కేసీఆర్ సుస్థిరపాలనలో గాడినపడ్డ తెలంగాణ బతుకుబండి కాంగ్రెస్ రాకతో ఆగమాగమైంది. దాదాపుగా అన్నిరంగాలూ పడకేశాయి. అందులో భావిభారత పౌరులను తీర్చిదిద్దే విద్యారంగం కూడా సర్కారు చేతకానితనం వల్ల సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. ముఖ్యంగా వృత్తివిద్యా కళాశాలల ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం కొత్త సర్కారు వచ్చిన తర్వాత పూర్తి నిర్లక్ష్యానికి గురవుతుండటంతో విద్యార్థులు, వారితల్లిదండ్రులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. గత 20 నెలలుగా నాన్చుతూ వస్తున్న ప్రభుత్వం ఇప్పటికీ తగిన రీతిలో స్పందించకపోగా కాలేజీల తప్పులెన్నే పనిలో పడుతున్నది. భారత సాంకేతిక విద్యామండలి తనిఖీల్లో వెల్లడైన అంశాలను బయటకి తీసి కాలేజీలను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నది. అంతిమంగా ప్రభుత్వం చెప్పేదేమిటం టే.. ‘నిధులు లేవు, అన్నీ పథకాలకే ఖర్చయ్యాయి’ అని. ఈ నేపథ్యం లో ‘ఫీజు రీయింబర్స్మెంట్ అనేది సర్కారు పథకం కిందకు రాదా?’ అనే ప్రశ్న తలెత్తుతున్నది. ఫీజు బకాయిలు చెల్లించడానికి డబ్బులు లేవంటున్న సర్కారుకు ప్రాజెక్టులకు విడుదల చేయడానికి మాత్రం నిధులు ఎలా వస్తున్నాయనే దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.
స్వరాష్ట్ర సాధన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టిసారించారు. సమూలమైన మార్పులు తెచ్చారు. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచారు. కాలేజీలపై కట్టుదిట్టమైన అజమాయిషీ తెచ్చారు. తద్వారా ప్రజాధనాన్ని మిగిలించడమే కాకుండా చదువుల నాణ్యత మెరుగుపడేలా చేశారు. నిజానికి ఉమ్మడి సర్కారు రోజుల నుంచీ బకాయిల సమస్య ఉంది. ప్రతి మూడేండ్లకు ఓసారి ఫీజుల పెంపకం వల్ల బకాయిలు కూడా పెరుగుతున్నాయి. అయినా ఉమ్మడి సర్కారు బకాయిలను బీఆర్ఎస్ సర్కారు చెల్లించింది. అంతేకాదు, ఏటా రూ.2,400 కోట్లు విడుదల చేస్తూ వచ్చింది.
కల్లబొల్లి కబుర్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కథ మళ్లీ మొదటికి వచ్చింది. కాలేజీ విద్యలో నాణ్యత పరిశీలనను గాలికొదిలేయడమేకాకుండా నిధుల విడుదలనూ నిలిపివేసింది. బకాయిల కోసం కాలేజీలు పట్టుబట్టడంతో తొలివిడతగా రూ.1,200 కోట్లు విడుదల చేస్తామని ఏడాది క్రితం రేవంత్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, అందులో ఒక్కపైసా చెల్లించకపోవడంతో మొన్న 15వ తేదీ నుంచి కళాశాలలు నిరవధిక సమ్మె చేస్తామని ప్రకటించాయి. ఇట్లా కాలేజీలన్నీ ఏకమై సర్కారు మీదపోరు చేయడం ఇదే తొలిసారి. పాత బకాయిలతో మాకేం సంబంధం అంటూ కొందరు మంత్రులు వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. పాత బకాయిలు విడుదల చేయడంతో పాటు 2025-26 సంవత్సరానికి రీయింబర్స్మెంట్ ఫీజులను రెండు లేదా మూడు వాయిదాల్లో ఇచ్చేలా స్పష్టమైన విధానాన్ని ఖరారు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి సంఘాలు బంద్ నిర్వహించడం సహజమే. కానీ, విద్యాసంస్థలు బంద్ పిలుపునివ్వడం కాంగ్రెస్అసమర్థ విధానాలకు అద్దం పడుతున్నది. చర్చల సందర్భంగా కాలేజీ యాజమాన్యాలను ప్రభుత్వం మడతపేచీలు పెట్టి, మెడలు వంచాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు తొలివిడతగా రూ.600 కోట్లు విడుదల చేసేందుకు సర్కారు అంగీకరించింది. కాలేజీలకు ఇచ్చినా, ఖాతాల్లో వేసినా సకాలంలో చెల్లించడం ముఖ్యమని ప్రభుత్వం గుర్తించాలి. ఉన్నతవిద్య పూర్తిచేసుకుని, ఉపాధి వెతుక్కోవాలని తహతహలాడే లక్షలాది బడుగు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం సరికాదు.