బతుకమ్మలో ఎన్ని రకాల పూవులు పేరుస్తామో అన్ని రకాల అనుభవాలు, ఆనందాలు ఆడవాళ్లకి. మారింది సమాజం, మారింది పరిస్థితులు అని లెక్కలు, కాగితాలు సర్వేలు ఏమేమో చెప్తారు కానీ చుట్టూ చూస్తే పరిస్థితి ఎప్పటిలాగానే ఉంది. అందుకే నేమో తెలంగాణలో బతుకమ్మ తల్లి వెలిసినట్టుగా గట్టిగా అనిపిస్తుంది నాకు.
ఒక నలభై, యాభై ఏండ్ల కిందటి వరకు బతుకమ్మ పండుగకు తల్లిగారింటికి పోని ఆడవాళ్లు ఉండరు. పెళ్లిదాకా ఎటూ ఉంటారు. పెండ్లి తర్వాత నుంచి మొదలుపెడితే పిల్లలకు పది పన్నెండేండ్లు వచ్చేవరకన్న తల్లిగారింటికే పోవడం, సంతోషంగా పుట్టింట్లో దోస్తులతో ముచ్చట్లు, పిల్లలకి తినిపించడాలు, జడలు వేయడాలు, స్నానాలు, కొత్త బట్టలు& వీలుంటే కొనడాలు లేకుంటే అత్తగారింట్లో కొన్న వాటిని అందరికీ ఎంతో ఆనందంతో చూపడం.. అబ్బో ఒక్క పని కాదు. పిల్లల చదువు కొంచెం పెరుగుతున్న కొద్దీ ఆమె తన ఇల్లు, పిల్లల చదువులు మొదలైన వాటితో ఊపిరి తీయలేనంత బిజీ అయిపోతుంది. ఇంకా అనేక సాదకబాధకాలు కూడా తోడవుతయి. తల్లిగారింటికి వెళ్లడం తగ్గిపోతుంది.
బతుకమ్మ తల్లిగారింట్లో ఐతే ఒకరకంగా అత్త గారింట్లో ఐతే ఇంకోరకంగా తప్పక ఉంటుంది అమ్మాయిలకి. ఎట్లా అంటారా? అత్తింటిలో ఎంత లేదన్న కొంచెం మనసు, ఒళ్ళు దగ్గరపెట్టుకొని చేసుడు, అమ్మ దగ్గర కొంచెం అటు ఇటు అయినా నడుస్తుంది. అమ్మ సర్దుకుపొతది. పైగా కొంచెం దోస్తులదగ్గరికి ఇంకా ఆ ఊళ్ళోనే చుట్టాలు ఉంటే పోయిరావడానికి అమ్మనే చొరవ తీసుకొని పో బిడ్డ పన్లు నేను చేసుకుంటా.. పిల్లల్ని కూడా చూసుకుంటా అంటది. బతుకమ్మ సాంప్రదాయం ప్రకారం కొందరు ఇప్పటికీ బొడ్డెమ్మ నుంచి బతుకమ్మలు మొత్తం జరుపుకునే వాళ్ళున్నారు. బతుకువేటలో తీరిక లేక కేవలం మొదటిది, చివరిది చేస్తున్నారు.
సద్దుల బతుకమ్మ తోనే సరిపెట్టేవాళ్లున్నారు. సద్దుల బతుకమ్మ రోజు మాత్రం పల్లె పట్నం అని కాక తెలంగాణా అంతటా ఒక వంద పండుగల వైభోగం, సందడి. ఆ సంబురమే వేరు. గునుగు, తంగేడు, చామంతి, బంతి, కలువ, గన్నేరు, గులాబీ, మల్లెలు ఇట్ల దాదాపు ఎన్ని రకాల పూలు మనకి అందుబాటులో ఉంటాయో అన్నిటిని పేరుస్తూ ఆ మధ్యలో ఖాళీ అంతా గునుగు తంగేడు తరుగుతో నింపుతూ గట్టిగా ఇంకో కంచంతో ఒత్తుతూ చక్కటి అందమైన బతుకమ్మని పేర్చి దేవుడి గది దగ్గరే ఒక పీట వేసి పెడతారు. ఆ తర్వాత ఇంకో తోడు బతుకమ్మని పేరుస్తారు. పూజ చేసేటప్పుడు పసుపుతో గౌరమ్మను చేసి తమలపాకుల్లో చిన్న బతుకమ్మని పళ్లెంలో సర్దిపెడతారు. బతుకమ్మలకి పెట్టే అగరొత్తుల వాసన ఆ రోజంతా అందరి ఇళ్లల్లో ఒక అలౌకిక భావన తెప్పించి తీరుతుంది.
సాయంత్రం కలిగిన తీరుగా కొత్తవి.. లేకుంటే పెళ్లి నాటివి పట్టుచీరలు పెళ్లి అయినవాళ్ళు, పిల్లలు ఉన్నవాటిలో కొత్తవి కట్టుకుంటారు. ఉంటే బంగారు నగలు కూడా తప్పక వేసుకొని ఎవరింటిముందు వాళ్లు అలికి ముగ్గేసి రెండు బతుకమ్మలని పెట్టి ఒకటి రెండు చిన్న పాటలతో లయబద్ధంగా చప్పట్లు చరుస్తూ ఆడిన తర్వాత దగ్గరలో ఉన్న గుడి లేదా కూడలి లాంటి చోట చీకటి పడేదాక ఆడతారు. అక్కడి నుంచి అందరూ పల్లెల్లో చక్కగా చెరువు లేదా కుంటలు లేదా కాలువల దగ్గరికి పోవడం అక్కడ ఎంపలీ చెట్టు కొమ్మలు బతుకమ్మల మధ్య పెట్టి ఒక రెండు చుట్లు తిరిగి అందరూ ఒకరికొకరు పసుపు కుంకుమలు పెట్టుకొంటరు. తర్వాత పోయిరావమ్మ మల్లొచ్చే ఏడుకు మళ్ళీ రావమ్మా అని నీళ్లల్లో ఆడిస్తూ మెల్లగా వదిలిపెడతారు.
సద్దుల బతుకమ్మ రోజు చేసే చింతపండు పులుసు చద్ది ఒక ప్రత్యేక రుచి అని చెప్పాలి. అదే కాకుండా ఇంకో నాలుగు రకాల చద్దులు, తియ్యటి గరిజెలు, శనగపప్పు బరకగా పట్టిన పిండితో చేసే వడలు అన్నీ బతుకమ్మ నిమజ్జనం చేసిన దగ్గరే ఒకరికొకరు సంతోషంగా పంచుకుని కలిసిమెలిసి తింటరు. ఎంతో సంబురాన్ని నింపుకొని మెల్లగా ముచ్చట్లతో ఇంటికి చేరుకుంటరు. బతుకమ్మ పండగ నిజంగా ఒక సంవత్సరానికి సరిపడా ఉత్సాహాన్ని ఇస్తుందని నా నమ్మకం. నాకు ఇప్పటికీ అదే అనుభూతి. బతుకమ్మ పండుగ సందర్భంగా ఇప్పటికీ తల్లిగారి ఇంటికి పోయే అవకాశమున్న ప్రతివాళ్లు తప్పక వెళ్లాలి. పల్లె అమాయకత్వం మారినా ఆ ప్రేమలు, బంధాలు, ఆప్యాయతలు ఇసుమంత కూడా చెక్కుచెదరలేదు ఇప్పటికీ. ఇండ్లల్లో సౌకర్యాలు కొత్తగా ఎన్నో వచ్చినా కూడా పల్లె సౌకుమార్యం అట్లనే పదిలంగా ఉంది. ఒకరికొకరు సహాయపడే తత్వం ఇంకా తడిగానే ఉంది.
– బి.అనసూయ