‘నమ్మి చెడినవారు లేరురా.. నమ్మక చెడేరురా’ అనేది తత్వం. కానీ, నమ్మడమే పెద్ద సమస్యగా తయారైంది. అదేదో సినిమాలో విలన్ పాత్రధారి ‘నమ్మితే ద్రోహం చేస్తావా?’ అని ఓ అమాయక బకరా అడిగితే, ‘నమ్మకపోతే ఎలా ద్రోహం చేస్తానూ’ అని గడుసుగా సమాధానమిస్తాడు. అచ్చంగా అలాంటి పాలకులే ఇప్పుడు తెలంగాణకు దాపురించారు. నమ్మకానికి మోసం నీడలా వెంబడించి ఉంటుందని గట్టిగా నమ్మే సీఎం రేవంత్ ఆ సూత్రాన్ని తు.చ. తప్పకుండా ఆచరణలో పెడుతున్నారు. ‘ఇది చేస్తాం, అది చేస్తాం, పొడిచేస్తాం, తుడిచేస్తాం’ అంటూ ఊదరగొట్టి, అరచేతిలో స్వర్గం చూపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు తడాఖా చూపిస్తున్నారు. ఇలా మోసానికి గురవుతున్నవారిలో చిన్నాపెద్దా, మాన్యులు, సామాన్యులు అనే తేడా లేదు. అన్నివర్గాలకూ వరుస పెట్టి వడ్డిస్తూనే ఉన్నారు. రైతులకు ఎరువుల మోసం.. ఉద్యోగులకు జీతాల మోసం.. ఉద్యోగ విరమణ చేసినవారికి బెనిఫిట్స్ మోసం.. నవవధువుకు తులం బంగారం మోసం.. అవ్వలకు పెంచిన పింఛను మోసం.. పేదల ఇండ్లకు హైడ్రా మోసం.. నిరుద్యోగులకు గ్రూప్ వన్ మోసం.. కాంట్రాక్టు టీచర్లలకు జీతాల కోత మోసం.. ప్రజాస్వామ్యానికి ఫిరాయింపుల మోసం, కాళేశ్వరానికి పడావు మోసం.. ఇలా మోసాల చిట్టా అంతులేకుండా పెరుగుతూనే ఉన్నది. అయితే బుకాయింపులు, కాదంటే దబాయింపులతో ఇన్నాళ్లూ కాలం గడిపారు.
సంచీలోని సాకులన్నీ అయిపోయాయి. చేసిన మోసం చెప్తే పోతుందని నమ్ముతారేమో! ఆ మోసాన్ని తామే మడతపేచీల్లో చుట్టి మనముం దే విప్పేస్తారు. ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా. గమ్మత్తయిన సంగతి ఏమిటంటే చావుకబురు చల్లగా చెప్పడమనే కళలో సర్కారు పెద్దలు ఆరితేరిపోతున్నారు. మిమ్మల్ని ఫలానా విధంగా మోసం చేశామని వారే గడుసుగా బయటపెట్టుకుంటారు. బడుల సంగతే తీసుకుంటే బడ్జెట్లో 98 శాతం టీచర్ల జీతాలకే పోతున్నదని సర్కారు పెద్దే అమాయకంగా సెలవిస్తున్నారు. వంటకు గిలాసెడు బియ్యం ఇచ్చిన అత్త, అన్నమంతా కోడలే తిన్నదన్నట్టు.. విద్యాశాఖలో టీచర్ల జీతాలకే బడ్జెట్ అంతా పోతుందం టున్నారు. మౌలిక సదుపాయాలకు ఇస్తున్నది సున్నా. జీతాలకు ఇచ్చిన ఖర్చు జీతాలకు పోక మిగులుతుందా? ఇది ఉపాధ్యాయులు ఏదో దోచుకుతింటున్నట్టు ప్రచారం చేయడం తప్ప ఇంకేమైనా ఉందా?
అధికారంలోకి వచ్చిన కొత్తలోనే సచివాలయంలో లంకె బిందెలు ఉంటాయనుకుంటే ఖాళీ ఖజానా చేతికి వచ్చిందని సెలవిచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. పథకాలకే డబ్బులు సరిపోవడం లేదు ఇంక పనులెక్కడ? అంటూనే మూసీ మురికిలో కాసుల వేట కోసం తహతహలాడుతుంటారు. తుమ్మిడిహట్టి అంటూ తుమ్మిందే తుమ్ముతారు. సంపద పెంచడం, నలుగురికీ పంచడం తెలియదు. పోనీ ఉన్నదాంట్లో ఇగురంగా నడుపుతారా అంటే అదీ తెలియదు. కాంగ్రెస్ అంటేనే మోసమని చరిత్ర తెలిసినవారు చెప్తారు. కానీ, ఈ చరిత్రను మరచిపోయి ఏమరుపాటున నమ్మిన జనానికి ఎక్కడ చూస్తే అక్కడ నీవై అన్నట్టుగా నమ్మకద్రోహమే నలుదిశలా ఎదురవుతున్నది. రంకెలు వెగటు పుట్టిస్తున్నాయి. బొంకులు నవ్వు తెప్పిస్తున్నాయి. మాట తప్పెటోళ్లకు, మడమ తిప్పెటోళ్లకు పగ్గాలు చేతికిచ్చి పరేషాన్ అయితున్నది తెలంగాణ నేడు.