గురుకులాలు పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలకు విద్యావకాశాలు కల్పించాల్సిన సంస్థలు. కానీ, మన రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యావకాశాలేమో గానీ, రోజురోజుకు విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 100 మందికి పైగా విద్యార్థుల మరణాలు నమోదయ్యాయి. ఈ ఆత్మహత్యలకు వ్యక్తిగత సమస్యలనే కాదు, అవినీతి, వేధింపులు, మౌలిక సదుపాయాల లోపం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు కూడా కారణమయ్యాయి.
కొందరు సిబ్బంది నుంచి గురుకులాల విద్యార్థులు అవమానాలు ఎదుర్కొంటున్నారు. శారీరక, మానసిక హింసకు గురవుతున్నారు. విద్యార్థులు, వసతిగృహాల వాతావరణం పట్ల అవగాహన లేని తల్లిదండ్రులు బలవంతంగా విద్యార్థులను గురుకులాల్లో చేర్పించడంతో ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ఉదాహరణకు, గత అక్టోబర్లో వంగర గురుకులంలో 10వ తరగతి విద్యార్థిని వర్షిత ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె స్కూల్ టాపర్, కెప్టెన్గా గుర్తింపు పొందినప్పటికీ ప్రిన్సిపల్, వైస్-ప్రిన్సిపల్ చేత వేధింపులకు గురైంది. తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడిన గంట తర్వాతే వర్షిత ఆత్మహత్య చేసుకున్నది.
గురుకులాల్లో అకడమిక్ ప్రెజర్ కూడా ఆత్మహత్యలకు మరో ముఖ్య కారణం. 2025, ఏప్రిల్లో ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చిన తర్వాత హైదరాబాద్లోని నారాయణ కాలేజీ విద్యార్థిని అరుంధతి ఆత్మహత్య చేసుకున్నది. ఆమె బైపీసీలో ఫెయిలైనందుకు, భయంతో ఆత్మహత్య చేసుకున్నదని పోలీసులు తెలిపారు. 2025, మే నెలలో 48 గంటల్లోనే ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గురుకులాల్లో పోటీ, ఆశ విద్యార్థులపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ ఒత్తిడికి సరైన మెంటార్తో కౌన్సెలింగ్ ఇప్పించకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రతరం అవుతున్నది.
గురుకులాల్లో విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కలుషిత ఆహారం ప్రభావితం చేస్తుంది. 2025 ప్రారంభంలో 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు ఫుడ్ పాయిజనింగ్ కేసులు పెరిగాయి. జూలై 2025లో పార్కల్ గురుకులంలో 15 ఏండ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఉపాధ్యాయుల వేధింపులు, కలుషిత ఆహారం కారణంగా తమ బిడ్డ ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు చెప్పారు. పోలీసులు బీఎన్ఎస్ 107 కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వం హాస్టళ్లను బాగు చేస్తున్నట్టు బయటకు చెప్తున్నా, అది ఆచరణలో అమలు కావడం లేదు. ఆ పేరుతో లక్షల రూపాయల అవినీతి జరుగుతున్నది. ప్రభుత్వం గురుకులాలలో ఆత్మహత్యలకు గల కారణాలను విశ్లేషించడంలో విఫలమవుతున్నది. 2025 జూలైలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణిని ‘ఆత్మహత్యలపై ఏం చేస్తున్నారు?’ అని నిలదీసింది. అయినా ఫలితం శూన్యం.
అంటే, గురుకులాల్లో జరుగుతున్న ఆత్మహత్యలకు వేధింపులు (40 శాతం కేసులు) ఒక కారణం అయితే, అకడమిక్ ఒత్తిడి, మౌలిక సదుపాయాల లోపం ఇంకో కారణం. కాబట్టి, ప్రభుత్వం వెంటనే కమిటీలు ఏర్పాటుచేసి కౌన్సెలింగ్, మెడికల్ సౌకర్యాలు మెరుగుపరచాలి. గురుకులాల్లో చదివే మెజారిటీ విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలే అన్న విషయం మరిచిపోకూడదు. ఈ కారణాలను విశ్లేషించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే రాష్ట్రంలో మరిన్ని దుర్ఘటనలు జరిగే ప్రమాదం పొంచి ఉన్నది.