భారతదేశానికి అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని పేరుంది. అధిక జనాభా కలిగి ఉండటం, స్వాతంత్య్ర సిద్ధించిన నాటి నుంచీ ప్రజల ఓట్ల ద్వారానే ప్రభుత్వాలు ఏర్పడుతుండటమే ఇందుకు కారణం. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి విపక్ష నేతలను జైల్లో పెట్టినప్పుడు ప్రపంచంలో భారతదేశం పరువుప్రతిష్ఠలు మసకబారాయి. తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆమెను చిత్తుచిత్తుగా ఓడించి బుద్ధిచెప్పడం తెలిసిందే. జనతా పార్టీ పేరిట ప్రతిపక్షాలు చేసిన ప్రయోగం వికటించడంతో ఆమె మళ్లీ అధికారంలోకి రావడమనేది వేరే విషయం. ప్రస్తుతం మన దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతున్నదనే విమర్శలు అంతకంతకూ ఎక్కువగా వినవస్తున్నాయి. విపక్షాలను నయానా భయానా లొంగదీసుకునేందుకు కేంద్రంలోని బీజేపీ బాహాటంగానే ప్రయత్నిస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల వేళ పలువురు విపక్ష నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయడం ఈ సందర్భంగా గమనార్హం. తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవితను అరెస్టు చేయడం, ముందుగా ఢిల్లీలో, ఆ తర్వాత పంజాబ్‌లో అధికారం చేపట్టి, ఇతర రాష్ర్టాలకూ విస్తరిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలను నిర్బంధించడంపై దేశంలో చాలామందికి అనుమానాలున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను లిక్కర్ స్కాంలో అరెస్టు చేయడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేసేందుకే ఆయనను జైల్లో పెట్టారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై, పధాని నరేంద్ర మోదీపై ఘాటైన విమర్శలు చేసే నేతగా ఆయనకు పేరుంది. కేజ్రీవాల్ అరెస్టుపై అంతర్జాతీయంగా అభ్యంతరాలు వ్యక్తం కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
జర్మనీ, అమెరికా దేశాలు భారత్‌లో జరుగుతున్న పరిణామాలపై విమర్శలు చేశాయి. చట్టబద్ధ పాలన ప్రాముఖ్యాన్ని, ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించాల్సిన అవసరాన్ని అవి మన దేశానికి నొక్కిచెప్పాయి. దౌత్య పరిభాషలో అవి ఉపయోగించిన పదాలు ఏవైనప్పటికీ మొత్తం మీద భారత్‌లో ఎన్నికలు సక్రమంగా జరగడం లేదనే అభిప్రాయాన్ని ఆ దేశాలు వ్యక్తం చేశాయి. దీనిపై మోదీ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ఢిల్లీలోని జర్మనీ, అమెరికా దౌత్యవేత్తలను విదేశాంగ శాఖకు పిలిపించి మందలించింది. భారత్ అభ్యంతరాల తర్వాత జర్మనీ కొద్దిగా స్వరం తగ్గించినప్పటికీ అమెరికా మాత్రం విమర్శలను రెట్టించింది. తాజాగా ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ప్రతినిధి కూడా విమర్శలు చేయడం గమనార్హం. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు సాధారణంగా ప్రభుత్వాలు చూసీచూడనట్టు వదిలేయవు. తమ ‘అంతర్గత వ్యవహారాల’పై మాట్లాడే హక్కు వేరే దేశాలకు లేదని ఖండించడం సహజాతి సహజం. అయితే అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్న విమర్శలు సబబు అన్న రీతిలో దేశ జనాభిప్రాయం కూడా ఉండటం ఆలోచించదగిన అంశం.
పశ్చిమ దేశాలు చేసే ఇలాంటి విమర్శలను ముఖవిలువతో తీసుకోలేము. అనేక విషయాల్లో అవి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుంటాయి. ప్రజాస్వామ్య పరిరక్షకులం అంటూనే సైనిక నియంతలతో అంటకాగిన చరిత్ర వాటికుంది. బయటివారు చేసే విమర్శలను భారత్ దౌత్యపరంగా తిప్పికొట్టడం వరకు సబబే. కానీ స్వదేశీయులు చేసే విమర్శల మాటేమిటి? కేంద్ర ప్రభుత్వ సంస్థలు జరుపుతున్న దాడులు, అరెస్టులు, పెడుతున్న కేసుల విషయంలో, రాజ్యాంగ వ్యవస్థలపై సామాన్యులకు అనేక సందేహాలు కలుగుతున్నాయి. ప్రజాస్వామ్య ఉత్సవమైన ఎన్నికల వేళ విపక్ష నాయకులను, వారి పిల్లలను అరెస్టు చేయడమే ధ్యేయంగా, ప్రతిపక్షాలను బలహీనపరచడమే లక్ష్యంగా కదులుతుండటంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాల్సి ఉంది.