ముంబై, సెప్టెంబర్ 17: మరో ఐదేండ్లు ఎన్ చంద్రశేఖరన్‌కే టాటా సన్స్ లిమిటెడ్ పగ్గాలు చిక్కాయి. ఈ మేరకు గురువారం ఇక్కడ జరిగిన కంపెనీ వాడివేడి బోర్డు సమావేశంలో మెజారిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 20తో టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా చంద్రశేఖరన్ ప్రస్తుత పదవీకాలం ముగియనున్నది. ఈ క్రమంలో ఆయన్నే మరో ఐదేండ్లు కొనసాగించాలని టాటా సన్స్ బోర్డు తాజా మీటింగ్‌లో నిర్ణయించింది. నిజానికి మరోసారి తాను ఈ పదవిలో కొనసాగదల్చుకోవడం లేదని 63 ఏండ్ల చంద్రశేఖరన్ గత నెలలో సంస్థ డైరెక్టర్లకు స్పష్టం చేశారు.
అయితే బోర్డు విజ్ఞప్తి మేరకు తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకొనేందుకు చంద్రశేఖరన్ అంగీకరించారు. దీంతో మరో ఐదేండ్లు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ బోర్డు తీర్మానం చేసింది. కాగా, ఉప్పు దగ్గర్నుంచి ఉక్కు వరకు, సాఫ్ట్వేర్ దగ్గర్నుంచి కార్ల తయారీదాకా వివిధ వ్యాపార కంపెనీలున్న టాటా గ్రూప్‌నకు హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ అన్న విషయం తెలిసిందే.
టాటా సన్స్‌ను దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదు చేసే దిశగా కూడా ఈసారి బోర్డు సమావేశంలో అడుగులుపడ్డాయి. దేశంలోని ప్రధాన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల్లో ఒకటిగా ఉన్న టాటా సన్స్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే లిస్టింగ్ కావాల్సి ఉన్నది. అయితే ఇందుకు విముఖత చూపుతున్న సంస్థ తమ లైసెన్స్‌నూ వదులుకొనేందుకు సిద్ధమైంది.
కానీ అందుకు ఆర్బీఐ అంగీకరించకపోవడంతో కంపెనీ పబ్లిక్ ఇష్యూ తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో టాటా సన్స్ ఐపీవోకూ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే అటు చంద్రశేఖరన్ పునర్నియామకం కావచ్చు.. ఇటు టాటా సన్స్ ఐపీవో కావచ్చు.. రెండూ కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆమోదం పొందాల్సి ఉన్నది.
చంద్రశేఖరన్‌కే మరోసారి టాటా సన్స్ పగ్గాలు అప్పగించడాన్ని టాటా ట్రస్ట్స్ చైర్మన్ నియోల్ ఎన్ టాటా వ్యతిరేకించారు. ఈ మేరకు జరిగిన బోర్డు సమావేశంలో ఆయన వ్యతిరేకంగా ఓటేశారు. టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కు 66 శాతం వాటా ఉన్నది తెలిసిందే. ఇక మెజారిటీ సభ్యులు (నలుగురు) చంద్రశేఖరన్‌కే జై కొట్టడంతో ఆయన పదవీకాలం పొడిగింపునకు లైన్‌క్లియరైంది. టాటా సన్స్ ఐపీవో దృష్ట్యా చంద్రశేఖరన్ మార్పు లాభదాయకం కాదని వారు అంటున్నారు. అయితే చంద్రశేఖరన్ పునర్నియామకం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ టాటా సన్స్ కింద చట్ట విరుద్ధమని నియోల్ టాటా అన్నారు.
చైర్మన్ నియామకం, పునర్నియామకాలకు మెజారిటీ ట్రస్ట్స్ల నామినీ డైరెక్టర్ల ఆమోదం ఉండాలని గుర్తుచేశారు. దీంతో బోర్డు రూమ్ వార్ గట్టిగానే జరుగగా.. టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ పాలక సభ్యుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నైట్టెంది. ఈ నిర్ణయాన్ని ట్రస్టీలు సవాల్ చేసే వీలుండగా.. దీనిపై న్యాయ సలహాలు తీసుకునేదాకా వ్యవహారం వెళ్తున్నది. 1987లో టీసీఎస్‌లో చేరిన చంద్రశేఖరన్.. 2009లో సీఈవోగా నియమితులయ్యారు. అంతకుముందు సీవోవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గానూ పనిచేశారు. ఇక 2017లో రతన్ టాటా నుంచి చంద్రశేఖరన్ సారథ్య బాధ్యతలు అందుకున్న సంగతి విదితమే. ప్రస్తుతం రెండో టర్మ్ నడుస్తుండగా.. మూడో టర్మ్‌కూ కంపెనీ ఊ కొట్టింది.
షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ టాటా సన్స్‌లో తమకున్న వాటాలో రూ.25,000 కోట్లను ఉపసంహరించుకోవాలని చూస్తున్నది. ఈ మేరకు టాటా సన్స్ బోర్డు ఎదుట ఓ ప్రతిపాదనను నియోల్ టాటా పెట్టారు. టాటా సన్స్ షేర్లలో ఎస్పీ గ్రూప్‌నకు చెందిన స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్లకూ వాటాలున్నాయి. ఇవే ఆ వాటాలను నగదీకరించే ప్లాన్ వేస్తున్నట్టు ఓ ప్రకటనలో టాటా ట్రస్ట్స్ తెలిపింది.
చంద్రశేఖరన్ పునర్నియామకం, టాటా సన్స్ ఐపీవో నేపథ్యంలో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌లో టాటా గ్రూప్ షేర్లు లాభాల్లో పరుగులు పెట్టాయి. మదుపర్ల ఉత్సాహంతో బీఎస్ఈలో టాటా కెమికల్స్ షేర్ విలువ అత్యధికంగా 6.60 శాతం పుంజుకున్నది. అలాగే టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ (5.47 శాతం), టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికిల్స్ (4.52 శాతం), టాటా స్టీల్ (2.82 శాతం), టాటా పవర్ (2.02 శాతం), టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ (1.17 శాతం), రల్లీస్ ఇండియా (0.89 శాతం), ట్రెంట్ (0.86 శాతం), టాటా ఎగ్జీ (0.49 శాతం), వోల్టాస్ (0.42 శాతం), టీసీఎస్ (0.21 శాతం) షేర్లూ లాభపడ్డాయి.