కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా బయపెట్టింది. తొలిరోజు ‘75 ఏండ్ల భారత ప్రస్థానం’పై చర్చ జరుగుతుందట. రాజ్యాంగసభ కాలం నుంచి నేటివరకు జరిగిన పరిణామాలన్నింటిపై చర్చిస్తారట. ఈ విషయాలన్నీ చర్చించుకోవాల్సిందే. సమీక్షించుకోవాల్సిందే. ఎవరూ కాదనరు. ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాలకు ముప్పు ఏర్పడుతున్న ప్రస్తుత తరుణంలో ఇది అత్యావశ్యకం. అయితే అంతకన్నా ముందు గత పదేండ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు పరిపాలన తీరుతెన్నులపై చర్చ జరిగితే బాగుంటుంది. ‘అచ్ఛే దిన్’ అంటూ, ‘గుజరాత్ మాడల్’ అంటూ మాయ మాటలు చెప్పి దేశాన్ని బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ గతం, వర్తమానం, భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న వైనం గురించి ఒకసారి వెనుదిరిగి చూసుకోవాల్సిన ఘడియ వచ్చింది. విశ్వగురువునని చెప్పుకొనే పాలకులు దేశ సమస్యలు ఏ మేరకు పరిష్కరించగలిగారు? అనే ప్రశ్నకు సమాధానం రాబట్టాల్సి ఉంది. నిద్రాణమైపోయిన పంజాబ్, కశ్మీర్ వంటి నిన్నటి సమస్యలు మళ్లీ ఆవులిస్తున్నాయి. కొత్తగా మణిపూర్, హర్యానా, ఉత్తరాఖండ్, యూపీ లాంటి సమస్యలు పుట్టుకు వస్తున్నాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టి, విభజించి పాలించు అనే బ్రిటిష్ వలసపాలకుల విధానాన్ని తుచ తప్పకుండా అనుసరిస్తున్నారు. మైనారిటీలు బితుకుబితుకుమంటూ గడిపే రోజులు వచ్చాయి. ఇది దేశానికి ప్రమాదకరమని చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. డబుల్ ఇంజిన్ అంటూ డబ్బా కొట్టుకుంటూ పేదల ఇండ్ల మీదకు బుల్డోజర్లు పంపిస్తున్నారు. నేరస్థులను శిక్షిస్తున్నామంటూ చట్టాన్ని బీజేపీ పాలకులు చేతుల్లోకి తీసుకుంటున్నారు. న్యాయస్థానాలు వేసే అక్షింతలు దున్నపోతు మీద వానే అవుతున్నాయి.
విపక్ష రాష్ర్టాలను గవర్నర్ గిరీతో సతాయించడం పరిపాటి అయ్యింది. గవర్నర్లు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను అనవసరమైన కొర్రీలతో అడ్డుకుంటున్నారు. తమకు లేని అధికారాలను ఆపాదించుకొని రాజ్యాంగపరమైన సమస్యలను సృష్టిస్తున్నారు. ఫైళ్లు తొక్కిపెట్టడం దగ్గరి నుంచి మంత్రుల బర్తరఫ్ దాకా కానిపనులు అనేకం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపునకు రాజ్భవన్లు వేదికవుతున్నాయి. ఈ తరహా అప్రజాస్వామిక కృత్యాలతో సమాఖ్య స్ఫూర్తికి మోదీ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది. గిట్టనివారిపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి వేధిస్తున్నది. ఇదేదో అరుదుగా అన్నట్టుగా కాకుండా నిత్యకృత్యంలా మారిపోయింది. మా దారికి వస్తావా, జైలుకు పోతావా అని బీజేపీ నేతలు బహిరంగంగానే బెదిరిస్తున్నారు. ‘తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు’ అన్నట్టు విపరీత ధోరణిలో పోతున్నది. ఎవరైనా తప్పులెత్తి చూపితే సహించడం లేదు. వెంటాడి వేధిస్తున్నది. అది రఘురామ్‌రాజన్ కావచ్చు.. విరళ్ ఆచార్య కావచ్చు. విమర్శించిన వారిని విడిచిపెట్టకుండా వేధిస్తున్నది. ఇక మణిపూర్ పాపాలను ఎత్తిచూపిన ఎడిటర్స్ గిల్డ్‌పై కేసు పెట్టడం ఈ ధోరణికి పరాకాష్ఠ. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యమని గౌరవాదరాలు పొందిన భారత్‌కు ఇది ఏ మాత్రం శోభించదు. అదే సమయంలో మోదీ సర్కారు తమ వారి తప్పులను చూసేందుకే నిరాకరిస్తున్నది. అదానీ ఆర్థిక అవకతవకలు, సొంత ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలపై కేంద్రానిది బెల్లంకొట్టిన రాయి చందమే.
సామరస్యం, సౌమనస్యం అనే మాటే లేదు. అంతా వైమనస్య పరిపాలనే. ప్రజాస్వామ్య విధానంలో ప్రధాన భాగమైన సౌహార్ద సంప్రదింపులన్నవి టార్చిలైటు వేసినా కనిపించడం లేదు. పారదర్శకత కొండెక్కింది. ప్రభుత్వం ఏమనుకుంటున్నదో తెలుసుకోవాలంటే ప్రభువులవారి ఫర్మానా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూడాలి. మొదటినుంచీ ‘తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి’ అన్న ధోరణే. నోట్ల రద్దు అయినా, కరోనా లాక్డౌన్ అయినా అంతే. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల విషయంలో ఇది మరింత స్పష్టంగా వ్యక్తమైంది. ఎజెండా ఏమిటో చెప్పకుండా, చర్చాంశాలు ఖరారు చేయకుండా సమావేశాలకు పిలిస్తే విపక్షాలు ఏ తరహా సంసిద్ధతతో వెళ్లాలి? ఏలిన వారు చెప్పినదానికి తలూపడమే అయితే పార్లమెంటరీ చర్చ అనే ముసుగు ఎందుకు? ప్రజాస్వామ్యం అనేది అన్నిపక్షాలూ కొన్ని నిబంధనలకు కట్టుబడితేనే ముందుకుసాగుతుంది. సాధారణంగా సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన ఎజెండా దీనికి గీటురాయిగా ఉంటుంది. కానీ కేంద్రంలో ప్రస్తుతం సర్కారు చెలాయిస్తున్న బీజేపీకి ఈ దేశం పేరు, రాజ్యాంగం, లౌకిక విధానం, జాతీయచిహ్నాల దగ్గరి నుంచి అన్నింటిపై రహస్య ఎజెండా ఉంది. అదే సమస్య. అదే ప్రజాస్వామ్యంలో తొండాట అవుతున్నది. 75 ఏండ్ల ప్రస్థానం సంగతి మాటేమోగానీ.. ముందుగా బీజేపీ ప్రభుత్వ పదేండ్ల ప్రస్థానం వల్ల దేశానికి జరిగిన మంచి ఏమిటని నిలదీయాల్సిన రోజు వచ్చింది.