హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ఉర్దూ అకాడమీ భూములను లీజ్‌కు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి బ్రేక్ పడింది. కొన్నిరోజులుగా వేలంపై దోబూచులాడిన ప్రభుత్వం చివరకు వెనక్కి తగ్గింది. లీజ్‌కు ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ సర్కార్ తాజాగా జీవో-23 జారీ చేసింది. అయితే ‘లీజు ముసుగు-100 కోట్లకు ఎసరు’ పేరిట ‘నమస్తే తెలంగాణ’లో సంచలన కథనం ప్రచురితం కావడం, మైనారిటీ సంఘాల నేతల ఒత్తిడి నేపథ్యంలో ప్రభుత్వం వేలం నిర్ణయాన్ని రద్దుచేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం దర్గా హుస్సేన్ షావలీ గ్రామంలోని సర్వే నంబర్ 29లోని 1.04 ఎకరాల భూమిని చెన్నైకి చెందిన ఎన్ఎన్ఇన్ఫ్రా కంపెనీకి 30 ఏండ్ల లీజు పేరిట కట్టబెట్టాలని సర్కార్ నిర్ణయించింది.
జూలై 16న రహస్యంగా జీవో-20 జారీ చేసింది. ఈ వ్యవహారాన్ని ‘నమస్తే తెలంగాణ’ బహిర్గతం చేసింది. మైనారిటీ సంఘాల నేతలు సైతం తీవ్రంగా వ్యతిరేకించారు. లీజు నిర్ణయాన్ని వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం మెత్తబడింది. లీజు నిర్ణయాన్ని తాత్కాలికంగా పెండింగ్‌లో పెడుతూ జీవో-22 జారీ చేసింది. దీంతో సంతృప్తి చెందని మైనారిటీ నాయకులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎస్‌తోపాటు మైనారిటీ సంక్షేమ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో ప్రభుత్వం శాశ్వతంగా లీజు నిర్ణయాన్ని రద్దుచేస్తూ, జీవో-23 జారీ చేసింది.
భూముల జోలికెళ్లొద్దు: యాకూబ్‌పాషా
ప్రభుత్వం ఆదాయం కోసం మసీదులు, వక్ఫ్, ఉర్దూ అకాడమీ, మౌలానా అబూల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలోని భూములను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టాలని చూడటం బాధాకరమని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకూబ్‌పాషా పేర్కొన్నారు. ఉర్దూ అకాడమీ భూములను వేలంవేయొద్దంటూ బీఆర్ఎస్, ముస్లిం నేతలు సాగించిన పోరాటంతోనే ప్రభుత్వం దిగొచ్చిందని రాష్ట్ర వక్ఫ్ బోర్డు మాజీ సభ్యుడు వహీద్ అహ్మద్ పేర్కొన్నారు.