చట్టం ముందు అందరూ సమానమే. భావప్రకటనా స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. ఈ రెండు విషయాల గురించి ఇప్పుడు తెలుగు రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఇందుకు ప్రధాన కారణం ఇద్దరు జర్నలిస్టుల అక్రమ అరెస్టు. విలేకరులుగా తమ భావప్రకటనా స్వేచ్ఛను ఆధారం చేసుకుని తమ అభిప్రాయాలను చెప్పడమే ఈ అరెస్టులకు మూలం. సంధించిన ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యలతో తమ మనోభావాలు గాయపడ్డాయని అధికారంలో ఉన్న పాలకులు చెప్తున్నారు.
రాజకీయ నాయకులు పలు సందర్భాల్లో చాలా విషయాలు మాట్లాడుతుంటారు. కానీ అవి లెక్కలోకి రావడం లేదు. అమలు చేయలేని వాగ్దానాలు ఇవ్వడం, బహిరంగ సభల్లో తీవ్రస్థాయిలో తిట్ల దండకాలు, ఇలా చెప్పుకొంటూపోతే ఎన్నో.. ఎన్నెన్నో. కానీ ఇదే పాలకుల పనితీరుపై కాస్త ఘాటుగా జర్నలిస్టులు తమ అభిప్రాయాలు చెప్పినా, ఎక్కడ మాట్లాడినా వెంటనే తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని వారిపై అక్రమ అరెస్టులు చేయిస్తున్నారు. ప్రధానంగా ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా చూస్తున్నాం. ఇటీవల ఇద్దరు జర్నలిస్టులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఇద్దరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు. వీరిద్దరు చేసిన కామెంట్లపై ఆ ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం కలిగింది. వెంటనే అరెస్టుకు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు అమలు చేశారు.
ఆర్టికల్ 19 (1) ఏ కింద ఏదంటే అది మాట్లాడేందుకు వీల్లేదు. అలాగని తమకు తోచిన రీతిలో దాన్ని అన్వయించుకుంటామని పాలకులు సమర్థించుకుంటామంటే కుదరదు. మీడియా, రాజకీయపార్టీలు కొన్ని సందర్భాల్లో కలిసి ప్రయాణం చేస్తున్నాయి. కొన్ని పార్టీలు ఏకంగా మీడియా సంస్థలు సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. తమ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు కొన్ని పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. ఇదంతా బహిరంగ రహస్యమే. ఎటొచ్చీ జర్నలిస్టులు ఏదైనా మాట్లాడితే తప్పని అంటున్నారు. ఇక్కడే సమస్య వస్తున్నది.
జర్నలిస్టుల అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. వీటినే డీకే బసు మార్గదర్శకాలని కూడా అంటారు. ఇందులోని పలు అంశాలను ఒకసారి పరిశీలించి చూస్తే పోలీసులు అరెస్టు చేసే సందర్భంలో సదరు అధికారులు యూనిఫామ్‌లో ఉండాలి. వారి పేర్లు స్పష్టంగా కన్పించాలి. కానీ తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ అరెస్టు సమయంలో పోలీసులు సివిల్ డ్రెస్‌లో ప్రైవేట్ వాహనంలో వచ్చారు. సదరు జర్నలిస్టు కనీసం పూర్తి డ్రెస్ వేసుకుంటానంటే కూడా అనుమతించకుండా నైట్‌డ్రెస్ మీదనే హుటాహుటిన అరెస్టు చేసి తీసుకెళ్లారు.
మరో ప్రధాన అంశం..అరెస్టు చేసిన వారి గురించిన వివరాలు కుటుంబ సభ్యులకు, లేదా మిత్రులకు విధిగా తెలియజేయాలి. కానీ ఇక్కడ అది కూడా జరుగలేదు. వచ్చినవారు పోలీసులో లేదా మరెవరో తెలియని ఆ జర్నలిస్ట్ భార్య అడ్డుపడితే ఆమెను బలవంతంగా నెట్టిన తీరు నిజంగా ఆక్షేపణీయం. అరెస్టు చేసిన విషయం గురించి పోలీసు స్టేషన్లలో నోటీసు బోర్డుపై వివరాలు తెలియజేయాలి. అరెస్టు చేసిన జర్నలిస్టు శరీరంపై ఏమైనా గాయాలున్నాయా లేదా అనే అంశంపై వైద్య పరీక్షలు నిర్వహించాలి. జర్నలిస్టు సంతకం తో కూడిన మెమో ఇవ్వాలి. ఒకవేళ అరెస్టయిన వ్యక్తికి చట్టం గురించి అవగాహన లేకపోతే న్యాయవాది సహాయం స్వయంగా పోలీసులే అందించా లి. జర్నలిస్టు కేవీఆర్ అరెస్ట్ విషయంలో అటు ఆం ధ్రా పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం, తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన ఉదాసీనతను జర్నలిస్టు యూనియన్లు తప్పుపడుతున్నాయి.
చంద్రబాబు వంటి సీనియర్ ముఖ్యమంత్రి పాలనలో ఆర్టికల్ 19 అపహాస్యం కావడం ఏమిటని చాలామంది మేధావులు తమ అభిప్రాయాన్ని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గతంలో చాలా అంశాలపై మాట్లాడారు. తన భావప్రకటనా స్వేచ్ఛను ఆయన విరివిగా వాడుకున్నారు. కానీ జర్నలిస్టుల విషయంలో మాత్రం ఆయన చాలా నిక్కచ్చిగా ఉన్నారు. ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే తన వాళ్లతో కేసులు పెట్టించడం, దానిపై పోలీసులు ఆగమేఘాల మీద స్పందిం చి చర్యలు తీసుకోవడం గమనిస్తున్నాం. ఇటీవల ఆ ప్రాంతంలో ‘ప్రశ్న’ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ నడుపుతున్న జర్నలిస్టు రావణ్‌పై ఏకంగా ఆరుచోట్ల కేసులు నమోదు కావడం, అరెస్టులు చేయడం చూశాం.
ఒక కేసులో కోర్టు బెయిల్ ఇవ్వగానే మరో కేసులో అరెస్ట్ చేసి లోపల వేశారు. నమోదు చేసిన కేసుల్లో పస లేకపోవడంతో బెయిల్ రావడంతో ఏకంగా అతనిపై ఉద్దేశపూర్వకంగా దేశద్రోహం కేసు (ఉపా) నమోదు చేసినట్లు తెలిసింది. దీంతో చివరికి కోర్టు రిమాండ్ విధించక తప్పని అనివార్య స్థితి కల్పించారు. ఒకరిపై దేశద్రోహం కేసు పెట్టాలంటే బొంబా యి హైకోర్టు ఇచ్చిన బహిరంగ తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలించి ఉంటే బాగుండేదేమోనని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. 2024 మార్చి 5న న్యాయమూర్తులు వాల్మీకి ఎస్.ఏ. మెనెజెస్, వినయ్ జోషి ఇచ్చిన తీర్పు ప్రకారం కమ్యూనిస్టు లేదా నక్సలైట్ భావజాలానికి సంబంధించిన సమాచారాన్ని డౌన్లోడ్ చేయడం లేదా చూడడం నేరం కాదు. ఒక భావజాలం పట్ల కేవలం సానుభూతి కలిగి ఉండడం కూడా నేరంగా పరిగణించేందుకు ఆస్కారం లేదు.
చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం, 1967 (ఉపా)లోని సెక్షన్లు 13, 20 లేదా 39 కింద నేరం నిరూపించాలంటే, నిందితుడు ఉగ్రవాద కార్యకలాపాలు లేదా నిషేధిత సంస్థకు చురుకుగా సహకరించినట్లు, లేదా హింసాత్మక ఘటనలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉంటేనే కేసు నమోదు చేయాలి.
కానీ జర్నలిస్టు రావణ్ విషయంలో కేవలం ఒక ఇంటర్వ్యూలో నిషేధిత సంస్థ గురించి మాట్లాడటం, ఒక పోరాటయోధుడికి జైకొట్టడాన్ని నేరంగా చూపించి ఈ తరహా కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమో పౌరసమాజం చెప్పాలి. పార్టీలు ఏవైనా జర్నలిస్టుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని, ప్రశ్నించడాన్ని సహించలేకపోతున్నారని చాలా సందర్భాల్లో రుజువవుతున్నది. ప్రజాస్వామ్యం బలపడాలంటే ఫోర్త్ ఎస్టేట్ మరింత సమర్థవంతంగా, ప్రభావంతంగా పనిచేయాలి. ఆ దిశగా పార్టీలు, నాయకులు వ్యవస్థలు ఇప్పటికైనా సహకరించాలి. లేదంటే జర్నలిస్ట్ సమాజం మొత్తం ఏకమై ఉద్యమాన్ని నిర్మించడమే ఏకైకమార్గం.
(వ్యాసకర్త: ప్రధాన కార్యదర్శి, టీయూడబ్ల్యూజే)
– అస్కాని మారుతీ సాగర్
9010756666