కులమతాల పేరు మీద రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం. కానీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదు. ఈ ప్రాతిపదికన దేశంలో పురుడుపోసుకున్నవే రిజర్వేషన్లు. అణగారిన జాతులకు సమాన విద్యావకాశాల కోసం మొదట ఎలుగెత్తిన దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే. 1882లోనే ఇప్పటి మహారాష్ట్ర ప్రాంతంలో దళితులకు సమాన విద్యావకాశాల కోసం ఆయన ఉద్యమం చేశారు. దాని ఫలితంగానే హంటర్ కమిషన్‌ను లార్డ్ రిప్పన్ నియమించారు.
తర్వాతి కాలంలో 1909లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం మింటో మార్లే కమిషన్‌ను నియమించింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో 1927లో సైమన్ కమిషన్‌ను నియమించి దళిత, గిరిజన, బలహీన వర్గాలకు విద్యా, రాజకీయ రంగాలలో రిజర్వేషన్ల కల్పనకు బాటలు వేసింది. 1932లో వచ్చిన కమ్యూనల్ అవార్డ్, పూనా ఒడంబడికల నేపథ్యంలో దేశంలో మొట్టమొదటిసారిగా దళిత జాతికి ప్రత్యేక శాసనసభా నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. దళిత బహుజనులకు సమాన విద్యావకాశాల కోసం మొదట పోరు సలిపింది ఫూలే అయినప్పటికీ వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత మాత్రం అగ్రవర్ణానికే చెందిన మహారాజు ఛత్రపతి సాహూ మహారాజ్‌కు దక్కడం విశేషం. 1902లోనే ఆయన కొల్హాపూర్ సంస్థానంలో దళిత, బహుజనులకు 50 శాతం ఉద్యోగాలను కేటాయించారు. సమాన విద్యావకాశాలు కూడా కల్పించారు. తద్వారా దళిత, బహుజనులకు గుర్తింపునిచ్చిన, రిజర్వేషన్లు కేటాయించిన మొదటి వ్యక్తిగా ఆయన పేరుపొందారు. ఆ తర్వాత ఇలాంటి సమానత్వం, రిజర్వేషన్లనే ట్రావెన్కోర్ సంస్థానంలో కూడా అమలుపరిచారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మార్గదర్శకత్వంలోని రాజ్యంగ సభ షెడ్యూల్డ్ కులాలు, తెగలుగా అణగారిన వర్గాలను, రక్షించుకోవలసిన జాతులను ఆర్టికల్ 341 కింద ప్రత్యేకంగా పొందుపరిచింది. రాజ్యాంగంలోని షెడ్యూల్ 7 ఆయా జాతులకు రక్షణ కవచం లాంటిది. ఆర్టికల్ 341లో పొందుపరిచిన కులాలు మాత్రమే షెడ్యూల్డ్ కులాలు అని ఆర్టికల్ 366(24) ద్వారా రాజ్యాంగ నిర్మాతలు స్పష్టంగా నిర్వచించారు. ఈ జాబితాలోకి కొత్తగా కులాలను చేర్చడం రాష్ట్రపతికి మాత్రమే సాధ్యం. తొలగించే హక్కు మాత్రం సంపూర్ణంగా భారత పార్లమెంటుకు ఉంటుంది.
షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన రిజర్వేషన్లను జాబితాలోని కులాల మధ్య సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన అంతరాలను దృష్టిలో ఉంచుకుని వర్గీకరించడం రాజ్యాంగ బద్ధమేనా? అనే చర్చ 1994లో హర్యానా ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలను రెండు వర్గాలుగా వర్గీకరించడంతో మొదలైందని చెప్పవచ్చు. 1994లోనే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లు ఆ జాబితాలోని అన్ని కులాలకు సమానంగా అందుతున్నాయా? లేదా ఆయా కులాలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు అందించాల్సిన అవసరం ఉన్నదా? అనే అంశాన్ని పరిశీలించడానికి జస్టిస్ రామచంద్రన్రాజు నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫారసులను ఆమోదిస్తూ 2000లో షెడ్యూల్డ్ కులాలను ఏ, బీ, సీ, డీ అనే నాలుగు వర్గాలుగా విభజిస్తూ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల (రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్) చట్టం, 2000ను అసెంబ్లీలో ఆమోదించింది. ఆ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ కులాలలో ఏ వర్గంలోకి వచ్చేవారికి 1 శాతం రిజర్వేషన్లు, బీ వర్గానికి 7 శాతం, సీ వర్గానికి 6 శాతం, డీ వర్గానికి 1 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా వర్గీకరించారు. ఈ నేపథ్యంలో ఈవీ చిన్నయ్య VS స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మధ్య నడిచిన కేసు అన్ని రాష్ర్టాల రిజర్వేషన్ల చట్టబద్ధతను నిర్ణయించేదిగా మారింది. ఈ క్రమంలో 2006లో పంజాబ్ ప్రభుత్వం.. పంజాబ్ ఎస్సీ, బీసీ (రిజర్వేషన్స్ ఇన్ సర్వీసెస్) చట్టం 2006ను తీసుకొచ్చింది. ఆ చట్టంలోని సెక్షన్ 4(5) ప్రకారం షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన రిజర్వేషన్లలో 50 శాతం జాబితాలోని వాల్మీకి, మజాబీ సిక్కులకు అందుతాయి. ఈ కేటాయింపులు రాజ్యాంగ విరుద్ధం, రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా విభజించే అధికారం లేదంటూ పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసును విచారించిన పంజాబ్, హర్యానా హైకోర్టు 29 మార్చి, 2010న సెక్షన్ 4(5) రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది. దీంతో పంజాబ్ ప్రభుత్వం సుప్రీం తలుపు తట్టింది. పంజాబ్, హర్యానా హైకోర్టు ఈవీ చిన్నయ్య VS స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకొని వర్గీకరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఈ క్రమంలో 2009 నాటి తమిళనాడు ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలలోని కొన్ని వర్గాలకు వర్గీకరణ ద్వారా ప్రత్యేక రిజర్వేషన్లను అందిస్తూ అసెంబ్లీలో ఆమోదించిన చట్టాన్ని కూడా నాటి మద్రాస్ హైకోర్టు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. చిన్నయ్య కేసు విషయంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం ఏమంటే.. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా షెడ్యూల్ 7లో పొందుపరిచిన షెడ్యూల్డ్ కులాల జాబితాలోని వర్గాలకు వర్గీకరణ ప్రాతిపదికన రిజర్వేషన్లు అందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదనేది. ఈ క్రమంలో వెనుకబడిన తరగతులకు వర్గీకరణ ద్వారా రిజర్వేషన్లను అందించడం రాజ్యాంగ విరుద్ధం కాదంటూ ఇంద్రా సహానీ కేసులో 9 మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు కూడా చర్చకు వచ్చింది. కానీ, ఆ తీర్పు వెనుకబడిన తరగతుల వారికి మాత్రమే వర్తిస్తుందని, షెడ్యూల్డ్ కులాలకు వర్తించదని తిరస్కరించారు.
అన్ని రాష్ర్టాల నుంచి వచ్చిన కేసులను పరిశీలించిన తర్వాత 27ఆగస్టు 2020లో స్టేట్ ఆఫ్ పంజాబ్ VS దవేందర్ సింగ్ కేసును విచారిస్తున్న న్యాయమూర్తులు ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ బెంచ్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ బెంచ్ చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలని నిర్ణయించారు. అందుకు సుప్రీంకోర్టు ప్రధానంగా నాలుగు కారణాలను చూపింది. వాటిలో మొదటిది.. ఇంద్రా సహానీ కేసులో వెనుకబడిన తరగతులలో వర్గీకరణ సహేతుకమే అంటూ ఇచ్చిన తీర్పు షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకు ఎందుకు వర్తించదో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చిన్నయ్య కేసులో సహేతుకంగా వివరించలేకపోయింది. రెండోది.. షెడ్యూల్డ్ కులాలలో చేరినవారందరూ సజాతీయ సమూహానికి చెందినవారు కారన్నది సత్యం. వారిలో అత్యంత వెనుకబడిన జాతులకు సహేతుకమైన ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం, సమాన అవకాశాలు కల్పించాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి లోబడే ఉంటుందన్న అంశాన్ని చర్చించలేకపోయింది. మూడోది.. ఆర్టికల్ 16(4)ను అనుసరించి షెడ్యూల్డ్ కులాలలో సమాన ప్రాతినిధ్యం పొందలేకపోతున్న వర్గాలకు వర్గీకరణ ద్వారా ప్రత్యేక రిజర్వేషన్లు రూపొందించే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందన్న అంశాన్ని విస్మరించింది. నాలుగోది.. షెడ్యూల్ 7లో ఉన్న కొన్ని కులాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం ఆర్టికల్ 341లో చేర్చబడిన మిగతా కులాలను విస్మరించడంగా పరిగణించరాదు. క్రీమీలేయర్‌ను షెడ్యూల్డ్ కులాలకు కూడా వర్తింపజేయడం రాష్ట్రపతి ఉత్తర్వులను బలహీనపరచడం ఎంతమాత్రం కాదు. వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదన్న అంశాన్ని కూలంకషంగా నాటి తీర్పులో చర్చించలేకపోయారు. చర్చల సందర్భంగా హేమాహేమీలైన న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. షెడ్యూల్ 7లోని కులాల మధ్య ప్రాధాన్య క్రమాన్ని వర్గీకరణ ద్వారా మార్చే అధికారం రాష్ర్టాలకు ఉందన్నారు. ఈ సందర్భంగా చర్చిస్తూ సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించే ప్రత్యేక అధికారాన్ని రాష్ట్రపతికి అందిస్తూ.. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన ఆర్టికల్ 342ను పరిశీలిస్తే ఆర్టికల్ 341, 342 కూడా ఈ కోవలోకే చెందుతాయన్నది విస్పష్టం. ఇంద్రా సహానీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా జోడించి చూస్తే.. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం ఎంతమాత్రం కాదన్నది స్పష్టమవుతుందని వాదించారు. సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ వాదిస్తూ ఆర్టికల్ 14 కేవలం సమాన అవకాశాలను ఆదేశించడం లేదు, అసమానతలున్న రెండు వర్గాలకు ఒకే విధమైన అవకాశాలివ్వడం కూడా అహేతుకమని నిషేధిస్తున్నదని చెప్పారు. అటార్నీ జనరల్ వెంకటరమణి మాట్లాడుతూ ఒక గ్రూపులో చేర్చబడినంత మాత్రాన అందరూ సజాతీయులు అయిపోరు, అంతరాలు తొలగిపోవని అన్నారు.
ఉన్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువరిస్తూ.. ఇంద్రా సహానీ కేసులో సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పు కేవలం బలహీన వర్గాల వర్గీకరణకే పరిమితం కాదు, అది షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకు కూడా వర్తిస్తుందని, వర్గీకరణ ఆర్టికల్ 14లోని సమానత్వ సూత్రానికి విరుద్ధం ఎంతమాత్రం కాదని విస్పష్టంగా చెప్పింది. తీర్పును పరిశీలిస్తే.. అర్థమయ్యే ప్రధాన అంశం ఏమిటంటే.. ఆర్టికల్ 341 (1)లో చేర్చబడినంత మాత్రాన అన్ని కులాలు సజాతీయ సమూహాలుగా మారిపోవు. అది కులాలను ప్రత్యేక వర్గంలోకి తేవడానికి ఉద్దేశించింది మాత్రమే. వర్గీకరణ ఆర్టికల్ 341 (2)కు ఎంతమాత్రం విరుద్ధం కాదు. చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే.. షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చబడిన కులాలు సామాజికంగా విభిన్న తరగతులకు చెందినవి. వారందరికీ సరైన అవకాశాలను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టికల్ 15 (4), 16 (4) అధికరణం కింద అధికారాలను వినియోగించుకోవడం రాజ్యాంగ బద్ధమే అంటూ, ఈవీ చిన్నయ్య VS స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో నాటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. దీంతో షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల ప్రస్థానంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది.