పక్షి ఎప్పుడూ తుపానులకు భయపడదు. ఎందుకంటే.. అది ఎగిరే రెక్కలను నమ్ముకుంటుంది, విరిగే కొమ్మలను కాదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అంతే. 50 ఏండ్ల రాజకీయాలు, కేంద్ర, రాష్ట్ర చట్టసభల్లో ఏదో ఒకచోట 40 ఏండ్ల నిరంతర ప్రాతినిధ్యం, కేవలం ఐదేండ్లలో (2004-2009) తెలంగాణ రాష్ట్ర సాధన ఎజెండాగా నాలుగు సార్లు లోక్సభకు ఎన్నికై సృష్టించిన చరిత్ర, రాష్ట్రమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా అపారమైన పరిపాలనానుభవం, అన్నిటికీ మించి అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రసాధన కోసం క్యాబినెట్ హోదా పదవిని తృణప్రాయంగా త్యజించి, తెలంగాణ కోసం పార్టీని స్థాపించి, 14 ఏండ్లు ఉద్యమాన్ని నడిపించి, ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన కేసీఆర్ రికార్డులకు వర్తమాన రాజకీయాల్లో వేరెవరూ దరిదాపుల్లో లేరు.
కేసీఆర్ మౌనం వహించడం అంటే లంఘించే ముందు సింహం రెండడుగులు వెనుకకు వేయడం లాంటిదే. ఇది తెలియని కాంగ్రెస్ అర్భక నేతలు బీఆర్ఎస్కు ముంచుకొచ్చిన పెనుప్రమాదాలేవీ లేకపోయినా అబద్ధాల భూతద్దాల్లోంచి చూస్తూ చూపిస్తూ ఏదో జరిగిపోతుందని భ్రమిస్తూ, భ్రమింపజేస్తూ ఒక పైశాచికా నందానికి అలవాటు పడ్డారు. పైకి మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నా లోలోపల కేసీఆర్ భయం వారిని వెంటాడుతున్నది. అందుకేనేమో ప్రహ్లాదుని కంటే ఎక్కువగా హిరణ్యకశిపుడు.. హరి నామస్మరణ చేసినట్టు కాంగ్రెస్ నేతలు కేసీఆర్ పేరుని అనుక్షణం జపిస్తున్నారు. శాపనార్థాలు పెడుతున్నారు. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా?
సుమారు రెండేండ్ల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలన గాలికొదిలేసి ఇంకా పాత పాటే పాడుతున్నది. బీఆర్ఎస్ కథ ముగిసినట్టు, అదేదో దేశ రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని ఓటమి అన్నట్టు, నాలుగు ముక్కలైపో యినట్టు కాంగ్రెస్ నేతలు అసంబంధాతిశయోక్తులను ప్రచారం చేస్తున్నారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినా మూడింట ఒక వంతు సీట్లను సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా పోలైన ఓట్లలో తేడా అతిస్వల్పమే. ఆ మాత్రానికే బీఆర్ఎస్ కథ ముగిసిపోతే కాంగ్రెస్ చవిచూసిన పరాజయ పరంపరకు ఆ పార్టీ ఎప్పుడో అంతర్థానం కావాల్సింది. వరుసగా రెండు సార్లు అధికారంలోకి రాలేక చతికిలబడి మూడోసారి అధికారంలోకి రాగలిగిన కాంగ్రెస్ పార్టీ ఆ అవకాశం బీఆర్ఎస్కు లేదన్నట్టు మాట్లాడటం హాస్యాస్పదం. ఒకప్పుడు భారతదేశాన్ని ఏకచ్ఛత్రంగా పరిపాలించిన కాంగ్రెస్ ముడుచుకుపోయి ఇవాళ మూడు రాష్ర్టాలకే పరిమితమైంది. అధికారం పరుగులో కేంద్రం ముంగిట మూడుసార్లు బొక్కబోర్లా పడింది. చాలా రాష్ర్టాల్లో ఉనికి లేకుండా పోయింది. దేశ చరిత్రలో ఎన్ని జాతీయ పార్టీలు కాలగర్భంలో కలిసిపోలేదు. అంతదాకా ఎందుకు 1978లో సమైక్య రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లు సాధించిన జనతా పార్టీ 1983 ఎన్నికల నాటికి అంతర్థానమైంది. సమైక్య రాష్ర్టాన్ని సుదీర్ఘకాలం పాలించిన టీడీపీ తెలంగాణలో ఉనికిని కోల్పోయింది. ఆ మధ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఇలా వచ్చి అలా మాయమైంది. ఇలా ఎన్నైనా చెప్పొచ్చు. బీఆర్ఎస్ మాత్రం పాతికేండ్లుగా సగర్వంగా నిలిచింది. సమైక్య రాష్ట్ర చరిత్రలో వరుసగా పదేండ్లు పాలించిన ముఖ్యమంత్రులు ఎవరూ లేరు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక చంద్రబాబు, వైఎస్ జగన్లు కూడా కేసీఆర్ పదేండ్ల వరుస రికార్డును అందుకోలేకపోయారు.
వివిధ రాజకీయ కోణాల్లో పోల్చుకున్నప్పుడు కేసీఆర్కు కేసీఆర్ మాత్రమే సాటి. చంద్రబాబు, వైఎస్ఆర్ వంటి సంపన్నులు, సామాజిక దన్నులున్న రాజకీయ దిగ్గజాలను ఎదుర్కొని కేసీఆర్ ఒక పుష్కరకాలం పైగా ఉద్యమాన్ని నడపడమే అందుకు గీటురాయి. వివిధ పార్టీల పొత్తులతో 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన కాంగ్రెస్, బీజేపీ కూటములను కేసీఆర్ ఏ పొత్తు లేకుండా ఒంటరిగా మట్టి కరిపించిన చరిత్ర మర్చిపోతే ఎట్లా?
కాంగ్రెస్ దూషణ పర్వం కొత్త కాదు. 2008 ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ మిశ్రమ ఫలితాలు వచ్చిన సందర్భంలో ‘ఆ ఇంకేముంది టీఆర్ఎస్ పనైపోయింద’ని కాంగ్రెస్ నేతలు, వారి మీడి యా చేయని ప్రచారం అంటూ లేదు. మఖలో పుట్టి పుబ్బలో మాడిపోతుందన్నారు. 2009లో కూడా 10 సీట్లకే పరిమితం కావడంతో టీఆర్ఎస్ కథ ముగిసిందన్న ప్రచారాలు చేశారు. కానీ, 2010 ఉప ఎన్నికలు మొదలుకొని 2023 దాకా పదమూడేండ్ల పాటు టీఆర్ఎస్ జైత్రయాత్ర కొనసాగింది. అదీ ఎలాంటి పొత్తులు లేకుండా. గత ఎన్నికల్లో కేసీఆర్ ఒకటి ఇస్తే మేము రెండిస్తామంటూ కాంగ్రెస్ మాయల మారి పథకాలతో ప్రజలను మభ్యపెట్టడం వల్ల బీఆర్ఎస్ కొంత వెనుకబడిపోయింది. అది కుదుపు మాత్రమే. నడక ఎక్కడా ఆగలేదు.
అంతర్గతంగా బీఆర్ఎస్లో ఏదో జరిగిపోతుందన్న ఒక దుష్ప్రచారం ఆ పార్టీ ప్రారంభం నుంచి కాంగ్రెస్ పరివారం చేస్తున్నదే. కొత్తదేమీ కాదు. కేసీఆర్ పార్టీ ప్రారంభించింది పదవుల కోసమే తప్ప, రాష్ట్రం కోసం కాదని ప్రారంభంలో ఇవే వ్యతిరేకశక్తులు ప్రచారం చేశాయి. ఎప్పుడైతే కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి, లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ కోసం నిలబడ్డారో అప్పుడే వాళ్ల నోళ్లు మూతపడ్డాయి. తదనంతర పరిణామాల్లో ప్రజల ఆకాంక్షల కోసం టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి బరిలోకి దిగినప్పుడు వారిని ఓడించి తెలంగాణవాదం లేదని నిరూపించాలన్న కుట్రతో పోటీ చేసి డిపాజిట్లు దక్కక ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ తేలు కుట్టిన దొంగలా నోరు మూసుకున్నది. ఒక రాష్ట్ర సాధన కోసం దేశంలో ఇంత పెద్ద ఎత్తున పదవులకు రాజీనామాలు చేయడం చరిత్రలోనే లేదు. రాజకీయాల్లో అధికారంలో కేసీఆర్ కుటుంబసభ్యుల ప్రాతినిధ్యంపై అదో కాకిగోల. వాస్తవానికి వారంతా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదవులకు రాజీనామా చేసినవాళ్లే. పోరాడిన వాళ్లే. కేసులు, అరెస్టులు, నిర్బంధాలు ఎదుర్కొన్నవారే. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి ఏకంగా ప్రభుత్వానికే సారథ్యం వహిస్తే తప్పులేదు కానీ, ఉద్యమ నేపథ్యం, తిరుగులేని ప్రజామోదం ఉండి కేవలం కుటుంబ సభ్యులైనంత మాత్రాన రాజకీయాల్లో కొనసాగడం తప్పట. అదే నిజమైతే మరి కాంగ్రెస్ పార్టీ సంగతేమిటి. అది దశాబ్దాలుగా కుటుంబ పార్టీ కాదా? కాంగ్రెస్ లాగా బీఆర్ఎస్ ఎన్నడూ చీలిపోలేదు. అధికారం కోసం ఏ పార్టీతో జత కట్టలేదు. బీఆర్ఎస్ లాగా ఒంటరి పోరాటానికి సిద్ధపడే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ పార్టీకుందా?
బీఆర్ఎస్ పాలనలో ఏదో అవినీతి జరిగిపోయిందని గోబెల్స్ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకగణం గోరంతను కొండంతలు చేసి చూపిస్తున్నారు. ప్రపంచ సుందరీమణుల పోటీలకైన ఖర్చుతో కాళేశ్వరం మరమ్మతు ఈపాటికే పూర్తయ్యేది. ఫార్ములా ఈ రేస్ కేసులో లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమని కేటీఆర్ ముందుకొచ్చినా ప్రభుత్వం కిమ్మనడం లేదు. ఏసీబీ, సీబీఐ, ఈడీ, ఐటీ కేసులు విచారణ కమిషన్లు ఆర్భాటాలే తప్ప ఇంతవరకు పొయ్యిలో పిల్లి లేవలేదు. విభజన ప్రక్రియ, 95 శాతం స్థానికత కోసం రాష్ట్రపతి ఉత్తర్వులు, కరోనా వైపరీత్యాలు వంటి ఆటంకాలను అధిగమిస్తూ లక్షన్నరకుపైగా ఉద్యోగాలను కేసీఆర్ సర్కార్ భర్తీచేసింది. నోటిఫికేషన్లు, పరీక్షలు, నియామక ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఎన్నికలు రావడం, ఆ తర్వాత కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం వాటిని పూర్తిచేసి తమ ఘనతగా డబ్బా కొట్టుకోవడం నిత్యకృత్యమైపోయింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాలు లీకైనప్పుడు ప్రభుత్వమే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు జరుగుతున్న పరీక్షల వ్యవహారాల్లో అంతా సవ్యంగానే ఉందని అభ్యర్థులతో ప్రభుత్వం అనిపించగలదా? కోర్టులింకా క్లీన్చిట్ ఇవ్వలేదు కదా.
గత 20 నెలల్లో నోటిఫికేషన్ల నుంచి నియామకాల దాకా ప్రక్రియ ప్రారంభించి పూర్తిచేసిన ఉద్యోగ వివరాల శ్వేతపత్రం కాంగ్రెస్ ప్రకటించగలదా? కేటీఆర్ అన్నట్టు బీఆర్ఎస్ చేసిన మంచి పనులు చెప్పుకోలేకపోయింది. వాస్తవాల కంటే కాంగ్రెస్ వక్రీకరణలే గాలి కంటే వేగంగా వ్యాపించాయి. అవినీతి అంటూ, అక్రమాలంటూ, ఇదిగో పులి అంటే అదిగో తోక అంటూ అబద్ధాలను, అభాండాలను మేఘ విస్ఫోటనంలా కుమ్మరించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇంకా బురద చల్లడమే పరిపాలనగా భావిస్తున్నది.
ఇంతకాలం కేసీఆర్ వ్యక్తిగత జీవితం మీద, కుటుంబం మీద, తెలంగాణ పట్ల ఆయనకున్న అంకితభావం మీద, ఉద్యమం మీద, పార్టీ మీద, పరిపాలన మీద లేనిపోని అపవాదులు మోపి, అనుమానాలు రేకెత్తించి, ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు ప్రజలకు భ్రమలు కల్పించి పబ్బం కడుపుకొన్న కాంగ్రెస్, వారి సోషల్ మీడియా మూకలు ఇవాళ కేసీఆర్ ఆరోగ్యంపై విషప్రచారానికి తెగపడ్డాయి. దేశ చరిత్రలో ఇన్నిరకాల మాయా యుద్ధాలను ఎదుర్కొని నిలిచిన నాయకుడు కేసీఆర్ తప్ప మరొకరు లేరే మో. అగ్నిజ్వాలకు ఒక లక్షణం ఉంటుంది. దా న్ని తలకిందులు చేసినా పైపైకే ప్రసరిస్తుంది. చేయికాలితే గానీ ఆ పరమార్థం బోధపడదు.
అంతర్గతంగా బీఆర్ఎస్లో ఏదో జరిగిపోతుందన్న ఒక దుష్ప్రచారం ఆ పార్టీ ప్రారంభం నుంచి కాంగ్రెస్ పరివారం చేస్తున్నదే. కొత్తదేమీ కాదు. కేసీఆర్ పార్టీ ప్రారంభించింది పదవుల కోసమే తప్ప రాష్ట్రం కోసం కాదని ప్రారంభంలో ఇవే వ్యతిరేకశక్తులు ప్రచారం చేశాయి. ఎప్పుడైతే కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి, లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ కోసం నిలబడ్డారో అప్పుడే వాళ్ల నోళ్లు మూతపడ్డాయి.