లడానికి వచ్చిన దొంగను చూసినట్టు చూస్తున్నారని ముఖ్యమంత్రి అంటున్నారు.
కేవలం పదిహేను నెలల వ్యవధిలో కాంగ్రెస్ పాలన తెలంగాణ ముఖచిత్రం మార్చింది. రైతుబంధు పథకాన్ని ప్రకటించిన తర్వాత ఒక్కసారి కూడా అమలు నిలిపివేయలే దు. చివరికి ఎన్నికల ముందు కూడా రైతుబంధు నిధులు చేస్తే ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసి నిలిపివేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం పథకాల అమలు సాధ్యమై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దివాలా అంటున్నారంటే ఎందుకు దివాలా తీసింది? ఎలా దివాలా తీయించారు?
పాలనా సామర్థ్యం లేకపోవడం వల్ల తలెత్తి న పరిస్థితి ఇది. రిలయన్స్ ధీరుబాయ్ అంబా నీ తన ఇద్దరు కుమారులకు ఆస్తులు సమా నంగా పంచారు. ఒక దశలో ముఖేష్ అంబానీ కన్నా అనిల్ అంబానీ ఆస్తులే ఎక్కువ. కానీ, తర్వాత అనిల్ అంబానీ నిండా మునిగిపోయి దివాలా తీశారు. చివరికి అప్పులు చెల్లించడానికి ముఖేష్ ఆర్థిక సహాయం చేయడంతో జైలుకు వెళ్లకుండా బయటపడ్డారు. అనిల్ షోకిల్లా రాయుడు. అనుభవం లేదు. దానితో అంత పెద్ద సామ్రాజ్యం అప్పగించినా విజయవంతంగా దివాలా తీశాడు.
సరిగ్గా తెలంగాణలో ఇప్పుడు అలానే జరిగింది. 2014 నాటి తెలంగాణను ఒకసారి గుర్తు చేసుకుంటే.. రైతుల ఆత్మహత్యలు, విద్యుత్తు సంక్షోభం తాండవిస్తున్నాయి. తెలంగాణ బతికి బట్టకడుతుందా అనే భయం. తెలంగాణను విఫల ప్రయోగంగా చేయాలని తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వర్గం ఒకవైపు. తెలంగాణను బలంగా కోరుకున్నవాళ్లు సైతం ఏమవుతుంది? నవ్వులపాలవుతామా అనే భయం.
ఆరునెలల్లో ఆంధ్రాలో కలిపేయమని తెలంగాణ లోనే ఉద్యమం వస్తుందని టీజీ వెంకటేష్ లాంటి ఆంధ్ర నాయకుడి ఛాలెంజ్. ఇలాంటి పరిస్థితుల్లో పగ్గాలు చేపట్టిన కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, మిషన్ కాకతీయ, ఇంటింటికి మంచినీళ్లు వంటి పథకాలు అద్భుతంగా అమలుచేసి విజయం సాధించారు. వీటిని కేంద్రం దేశం మొత్తం అమలుచేయడానికి ప్రేరణగా నిలిచారు. విద్యుత్తు ఉంటుందా? ఉండదా? అనే దశ నుంచి నడక ప్రారంభించి 24 గంటలు విద్యుత్తు అందించే దశకు తెలంగాణను తీసుకువచ్చారు. అలాంటి తెలంగాణలో కేసీఆర్ పదేండ్ల పాలన తర్వాత అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ ఏడాదిన్నరలోనే తెలంగాణను దివాలా దశకు చేర్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా ఆరు గ్యారెంటీలు ఏవీ అమలు చేయకుండానే దివాలా తీశారు.
అధికారంలోకి రాగానే ముందుగా రియల్ ఎస్టేట్‌పై ఇనుప పాదం మోపి రాష్ర్టానికి తీరని నష్టం చేశారు. రియల్ ఎస్టేట్ మీద అనేక వ్యాపారాలు ఆధారపడి ఉంటాయి. హైదరాబాద్‌లోనే కాదు, గ్రామాల్లో సైతం రియల్ ఎస్టేట్ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. దాదాపు రూ.రెండు కోట్లకు ఎకరం ధర పలికిన భూమి ఇప్పుడు సగం ధరకు కొనేవాళ్లు లేరని చెప్తున్నారు.
‘నేను రియల్ ఎస్టేట్ కింగ్‌ను. మిగిలినవాళ్లు ఇతర రంగాల నుంచి వచ్చారు. నేను వచ్చిందే రియల్ ఎస్టేట్ రంగం నుంచి ఆ రంగాన్ని ఎలా పరుగులు పెట్టించాలో బాగా తెలుసని’ వచ్చిన కొత్తలో ప్రగల్భాలు పలికిన సీఎం ముందుగా రియల్ ఎస్టేట్ రంగాన్నే చావుదెబ్బ తీశారు. తనకు ఎలాంటి పాలనా అనుభవం లోపించడం, తన బృందంలో యూట్యూబ్ ద్వారా చెత్త ప్రచారం చేసేవారే తప్ప రాష్ర్టానికి ఉపయోగపడే సలహాలు ఇచ్చేవారు లేకపోవడం రాష్ర్టానికి తీరని నష్టం చేకూర్చింది.
ఎలాంటి ఆలోచనలు ఉన్నవాళ్లు అలాంటి వారినే ఆకర్షిస్తారు అన్నట్టు రేవంత్‌రెడ్డికి తగినవారే ఆయన బృందంలో ఉన్నారు. ఆరు గ్యారెంటీల అమ లు బాధ్యత మాది అని రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ సైతం హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీల గురించి వారు నోరు మెదపడం లేదు. ఇన్నేసి హామీలు ఇస్తున్నా రు, అమలు ఎలా సాధ్యమని ఎన్నికల ముం దు ప్రశ్నిస్తే ఏడాది పాటు కడుపు కట్టుకుంటే ఈజీగా పథకాలు అమలు చేయవచ్చు అని రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పారు. పథకాలు అమలు చేయలేకపోతున్నాం అంటున్నారు అంటే ఏడాది కడుపు కట్టుకోలేదనే కదా అర్థం.
సీఎం కావాలనుకున్నాను, అయ్యాను. పార్టీ ఏమైతే నాకేం, రాష్ట్రం ఏమైతే నాకేం అన్నట్టుగా సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ మళ్లీ గెలవదు, నేను మళ్లీ సీఎం కాను అనే స్పష్టత రేవంత్‌రెడ్డిలో కనిపిస్తున్నది. ఆయన వరకు ఆయనకు నష్టం లేకపోవచ్చు కానీ రాష్ర్టానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు హుందాగా ఉండాలి. ఈ రాష్ర్టానికి తన వంతుగా ఏం చేయాలనే ఆలోచన ఉండాలి. కాంగ్రెస్ భస్మాసుర హస్తంలా తమ తలపై తాము చేయి పెట్టుకుంటే చేసేదేమీ లేదు మరో మూడేండ్లు భరించడం తప్ప. నిధులు ఇచ్చే రాష్ర్టాలను ఏమీ అనలేని నిస్సహాయ స్థితి కాంగ్రెస్ హైకమాండ్‌ది.
-బుద్దా మురళి