పాట్నా సమావేశాన్ని తొలిమెట్టు చేసుకుంటూ ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదంతో తిరిగి అధికారానికి రావాలని తహతహలాడుతున్న కాంగ్రెస్, అదే ప్రజాస్వామ్యాన్ని బాహాటంగా గొంతు నులుముతున్న మోదీ ప్రభుత్వపు ఢిల్లీ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించేందుకు మాత్రం నిరాకరిస్తున్నది. ఢిల్లీ పాలనాధికారం ఆప్ ప్రభుత్వానిదేనని సాక్షాత్తూ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును సైతం వమ్ము చేస్తున్న ఆర్డినెన్స్‌ను దేశంలోని ప్రతి ఒక్క పార్టీ ఖండించినా కాంగ్రెస్ మాత్రం నోరు విప్పటం లేదు. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ దయ్యాలు వేదాలు వల్లించినట్టు అందరూ కలిసి మళ్లీ తనకు అధికారం కట్టబెడితే ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తానంటుంది
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న మాట నిజం. అటువంటి ప్రభుత్వం ఓడిపోవటం దేశానికి ఒక తప్పనిసరి అవసరం అనే మాట కూడా నిజం. దీన్ని దృష్టిలో ఉంచుకుంటూ, ఎన్నికలు ముంచుకొని వస్తున్న వేళ, పలు ప్రతిపక్షాలు ఒకటయ్యేందుకు ప్రయత్నించటం సహజం. అందువల్లనే శుక్రవారం నాటి పాట్నా సమావే శం జరిగింది. కానీ వివరాల్లోకి వెళ్తే కనిపించేది ఏమిటి? ఇతర పార్టీలది ప్రజాస్వామ్య ఆకాంక్ష కాగా, కాంగ్రెస్‌ది అధికార కాంక్ష. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పార్టీ పదిమెట్లు అయినా దిగి వస్తుందని ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పాట్నాకు ముందు రోజులలో, తిరిగి ఆ సమావేశ సందర్భంలోనూ అన్నారు. ఆ మాట విన్నవారికి అది ఎంతో గొప్పగా తోస్తూ వచ్చింది. కానీ గమనించదగినదేమంటే ఆయన ఈ ‘పది మెట్ల’ మాటను మొదలుపెట్టిన సమయంలోనే ఢిల్లీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. ఆ వెంటనే కేంద్ర ఆర్డినెన్స్ జారీ అయింది. దానిని అందరూ ఖండించారు కాంగ్రెస్ తప్ప.
అప్పటినుంచి పాట్నా వరకు రాహుల్‌గాంధీ ‘పది మెట్ల’ పాట అయితే పాడుతూనే పోయారు కానీ, ఢిల్లీ ఆర్డినెన్స్‌పై మెట్టు మాత్రం దిగలేదు. సదరు ఆర్డినెన్స్ ఎంత దుర్మార్గమైనదో ఎటువంటి వివరణ అవసరం లేకుండానే అందరికీ అర్థమవుతున్న విషయం కనుకనే దేశమంతటా ఎన్నో పార్టీలు, మేధావి వర్గాలు, విస్తృతమైన మీడియా నుంచి విమర్శలు వెలువడ్డాయి. ఆర్డినెన్స్‌ను ఖండించవలసిందిగా ఆప్ అధ్యక్షుడైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నుంచి ఎటువంటి విజ్ఞప్తి లేకుండానే ఇదంతా జరిగింది. కాని కాంగ్రెస్ మాత్రం మౌనం వహించింది. అది గమనించిన కేజ్రీవాల్ ఆ పార్టీకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఆర్డినెన్స్ పార్లమెంటులో ఓటింగుకు వస్తుంది గనుక మరీ ప్రత్యేకంగా ఒకటికి నాలుగుసార్లు కోరారు. చివరికి ఇప్పుడు పాట్నా సమావేశం జరగనుండగాను, వాస్తవంగా జరుగుతున్నప్పుడు కూడా ఆ ప్రస్తావన తెచ్చారు. ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించనట్టయితే కాంగ్రెస్‌తో కలిసి ఈ సమావేశాల్లో పాల్గొనటం కష్టమని సైతం హెచ్చరించారు.
అయినప్పటికీ ‘పదిమెట్ల’ రాహుల్‌గాంధీ ఒక్క మెట్టు కూడా దిగలేదు. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం, పార్లమెంటు సమావేశాల నాటికి ‘ఒక నిర్ణయం’ తీసుకుంటామని మొక్కుబడి మాట ఒకటన్నారు. ఎంతో స్పష్టంగా కనిపిస్తున్న ఒక అప్రజాస్వామిక అంశం విషయంలో, వారాల తరబడి సాగుతున్న చర్చ విషయంలో, దేశంలోని అన్ని ప్రతిపక్షాలు ఖండించిన విషయంలో, కేజ్రీవాల్ పదేపదే విజ్ఞప్తి చేసిన విషయంలో, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ‘పది మెట్లు’ దిగుతామనే పార్టీ వైఖరి ఇదన్నమాట. కాదు, కాదు, నిజస్వరూపం ఇదన్న మాట. వారి నిజ స్వరూపానికి, నిజ ఉద్దేశాలకు ఇది ప్రతీకగా నిలుస్తుంది. ఇంతకూ ఎందుకీ కపటపు వైఖరి? ఢిల్లీని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్‌ను కేజ్రీవాల్ పార్టీ వరుసగా మూడుసార్లు పరమ చిత్తుగా ఓడించింది. అందుకే రగిలిపోతుండగా మొన్నటిసారి పంజాబ్‌లోనూ ఓడించింది. ఇక చెప్పేదేమున్నది. కక్ష పరాకాష్టకు చేరింది. ఈ ఎన్నికలన్నీ ప్రజాస్వామికంగానే జరిగాయి కదా అని మనం అనవచ్చు. కానీ కాంగ్రెస్‌కు, రాహుల్‌గాంధీకి అట్లా కాదు. అవే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పాటు అంతే చిత్తుగా ఓడిన బీజేపీ కూడా అంతే కక్షగట్టి ఆప్ ప్రభుత్వాన్ని వీలైనన్ని విధాలుగా వేధిస్తూ ఇప్పుడీ ఆర్డినెన్స్ సైతం తెచ్చింది. ఆ విధంగా, ప్రజాస్వామ్య వ్యతిరేక కక్ష సాధింపులో కాంగ్రెస్, బీజేపీలు సుందోపసుందులయ్యాయి. అటువంటప్పుడు రాహుల్‌గాంధీ ‘పది మెట్ల’ నుంచి ఎట్లా దిగగలరు?
వాస్తవానికి ఎంతో గొప్పగా తోచే ‘పది మెట్ల’ పాట వారు పైకి వల్లిస్తున్నట్టు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదు. ఆ పేరిట అందరినీ ఫూల్స్ చేసి మరొకమారు అధికారం సంపాదించుకునేందుకు. అనుభవించేందుకు. మరిన్ని ధనరాశులు పోగు చేసుకునేందుకు. పైన అంతా మనం ఢిల్లీ ఉదంతాన్ని చర్చించినా, నిజానికి కాంగ్రెస్ అప్రజాస్వామిక వైఖరులు ప్రతిపక్ష స్థానంలో ఎటువంటివో, అధికారంలో ఉండినప్పుడు ఏ విధంగా సాగాయో చాలా పెద్ద చరిత్రే. అందుకే కదా వరుసగా పదేండ్లు (2004-14) పరిపాలించినప్పుడు సాధించిన ఘనమైన రికార్డుతో తమ లోక్‌సభ బలం 206 (2009) నుంచి, పార్టీ చరిత్రలోనే లేనివిధంగా మహా దారుణంగా 44 (2014), 52 (2019)కు పతనమైంది?
దేశాన్నంతా పాలించిన ఆ పార్టీ ఈ రోజున మొన్నటి కర్ణాటకను కూడా కలుపుకొని నాలుగే నాలుగు రాష్ర్టాలలో అధికారంలో ఉన్నది. ‘పది మెట్ల’ రాహుల్ గాంధీ అయితే 2004లో 18 ఏండ్ల కిందట ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచి ఈ సుదీర్ఘకాలంలో సాధించిన ఘనత ఏమిటో అందరికీ తెలిసిందే. వరుసగా రెండు (2014, 2019) హీనమైన పరాజయాల తర్వాత ఈ సారి అయినా గెలిచేందుకు ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ‘పది మెట్ల’ పాట వినిపిస్తున్నారు ఒక్క మెట్టయినా దిగకుండా.
చివరికి ఎన్నికల్లో ప్రజలు ఏమి తీర్పు చెప్తారో గాని, వారి వాస్తవ పరిస్థితి మాత్రం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ముందు నుయ్యి వెనుక గొయ్యి వలె తయారైంది. ఈ రెండింటికి నిజమైన మరొక ప్రత్యామ్నయం వచ్చేవరకు ఇది తప్పని శిక్ష.
టంకశాల అశోక్