సత్వర న్యాయం పేరిట నిందితుల ఇండ్లను కూల్చివేయడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటిదని చెప్పాలి. న్యాయం ముసుగులో జరిగే ఈ ప్రతీకార దాడులు చెల్లవని తేల్చిచెప్పింది. నిందితులపై నేరం రుజువైనప్పటికీ వారి ఇండ్లను కూల్చడం సరికాదని, ఏదైనా చట్టం ప్రకారమే జరగాలని స్పష్టం చేసింది. అంటే ఏదైనా చట్టం లేదా నిబంధన ఉల్లంఘించినట్టు రుజువైతేనే కూల్చాల్సి ఉంటుంది. అదీ ముందస్తుగా నోటీసు ఇచ్చి, న్యాయపరమైన రక్షణ పొందేందుకు వీలు కల్పిం చి, ఆ తర్వాతే బుల్డోజర్లు పంపాలని కోర్టు మార్గదర్శకాలు జారీచేసిం ది. ఇటీవల యూపీలో కోర్టు కేసులు, విచారణలు, శిక్షలు అనేవి లేకుండానే ఆగమేఘాల మీద బుల్డోజర్లను నిందితుల ఇండ్ల మీదకు నడిపించడం ఓ రివాజుగా మారిన సంగతి తెలిసిందే. హింసాత్మక, ఉగ్రవాద ఘటనలతో సంబంధమున్నదని ప్రభుత్వం భావించే వ్యక్తుల ఇండ్లే లక్ష్యమని యోగి సర్కార్ అంటున్నది. కానీ, వాస్తవంలో ఒక వర్గానికి చెందినవారే ఈ సత్వర న్యాయానికి బలైపోతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విమర్శను తప్పించుకునేందుకు అప్పుడప్పుడు స్వపక్షీయుల ఇండ్లపైకి కూడా బుల్డోజర్లు నడిపారు. బుల్డోజర్ న్యాయం లేదా సత్వరన్యాయమని పిలిచే ఈ ప్రక్రియకు ఆద్యుడైన యోగిని ‘బుల్డోజర్ బాబా’ అని పిలవడం పరిపాటి అయింది.
యూపీ నుంచి ఈ ప్రమాదకర ధోరణి మధ్యప్రదేశ్, రాజస్థాన్ వం టి ఇతర బీజేపీ పాలిత రాష్ర్టాలకు పాకింది. కొన్ని సందర్భాల్లో ప్రభు త్వం నిందితునిగా పేర్కొన్న వ్యక్తి పేరు మీద కాకుండా ఇతరుల పేరు మీద నిర్మించిన ఇండ్లనూ కూల్చడం తీవ్ర విమర్శలకు గురైంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇటీవల క్లాస్‌మేట్‌ను కత్తితో పొడిచిన ఓ విద్యార్థి తండ్రికి చెందిన ఇంటిని కూల్చడం ఈ విపరీత ధోరణికి పరాకాష్ఠ. నిన్నటివరకు బీజేపీ పాలిత రాష్ర్టాలకు పరిమితమైన బుల్డోజర్ న్యాయం ఇప్పుడు కాంగ్రెస్ పాలిత తెలంగాణలోనూ ప్రత్యక్షమైంది. నిబంధనలకు విరుద్ధంగానో లేక నిషేధిత స్థలంలోనో కట్టారంటూ రేవంత్ సర్కార్ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు నడపడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ జాతీయస్థాయిలో వ్యతిరేకిస్తున్న బుల్డోజర్ న్యాయా న్ని ఆ పార్టీకి చెందిన ఇక్కడి ప్రభుత్వం అమలుచేయడం విచిత్రం. బుల్డోజర్ న్యాయం బూటకమని, అదొక తమాషా లాగా తయారైందని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియంకా గాంధీ చేసిన విమర్శలు ఇంకా సీఎం రేవంత్ చెవులకు సోకలేదా లేక ఆయనలోని బీజేపీ మూలాలు బుల్డోజర్లు నడిపేలా చేస్తున్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రేవంత్ బుల్డోజర్ దూకుడుకు న్యాయస్థానంలో బ్రేకులు పడ్డాయి. లెక్కాపత్రం లేకుండా కూల్చివేతలు జరపడం చెల్లదని, ముందస్తు నోటీసులిచ్చి చట్టపరమైన పద్ధతిలోనే ముందుకుపోవాలని తెలంగాణ హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. బాధితులకు న్యాయపరమైన ఉపశమనం పొందే అవకాశం కల్పించాలని కూడా సూచించింది. ప్రభుత్వం ఇచ్చే కూల్చివేత ఉత్తర్వులను షోకాజ్ నోటీసులుగా పరిగణించాలని చెప్పడం గమనార్హం. ఇప్పుడు వేరే కేసులో సుప్రీంకోర్టూ అదే చెప్పింది.
చట్టం నేరస్థులను శిక్షించమంటుంది. అదీ సజావైన విచారణ తర్వాతే. అమాయకులైన కుటుంబసభ్యులను రోడ్డు మీదకు తేవడం చట్టవిరుద్ధమే కాదు, న్యాయవిరుద్ధమని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. రాజ్యాంగం కల్పించిన న్యాయపరమైన హక్కులను ప్రభుత్వమే హరించి వేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. చట్టాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలే దానిని ఉల్లంఘించడంగానే దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. న్యాయప్రక్రియ పట్ల ప్రభుత్వాల అపనమ్మకాన్ని, వ్యతిరేకతను ఇది సూచిస్తున్నది. న్యాయవ్యవస్థలో పద్ధతి ప్రకారం పోవాలంటే ఎంతో కొంత జాప్యం తప్పనిసరి. అది తాత్సారంగా పరిణమించి, బాధితులు కృంగి, కృశించిన తర్వాత న్యాయం చేయడం సరికాదు. ఆలస్యంగా జరిగే న్యాయం అన్యాయమే అనే నానుడు అం దుకే వచ్చింది. దానికి పూర్తి భిన్నమైన సత్వరన్యాయం కూడా అన్యాయమే అనేది సర్వోన్నత న్యాయస్థానం తీర్పు సారాంశం.