హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ)/రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ వేదికగా నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు తరఫు న్యాయవాదులు గురువారం లీగల్ నోటీసులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో సిరిసిల్లలో భారీగా భూములను రవీందర్రావు కైవసం చేసుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో పేర్కొన్న నేపథ్యంలో ఈ నోటీసులు పంపారు.
తనపై చేసిన అసత్య ప్రచారానికి 7 రోజుల్లోగా సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు చేపడుతామని కొండూరు రవీందర్రావు హెచ్చరించారు. అంతకుముందు రవీందర్రావు సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చినంక, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి వరకు తన పాస్‌బుక్‌లో ఒక గుంట ఎక్కువ ఎక్కినట్టు తేలితే దేనికంటే దానికి రెడీ అని సవాల్ విసిరారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ.. సిరిసిల్లలో 8 వేల ఎకరాలు కబ్జాకు గురైందని, బీఆర్ఎస్ నేతలకు ధారాదత్తం చేశారనడంలో వాస్తవం లేదని అన్నారు. బీఆర్ఎస్ నేతలు 8 వేల ఎకరాలు కబ్జా చేశారని నిరూపిస్తే అంబేద్కర్ విగ్రహం ఎదుట ముక్కు నేలకు రాస్తానని, నిరూపించకపోతే రేవంత్‌రెడ్డి ఇక్కడికి వచ్చి ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు.