కొందరు మాటిస్తారు కాని పాటించరు. ఇంకొందరు మాటిస్తారు కాని దాటేస్తారు. మరికొందరు మాటిస్తారు కానీ అరుదుగా పాటిస్తారు. కొందరే మాటిస్తే పాటిస్తారు, పాటిస్తేనే మాటిస్తారు. ఒక మండేలా, ఒక చెగువేరా, ఒక పూలే, ఒక అంబేద్కర్ జాతి జనుల కోసం మాటిచ్చి జీవితాలను అంకితం చేశారు. అదే బాటలో అటూ ఇటుగా 20 ఏండ్ల కిందట తెలంగాణ తెస్తానని జాతిజనులకు మాటిచ్చిన యోధుడు కేసీఆర్ పుష్కరకాలంలో ఆ మాటను నిలబెట్టుకున్నారు.
కేసీఆర్ మాటే ఒక మం త్రం. ఇప్పుడైనా, అప్పుడైనా, ఎప్పుడైనా పదునెక్కిన బాణానికి పర్యాయపదమే కేసీఆర్. అలుపెరుగని పోరు చేసి విజయాన్ని ముద్దాడి జాతిజనులకు విముక్తి కలిగించి ఆత్మగౌరవ కలలు సాకారం చేశారు. టీఆర్ఎస్తో ఇంట గెలిచి బీఆర్ఎస్తో రచ్చ గెలువడానికి దేశాన్ని రుణ విముక్త భారత్‌గా, రైతు రాజ్యంగా మార్చడానికి భారత రాజకీయ యవనిక మీద అడుగు పెట్టి, శత్రువుల గుండెల్లో ఫిరంగులు మోగిస్తున్న కేసీఆర్ వంద పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటుంది యావత్ భారతావని.
ఒక్కసారి గతాన్ని తవ్వుకుంటే అతడు రెండు దశాబ్దాల కింద ఇచ్చిన వాగ్దానం చిన్నదేం కాదు. అతిరథ మహారథులే పోరాడి పోరాడి ఓడిపోయి అలిసి ఇక తమతో కాదని చేతులెత్తేసిన సమ స్య. అలాంటి సమస్యను ముందేసుకున్నాడు కేసీఆర్. ఆ సాధనలో అతడు నడిచిన దారి పూలదారేం కాదు. అప్పటికాలం కూడా అనుకూలమైనది కాదు. ఆక్రోశం, ఆవేదనలను ఇనుప బూట్లతో తొక్కిపెడుతూ తెలంగాణ పేరెత్తితేనే కేసులు పెట్టే కాలం. నిషేధపు నీడలో ఖాకీల కాపలాలో కత్తుల వంతెన మీద నెత్తురు రోడ్డుతో గుడ్డుకు కుంచెడు దుఃఖంతో ఎవరు వస్తారా అని ఎదురుచూస్తూ తెలంగాణ జాతి కడుపు మంటతో రగులుతున్న కాలం
అగో అప్పుడే జాతికి వేగుచుక్కలా వచ్చాడు కేసీఆర్. చరిత్రను తిరగరాసి ఒక్కడే పిడికెడు మందిని జత కట్టుకొని జాతి జనుల చిరకాల వాంఛను లక్ష్యంగా పెట్టుకొని బయల్దేరాడు. కొందరు నవ్వారు. కొందరు వెక్కిరించారు. కొందరు కాదన్నారు. కొందరే వెంట ఉన్నారు. కొందరు వెన్నుపోటు పొడిచారు. ఎవరు ఏమన్నా అతని ప్రయాణం ఆగలేదు. కలిసివస్తే గొంగళి పురుగును కూడా కౌగిలించుకున్నాడు. కాలడ్డం పెడితే ప్రాణ మిత్రుడినైనా దూరం పెట్టాడు. ఎత్తిన పిడికిలినే జెండాగా చేశాడు. జాతి ప్రజల గొంతును ఒక్కటి చేసి ఏకే కదా అనుకున్న వాళ్లకు మేకులా మారాడు. అగ్గి రాజేశాడు. మాటలను తూటాలుగా చేసి ఆశయంతో ఆకాంక్షను రగిలించిన కేసీఆర్ కొండంత ధైర్యంతో ముందు నడిచాడు. మట్టుబెట్టాలనుకున్న ప్రతిసారి గట్టి పోటీ ఇచ్చి శత్రువునే మట్టి కరిపించాడు.
అప్పటికప్పుడు గెలిచినట్టు కనిపించినా అబద్ధం ఎప్పుడూ గెలవదు. ఆర్భాటంగా కనిపించినా అధర్మం ఎప్పుడూ ముందుకుసాగదు. ఎంత బలహీనుడైనా అన్యాయానికి గురవుతున్నవాడి గొంతు ఒక సైరన్ మోతనే. ఎంత కప్పిపెట్టినా ఆక్రోశిస్తున్న వాడి హృదయం ఒక మండుతున్న అగ్నిగుండమే. ఇప్పుడు కేసీఆర్ మండుతున్న ఒక అగ్నిగోళం. 140 కోట్ల భారతీయుల తరపున ప్రశ్నిస్తున్న ఒక నిరసన గొంతు. తెలంగాణ సాధన తర్వాత సాధించుకున్న తెలంగాణను పాడి పంటలతో సస్యశ్యామలం చేశాడు. వృథాగా పోతున్న నదుల నీళ్లను పొలాలకు మలిపాడు. రైతుల పాలిట వరమిచ్చే దేవుడిలా వృద్ధుల పాలిట ఆసరాగా నిలిచే పెద్ద కొడుకులా మహిళల పాలిట నీడలా ఉండే పెద్దన్నలా మొత్తమ్మీద తెలంగాణకు తల్లికోడిలా సబ్బండవర్గాలను కంటికి రెప్పయి కాపాడుకున్నాడు. ఇప్పుడు దేశానికి ఇలాంటి నాయకుడు ఎంతో అవసరం. కుంభకోణాలతో కూరుకుపోయిన కాంగ్రెస్, మతం మత్తులో జనాన్ని ముంచి అనుయాయులకు అందినంతా దోచిపెడుతున్న బీజేపీల నుంచి దేశాన్ని రక్షించాలంటే కేసీఆర్ లాంటి యోధుడు కావాలి. ఆయన దేశం కోసం ఒక్క అడుగు ముందు కువేస్తే ఆయన వెంట కోట్ల అడుగులు పడుతాయి. ఆయన ‘జై భారత్’ అని ఒక్క నినాదమిస్తే వంద కోట్ల గొంతులు శృతి కలుపుతాయి.
పెద్దింటి అశోక్‌కుమార్: 94416 72428