బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ముసుగు తొలగిపోయింది. తెచ్చే సామర్థ్యం మాటేమోగానీ ఇచ్చే ఉద్దేశమే ఆ పార్టీకి లేదని తేలిపోయింది. ఢిల్లీలో జరిపిన బీసీ రిజర్వేషన్ ధర్నా ఓ రాజకీయ నాటకం తప్ప, దాని వెనుక ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదని సర్కారు పెద్దలు చేసిన ప్రసంగాలతో తేటతెల్లమైంది. ‘మేం చెయ్యాల్సింది చేశాం.. ఇక మావల్ల ఏమీ కాద’ని వారి అసమర్థతను చాటుకునేందుకు తప్ప ఈ ధర్నా ఎందుకూ పనికిరాదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ‘ఎంతవరకైనా వెళ్తామని’ చెప్పుకొస్తున్న ప్రభుత్వ పెద్దలు, వారి పార్టీ పరివారం ఢిల్లీ దాకా మాత్రం వెళ్లారు. బీసీ ధర్నా పేరుతో దండుగమారి రాజకీయ ఉపన్యాసాలు దంచి తిరిగి వచ్చారు. బీజేపీ ప్రభుత్వం మెడలు వంచుతామని తొడలు కొట్టినోళ్లు పనికిమాలిన ప్రగల్భాలతో సరిపెట్టారు. రిజర్వేషన్లు ఇప్పట్లో, అదీ తమ చొరవతో సాధ్యం కావనే చావుకబురు చెప్పకనే చెప్పారు. ‘మోదీని గద్దె దించి అధికారం చేపడతాం.. అప్పుడు రిజర్వేషన్లు మేమే ఇస్తాం’ అనడంలో ఉద్దేశం ఏమిటి?
నిజానికి కాంగ్రెస్కు రిజర్వేషన్లు ఎలాగైనా సాధించాలని ఉంటే అనుసరించాల్సిన పద్ధతి ఇది కాదు. ఈ అంశాన్ని చట్టపరంగా తేల్చాల్సింది పోయి రాజకీయ తమాషాగా మార్చడంలోనే కాంగ్రెస్ కుటిలత్వం దాగుంది. ఎడమచేత్తో ఇచ్చి కుడిచేత్తో లాగేసుకునే జిమ్మిక్కులనే హస్తం పార్టీ పూటకొకటిగా తెరమీదకు తెస్తుండటమే ఇందుకు తార్కాణం. శాస్త్రీయ పద్ధతిలో కులగణన జరపకపోవడం దగ్గర నుంచి సకాలంలో సాధికారిక కమిషన్ వేయకపోవడం దాకా అన్నీ శల్యసారథ్యాలే. బీసీలపై బూటకపు ప్రేమ ఒలకబోసే కపట నాటకాలే. న్యాయపరీక్షకు నిలిచే పకడ్బందీ మార్గంలో వెళ్లకుండా తూతూమంత్రం తంతు జరిపించడమే ఇందుకు నిదర్శనం. అసెంబ్లీలో హడావుడిగా ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రపతి సత్వర నిర్ణయం కోసం న్యాయపోరాటం ఏమైనా చేశారా అంటే అదీ లేదు.
అదలా ఉండగానే స్థానిక ఎన్నికల కోసం ఆర్డినెన్స్ తయారుచేసి గవర్నర్కు పంపారు. దాని సంగతి తేలకముందే ఇప్పుడు ధర్నా పేరిట తమాషాకు దిగారు. కేంద్రం మీద నెపం తోసేద్దామని చూస్తున్నారు సరే, కాంగ్రెస్ హోంవర్క్ చేయకపోవడం మాటేమిటి? ‘గల్లీలో వెలగబెట్టాం.. ఇక ఢిల్లీలో మా తడాఖా చూపిస్తాం’ అన్నట్టుగా దేశ రాజధానికి తయారయ్యారు. ఇదేమీ అఖిలపక్ష ధర్నా కాదు. కాంగ్రెస్ సొంత ధర్నా అనేది గుర్తుంచుకోవాలి. ఇది బీసీలను మరోసారి నిండా ముంచేందుకు వేసిన ఎత్తుగడ తప్ప మరోటి కాదు. ఆ మాటకు వస్తే వెనుకబడిన వర్గాలను వాడుకుని వదిలేయడం కాంగ్రెస్కు మొదటి నుంచి అలవాటే. ఇందుకు నాటి మండల్ నివేదికే సాక్ష్యం.