తెలంగాణలో సూపర్ ఎల్ నినో కరువును తీవ్రతరం చేసింది. అదే సమయంలో రాజకీయ వేడిని కూడా పెంచింది. ఈనెల 5న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీ శ్రేణులు కాంగ్రెస్.. సర్కార్ కల్పించిన అనేక అడ్డంకులను అధిగమించి కన్నేపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించారు. గోదావరి నదిలో ప్రవహిస్తున్న లక్ష క్యూసెక్కుల నీటిని చూపించి, ఈ నీటిని ఎత్తిపోసి రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాకపోతే తమకు అప్పజెప్తే వారం రోజుల్లో నీటిని ఎత్తిపోసి, రిజర్వాయర్లను నింపి చూపిస్తామని సవాల్ విసిరారు. ఇందుకు సర్కార్ ఒప్పుకోని పక్షంలో వేలాదిమంది రైతులతో కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ముట్టడించి తామే పంపులను ఆన్ చేస్తామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ బృందం కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించడం, ఆ తర్వాత రైతు హెచ్చరికలతో రాష్ట్రంలో మరింత రాజకీయ వేడిని రాజేసింది. బీఆర్ఎస్ సవాల్‌కు కౌంటర్‌గా 6వ తేదీన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ నెపాన్ని ఎన్డీఎస్ఏ మీదకు నెట్టి, బరాజ్‌ల మరమ్మతులు పూర్తయ్యేదాకా వాటిల్లో నీటిని నింపే ప్రసక్తే లేదని ప్రకటించారు. 7వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సహచర మంత్రివర్గ సభ్యులతో కలిసి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో అసలు వర్షాలే లేవు, వరదలే లేవు, నీటిని ఎట్లా ఎత్తిపోయాలని సాక్షాత్తు సీఎం ప్రశ్నించారు. ఇది అవగాహనారాహిత్యంతోనా లేదా సమాచారలోపం వలన అన్న మాటనా తెలియదు. గతంలో కూడా సీఎం ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌కు గురైన సందర్భాలు ఉన్నాయి. సీఎం మాటలు ఎంత సత్యదూరమో ప్రతిరోజూ కేంద్ర జల సంఘం నమోదు చేస్తున్న గేజ్ రీడింగ్స్ చూస్తే తెలుస్తుంది.
నిజానికి ఈనెల 5న కేటీఆర్ పర్యటనలోనే కనిపించిన వాస్తవం అది. మేడిగడ్డ బరాజ్ వద్ద పెద్దఎత్తున ప్రవాహాలు ఈనెల 1వ తేదీ నుంచే నమోదవుతున్నాయి. 8వ తేదీ ఉదయం 9 గంటలకు మేడిగడ్డ వద్ద 1,02,300 క్యూసెక్కులు, సమ్మక్క బరాజ్ వద్ద 1,30,000 క్యూసెక్కులు నమోదైంది. అంటే మేడిగడ్డ నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకోవడానికి అనుకూలంగా గోదావరిలో ప్రవాహాలు ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం ఎన్డీఎస్ఏ విధించిన ఆంక్షలను సాకుగా చూపించి ఈ ప్రవాహాలను ఎత్తిపోయలేమని మొండిగా వాదిస్తున్నది. మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో కూడా నీటిని నింపకూడదని ఎన్డీఎస్ఏ ఆంక్షలు పెట్టిన మాట వాస్తవమే. మూడు బరాజ్‌లు ఒకేరకంగా డిజైన్, నిర్మాణ పద్ధతులు అవలంబించినందున మేడిగడ్డలోని కుంగుబాటు అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి. కనుక పరీక్షలు జరిపి, అనుమానం నివృత్తి చేసుకున్న తర్వాత లేదా ఏమైనా లోపాలు ఉన్నాయని పరీక్షల్లో నిర్ధారణ అయితే వాటి మరమ్మతులు పూర్తయ్యాకే నీటిని నిల్వ చేయాలని ఎన్డీఎస్ఏ భావించింది. అంతేకానీ అక్కడ లోపాలు ఉన్నాయని నిర్దిష్టంగా ఏమీ చెప్పలేదు. అయితే అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో మేడిగడ్డలో ఉన్నట్టు కట్టడంలో ఎటువంటి కుంగుబాటుగాని, పగుళ్లుకాని లేవు. వాటిలో ఇంజినీర్లు గమనించింది కేవలం బుంగలు మాత్రమే.
ఆ బుంగలను 2021లోనే కెమికల్ గ్రౌటింగ్ చేసి పూడ్చేశారు. ఆ తర్వాత అక్కడ మళ్లీ బుంగలు ఏర్పడలేదు. స్వచ్ఛమైన నీరు బయటకు రావడం కనిపించింది. మట్టి, ఇసుక లేకుండా కేవలం స్వచ్ఛమైన నీరు బయటకు రావడం మామూలు విషయం. అదేమీ ప్రమాద సంకేతం కాదు. అన్ని మట్టికట్టల నుంచి ఇటువంటి ఊటలు వస్తాయి. వాటిని మట్టికట్ట కింద కట్టిన కాలువల ద్వారా వాగులోకి పంపిస్తారు.
ఆ నీటిలో మట్టి లేకపోతే ఆ ఊటలు రావడంతో మట్టికట్ట సురక్షితంగా ఉన్నదని భావించవచ్చు. అటువంటి ఊటలు రాకపోతేనే మట్టికట్ట కూలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నది. మట్టికట్టలోనే కాదు.. కాంక్రీట్ డ్యామ్‌లలో గోడల నుంచి కూడా నీటిఊటలు వస్తాయి. నాగార్జునసాగర్, శ్రీరామ్‌సాగర్ లాంటి డ్యామ్‌ల్లో నిర్మించిన గ్యాలరీల్లో వాటిని చూడవచ్చు. ప్రతీరోజు వాటిని సంప్‌లోకి పంపి, అక్కడ నుంచి పంప్ చేసి నదిలోకి వదులుతారు. పరిమితి మించని నీటి ఊటల వల్ల మట్టికట్టలు, కాంక్రీట్ డ్యామ్‌లకు ఏ ప్రమాదమూ వాటిల్లదు. అది సహజమైనదే. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో కూడా బుంగలను పూడ్చివేసిన తర్వాత ఇటువంటి స్వచ్ఛమైన నీటి ఊటలే కనిపించాయి. 2023 అక్టోబర్‌లో కుంగుబాటు తర్వాత మూడు బరాజ్‌లను ఫ్రీ ఫ్లో కండిషన్లోనే పెట్టారు. ఆ తర్వాత 2024, 2025 లలో భారీ వరదలు సంభవించినప్పుడు మేడిగడ్డ బరాజ్‌లో అదనపు పగుళ్లు కాని, కుంగుబాటు కాని రాలేదు. బరాజ్‌లో నిర్మాణ లోపాలు, డిజైన్ లోపాలు, నాణ్యతాలోపాలు ఉంటే కుంగుబాటు తర్వాత వచ్చిన భారీ వరదలు మొత్తం బరాజ్‌ను నాశనం చేసి ఉండేవి. కాని అట్లా జరుగలేదు. 2023లో ఏమి జరిగిందో అక్కడే ఆగిపోయింది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు కూడా ఆ వరదలను తట్టుకొని నిలబడ్డాయి. వరదను సురక్షితంగా కిందికి పంపించాయి. గోదావరి నదే మూడు బరాజ్‌లు పటిష్టంగా ఉన్నాయని నిరూపించింది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు సురక్షితంగా ఉన్నాయన్న సంగతి ప్రాజెక్టు ఇంజినీర్లకు తెలుసు. వారే 2025లో మేడిగడ్డతో సంబంధం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 1ని వినియోగంలోకి తీసుకురావడానికి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ ఇన్‌టేక్‌కు వంద మీటర్ల దిగువన 96 మీటర్ల ఎత్తుకు ఒక రబ్బర్ డ్యామ్ నిర్మిస్తే నీటిని పంప్‌హౌస్‌లోకి మళ్లించవచ్చు. అక్కడి నుంచి గ్రావిటీ కాలువ ద్వారా అన్నారంనకు, అక్కడ నుంచి సుందిళ్ల, ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోసుకోవచ్చునని ప్రభుత్వానికి నివేదించారు.
ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్ 1ను ఆపరేషన్‌లో పెట్టే ఉద్దేశం లేదు కనుకనే ఆ నివేదికను తొక్కిపెట్టింది. తమ్మిడిహట్టి నుంచి నీటిని ఎల్లంపల్లికి కాకుండా సుందిళ్లకు తరలించాలని ప్లాన్ సిద్ధం చేస్తున్నది. ఆ బరాజ్‌లు సురక్షితం కాకపోతే సుందిళ్లకు తరలించడం దేనికి? అంటే నీటిని ఎత్తిపోయకపోవడానికి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న కారణాలు సమంజసమైనవి కావని తెలుస్తునే ఉన్నది.
2024, 2025లో భారీ వర్షాలు కురిసినందున శ్రీరామ్‌సాగర్, ఎల్లంపల్లి, కడెం, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, ఇతర జలాశయాల్లో, చెరువుల్లో నిండుగా నీరు లభ్యమైంది. కాబట్టి ప్రభుత్వాన్ని కన్నెపల్లి పంపులను ఆన్‌చేసి నీటిని ఎత్తిపోయాలని ఎవరూ డిమాండ్ చేయలేదు. ఈ ఏడాది సూపర్ ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే 42 శాతం లోటు వర్షపాతం నమోదైంది. భూగర్భజలాలు అడుగంటిపోయాయి. సాగునీటికే కాదు, తాగునీటికి కూడా కొరత ఏర్పడిన పరిస్థితి నెలకొన్నది. ఇంతటి కరువులో కూడా మేడిగడ్డ వద్ద వరద ఉధృతి ఉన్నది. నీటి లభ్యత ఇక్కడ మాత్రమే ఉన్నది. కరువు సృష్టించిన ప్రకృతి, ఈ కరువును ఎదుర్కోవడానికి ప్రాణహిత జలాలను తెలంగాణకు కానుకగా ఇచ్చింది. కాబట్టి కరువు నేపథ్యంలో రాబోయే దుర్భిక్ష పరిస్థితులను అధిగమించేందుకు కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి, ఎగువన జలాశయాల్లో నిల్వ చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఇందుకు మార్గాలను అన్వేషించాలని తెలంగాణ పౌరసమాజం, ఇంజినీర్లు, రైతులు, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బరాజ్‌ల నిర్మాణంలో పాల్గొన్న ఇంజినీర్లు, అనుభవజ్ఞులైన విశ్రాంత ఇంజినీర్లతో సమాలోచన చేస్తే పరిష్కార మార్గాలు లభిస్తాయి. అదే సమయంలో ఎన్డీఎస్ఏకు ఇక్కడి వాస్తవ పరిస్థితులను వివరించి వారి సూచనలను కూడా పొందవచ్చు. ఇప్పుడు కావలసింది రాజకీయ పరిణతి, విజ్ఞత, ప్రజలు, రైతులకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి మాత్రమే. రాజకీయ క్రీడ ఆడటానికి ఇది సమయమూ కాదు, సందర్భమూ కాదు.
మరొక ప్రశ్న కూడా ముందుకు వస్తున్నది. కాళేశ్వరం బరాజ్‌లకు ఉన్న ఆంక్షలు సమ్మక్క బరాజ్‌కు లేవు కదా! అక్కడ ఈ రోజు 1,30,000 క్యూసెక్కుల వరద కిందికి పోతున్నది కదా! ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొని ఉన్నాయి కదా! మరి దేవాదుల పంపులు ఆన్ చేయడానికి ప్రభుత్వం ఎందుకు పూనుకోవడం లేదు? రాజకీయ భేషజాలకు పోకుండా కన్నెపల్లి పంపులను, దేవాదుల పంపులను తక్షణమే ఆన్ చేసి, సాగు, తాగు అవసరాల కోసం నీటిని ఎత్తిపోయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఆ బాధ్యతను నెరవేరుస్తారా? లేదా గోదావరి జలాలను గోదావరి డెల్టా ఆయకట్టు అవసరాలను తీర్చడానికి వదిలేస్తారా? తేల్చుకోవలసింది ప్రభుత్వ పెద్దలే.
(వ్యాసకర్త: విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజినీర్, సాగునీటి శాఖ)
– శ్రీధర్‌రావు దేశ్‌పాండే