వివక్షకు గురైన సమూహంలోనే వివక్షకు గురికావడమనేది వేరే దేశాల్లో అయితే చాలా అరుదు. కానీ, మన దేశంలో సహజాతి సహజం. ఈ దేశంలోని హిందూ వర్ణవ్యవస్థ, దాని ప్రధాన భాగమైన నిచ్చెన మెట్ల కులవ్యవస్థలే దానికి కారణం. ఈ నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో కిందకి పోతున్నకొద్దీ వివక్షకు గురవుతున్న సమూహంలోని సభ్యుల మధ్య అసమానత్వం ఇంకా స్పష్టంగా కనబడుతూనే ఉంటుంది.
Reservations | వెనుకబడిన వర్గాల్లో కంటే దళిత కులాల్లో అసమానత్వం స్పష్టంగా కనపడుతుంది. అందుకే ఎస్సీ వర్గీకరణను ఉద్దేశించి బాలగోపాల్ ‘ఇది దోపిడీ, అణచివేతలకు సంబంధించిన అంశం కాదు. ఇది అణచివేతకు గురైన సమూహంలోనే అసమానతలకు సంబంధించిన అంశం. దీని మూలాలు హిందూ వర్ణ వ్యవస్థలో, దాని ప్రధాన భాగమైన నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో ఉన్నాయ’ని అన్నారు. అణచివేతకు గురైన సమూహంలోని అసమానతకు గురయ్యే వర్గం.. ఆ అసమానతలకు వ్యతిరేకంగా సామాజిక సమానత్వం కోసం పోరాడటమనేది ఒక చైతన్యవంతమైన చర్యగా చూడాలి. సామాజిక న్యాయసాధన దిశగా జరిగే పోరాటంగా చూడాలి. అట్లా చూసినప్పుడే ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేయవచ్చని ఇచ్చిన తీర్పుని అర్థం చేసుకుంటారు, స్వాగతిస్తారు.
ఈ దేశంలో వివక్షకు గురైన ఎస్సీ కులాల్లోనే ఎంతటి వివక్షను పాటిస్తారనేది దళిత వాడలను ఎరిగిన ఎవరికైనా సులభంగా అర్థమైతది. ఈ వాస్తవాన్ని మరుగునపెట్టి ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ తీర్పు అన్యాయం, దీని వల్ల దళితుల ఐక్యత దెబ్బతింటుందని కొందరు గగ్గోలు పెడుతు న్నారు. నిన్నటివరకు సామాజిక చింతనాపరులుగా ఉన్నవాళ్లు, సామాజిక న్యాయాన్ని కోరుకుంటున్నామనే వాళ్లు ఆ తీర్పు రాగానే వాళ్లలో ఉన్న సంకుచిత తత్వాన్ని బయటపెట్టుకుంటున్నారు. చట్టసభల్లో మాలలకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతున్నారు. అలాంటి వాళ్లందరికీ ఒక ప్రశ్న. వర్గీకరణ అంశం ముందుకు వచ్చినపుడే ఒక వర్గానికి అన్యాయం జరుగుతుందని గుండెలు బాదుకోవడం ఎందుకు? ఏ సమాజంలోనైనా ఎక్కువగా ఫలాలు అనుభవించిన సమూహం వాటిని వదులుకోవడానికి అంత సులభంగా ఒప్పుకోదు. జనా భా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలన్నపు డు వ్యతిరేకించిన అగ్రవర్ణ వ్యవస్థలన్నీ.. మండల్ కమిషన్‌ను వ్యతిరేకించిన అన్ని సందర్భాల్లో ఇదే నిజమైంది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించే సందర్భంలో కొందరు అట్లానే మాట్లాడుతున్నారు.
‘వర్గీకరణ వల్ల దళిత సమాజం చీలిపోతుంది. ఇది పాలకవర్గాల కుట్ర’ అని మాట్లాడుతూ చాలామంది భయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు, మొత్తం దళిత సమాజంపై ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. వర్గీకరణ పాలక వర్గాల కుట్ర కావచ్చు. కానీ, దానివల్ల సామాజిక న్యాయం దక్కాల్సిన సమూహాలకు దక్కుతుందా లేదా? అనేది చూడాలి. దళితులను వర్గీకరణతో విభజించి, అనైక్య పరుస్తారని భయమెవరికన్న ఉంటే అది అపోహ మాత్రమే.
రాజకీయ రంగాల్లో రాజ్యాంగంలో విధించిన పరిమితి మేరకు మాత్రమే సీట్లిచ్చి అన్ని పాలకవర్గాలు చేతులు దులుపుకొంటున్నాయి. వారి వారి రిజర్వేషన్ల వరకే వారిని పరిమితం చేస్తున్నారు. నిజానికి వర్గీకరణ వల్ల మాలమాదిగల ఐక్యత పోతుందనుకునే నాయకులు దళితవర్గాల ఐక్యత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో క్యాబినెట్ మంత్రిత్వ శాఖల్లో కూడా ‘మా వాటా ప్రకారం మాకు మంత్రిత్వ శాఖలు ఇవ్వాల’ని ఒక ఉమ్మడి ఉద్యమం తీసుకురండి. రాష్ర్టాలకు ముఖ్యమంత్రులను, దేశ ప్రధానిగా వ్యక్తులను ఎన్నుకునేటప్పుడు రొటేషన్ పద్ధతిలో దళితులకు కూడా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయండి. దీనిద్వారా దళిత జాతి మొత్తాన్ని రాజ్యాధికారం దిశగా నడిపించవచ్చు. దళితజాతి ఐక్యతను చాటవచ్చు.
ఈ దేశంలో ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసమని కేటాయిస్తున్న అరకొర నిధులను కూడా ప్రభుత్వాలు పక్కదారి పట్టిస్తున్నాయి. అంతేకాకుండా సంక్షేమ పథకాలు, ఇతరత్రా అభివృద్ధి పనులకు కూడా సబ్‌ప్లాన్ నిధుల్లో నుంచే ఖర్చుపెట్టి ఎస్సీల అభ్యున్నతికి ఎంతో ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకొంటున్నాయి. దళితుల ఐక్యతను చాటుకోవాలంటే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను సక్రమంగా వినియోగించేటట్టు ఐక్య ఉద్యమాలు చేసి ఐక్యతను చాటుకోవచ్చు.
ఈ దేశంలో ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు తీసేయడానికి కుట్రలు జరుగుతున్నవి. వాటిని అడ్డుకోవడానికి ఐక్య ఉద్యమాలు చేయవచ్చు. దేశంలో ఉన్నత విద్యను మొత్తంగానే ప్రైవేటీకరణ చేసి, విద్యాసంస్థల్లో ఎటువంటి రిజర్వేషన్లు లేకుండా చేసేందుకు ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలుచేయాలని ఉద్యమం చేయండి. దీనిద్వారా దళితవర్గాల ఐక్యతే కాదు, మొత్తం బహుజనవర్గాల ఐక్యతను చాటుకోవచ్చు.
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించడమంటే సామాజిక న్యాయభావనను వ్యతిరేకించడమే. నిజానికి సామాజిక న్యాయ వర్గీకరణ వల్ల ఐక్యత దెబ్బతింటుందని మాట్లాడేవాళ్లందరూ ఒక విషయం ఆలోచించాలి. ఏ సమూహాలైతే అన్యాయానికి గురవుతున్నాయో ఆ సమూహాలతో న్యాయమైన పంపిణీ చేసుకొని ఇంకా దక్కాల్సిన రాజ్యాంగ ఫలాల కోసం ఉమ్మడిగా కలిసి కొట్లాడినప్పుడు మాత్రమే నిజమైన ఐక్యత సాధించగలుగుతారు. ఎస్సీ వర్గీకరణను మాత్రమే కాదు, ఏ వర్గీకరణను కూడా ఉత్త పంపకంగా చూడకూడదు. వివక్షాపూరితమైన, అసమానతకు గురవుతున్న సమూహాల్లోని ప్రజలలోనే వివక్షకు గురవుతున్న సమూహాల సామాజిక న్యాయకాంక్షగా చూసినప్పుడే వర్గీకరణలో గల న్యాయమైన సూత్రాన్ని అర్థం చేసుకోగలుగుతారు.