ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రతి సాగునీటి ప్రాజెక్టు తెలంగాణకు జరిగిన ద్రోహానికి సాక్ష్యమే! తాజాగా ఇవుడు వార్తల్లోకెక్కిన శ్రీశైలం ఎడమ గట్టు కాలువ పథకం దానికి మినహాయింపు కాదు. ఇంకా చెప్పాలంటే ఆంధ్ర ప్రాంతీయులు తెలంగాణకు చేసిన ద్రోహాన్ని సరిదిద్దడానికి తెలంగాణకు చెందిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన చొరవతో పురుడు పోసుకున్న పథకమిది.
SLBC | శ్రీశైలం ఎడమ గట్టు కాలువ పథకం కథ చాలా పెద్దది. దీని గురించి చెప్పాలంటే అనేక తరాల వెనక్కి వెళ్లాలి. తెలంగాణ ప్రయోజనాలను కేంద్రరాష్ర్టాల్లో అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ ఎలా కాలరాచిందీ తెలుసుకోవాలి. భాషా ప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటుకు ముందు ఆంధ్ర ప్రాంతం మద్రాస్ రాష్ట్రంలో ఉంటే, తెలంగాణ హైదరాబాద్ రాష్టంలో ఉండేవి. ఆ కాలంలోనే మద్రాసు, హైదరాబాద్ రాష్ర్టాలు కలిసి కృష్ణానదికి ఉపనది అయిన తుంగభద్ర మీద నిధులు వెచ్చించి తుంగభద్ర ప్రాజెక్టును నిర్మించాయి. తర్వాత కాలంలో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. అప్పటికే గోదావరి బ్యారేజ్, కృష్ణా బ్యారేజీల వల్ల కలిగే ప్రయోజనాలు, అవి సృష్టించిన సంపద చూసిన ఆంధ్ర ప్రాంతీయులు తుంగభధ్ర ప్రాజెక్టు ఉన్న బళ్లారి జిల్లాను ఆంధ్రలో కలుపుకోవాలని విశ్వప్రయత్నం చేసినా అది సాకారం కాలేదు. దీనితో వారి దృష్టి కృష్ణానది మీదికి మళ్లింది. ఆ నది మీద ఇవాల్టి శ్రీశైలం కు కాస్త అటుఇటుగా సిద్దేశ్వరం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ సమీపంలో పులిచింతల ప్రాజెక్టులు కట్టాలని డిమాండ్లు మొదలయ్యాయి. ఎందుకంటే సిద్దేశ్వరంతో రాయలసీమ, పులిచింతలతో కోస్తాంధ్ర సస్యశ్యామలమవుతాయి.
ఇదే సమయంలో ఇటు హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం ఇదే నది మీద ఎగువన అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, దిగువన ఏలేశ్వరం ప్రాజెక్టుకోసం ప్రతిపాదనలు రూపొందించింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుతో హైదరాబాద్ ప్రతిపాదనలు చెత్తబుట్ట పాలయ్యాయి. భాషా ప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటుతో అప్పర్ కృష్ణా ప్రాజెక్టు కట్టాల్సిన ప్రాంతం కర్నాటకలోకి వెళ్లి పోయింది. దానితో అప్పర్ కృష్ణా ప్రాజెక్టు ప్రతిపాదన కాలగర్భంలో కలిసిపోయింది.
ఇక మిగిలిన ఏలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితో ఇపుడు నాగార్జునసాగర్ కట్టిన నందికొండ వద్దకు మార్చారు. ఇక్కడే తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా దెబ్బతిన్నాయి. ఎందుకంటే ప్రతిపాదిత ఏలేశ్వరం ప్రాజెక్టు ప్రాంతం నందికొండతో పోలిస్తే సముద్రమట్టానికి ఎత్తున ఉంటుంది. అక్కడ నిపుణులు సూచించినట్టు రెండు కొండల మధ్య ప్రాజెక్టు కడితే నల్లగొండ ఉమ్మడి జిల్లా మొత్తానికి, ఇంకా ఆపై ప్రాంతాలకు గ్రావిటీ కాల్వల ద్వారా నీరు అందుతుంది. అయితే తమ ప్రాంతానికే నీరు మళ్లించుకోవాలన్న కుట్రతో ఆంధ్ర నీటిపారుదల ఇంజినీరు కేఎల్ రావు సూచన మేరకు దాన్ని దిగువకు తరలించి నందికొండ వద్ద కట్టారు. ఈ ద్రోహం ఇక్కడితో ఆగలేదు. తెలంగాణ వైపు కట్టిన నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కూడా సముద్రమట్టానికి చాలా దిగువన ఉంది. దీనితో ఎత్తున ఉన్న నల్లగొండ జిల్లాలో కొన్ని ప్రాంతాలకే సాగర్ నీరు పరిమితం కావలిసి వచ్చింది. వాస్తవానికి నల్లగొండ జిల్లా సాగు, తాగునీటి అవసరాలకు ఉన్న ఏకైక ఆధారం కృష్ణా నది మాత్రమే. ఏలేశ్వరంనుంచి గ్రావిటీ ద్వారా నీరందే అవకాశం నాగార్జునసాగర్‌కు ప్రాజెక్టు మార్పువల్ల శాశ్వతంగా దూరమైంది. 1969 ఉద్యమంలో ఈ అంశాన్ని ఉద్యమకారులు లేవనెత్తినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు పట్టించుకోలేదు. పైగా 1973లో ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాల కేటాయింపులపై నియమించిన బచావత్ ట్రిబ్యునల్‌కు కృష్ణా డెల్టా, కేసీ కాలువ అవసరాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కోరిందే తప్ప నల్లగొండకు నీరందించే ఏ పథకాన్నీ సూచించలేదు.
అయితే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి అయిన తర్వాత ఈ అన్యాయాన్ని సవరించేందుకు ‘నల్లగొండకు గ్రావిటీ ద్వారా సాగునీరందించే ప్రత్యామ్నాయ పథకాన్ని’ రూపొందించాలని అధికారులను, సాగునీటి రంగ నిపుణులను ఆదేశించారు. 1978లో ఇచ్చిన ఈ ఆదేశం కార్యరూపం దాల్చడానికి నాలుగేండ్లు పట్టింది. 1981లో నిపుణులు ప్రత్యామ్నాయ పథకంగా ఎత్తున ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సొరంగ మార్గం ద్వారా నీరు తరలించేలా శ్రీశైలం ఎడమ గట్టు కాలువ పథకం చేపట్టాలని నివేదిక ఇచ్చారు. దీనిద్వారా మాత్రమే నల్లగొండకు గ్రావిటీ ద్వారా నీరు అందించే అవకాశం ఉందని తేల్చి చెప్పారు. దీనివల్ల సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు, దారి పొడవునా గ్రామాలకు తాగునీరు అందించవచ్చునని సూచించారు.
సొరంగమే ఎందుకు?: ఆ రోజుల్లో సొరంగం వంటి క్లిష్ట తరమైన ఆప్షన్ తీసుకోవడానికి కారణం ఉంది. ఎందుకంటే అప్పటి వరకు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు అంతగా అనుభవంలో లేవు. ఉన్నా అవి చిన్నపాటి పథకాలు మాత్రమే. ఆ పథకాల సక్సెస్ శాతాలు అంత ఆకర్షణీయంగా కూడా లేవు. కాబట్టి ఆ రోజుల్లో లిఫ్ట్ పథకాల గురించి పెద్దగా ఆలోచించలేదు. ఇదిలా ఉంటే ప్రభుత్వం చెప్పిన పథకాలు ముందుకు పడకపోవడం, వరుస కరువులు, సాగునీటి కటకటల నేపథ్యంలో గోపాల్‌రెడ్డి అనే అభ్యుదయ రైతు.. తోటి రైతులతో కలిసి నిధులు సమీకరించి సాగర్ కాల్వల మీద అక్కడక్కడా లిఫ్ట్ పథకాలను చేపట్టారు. అంటే రైతులే తమ సొంత ఖర్చుతో లిఫ్ట్‌లు ఏర్పాటు చేసుకొని వాటి కరెంటు బిల్లులు కూడా తమ జేబునుంచి పెట్టుకునే వారు. అయితే అప్పటికే ఆంధ్రలో కాల్వల మీద చిన్నచిన్న లిఫ్టులుండేవి. వాటిని మాత్రం ప్రభుత్వమే తన సొంత ఖర్చుతో నిర్వహించేది. తెలంగాణకు వచ్చేసరికి ఇవి రైతులే ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఆ ఖర్చు వాళ్లే పెట్టుకుంటారన్నట్టు పట్టించుకోవడం మానేసింది. తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమై కేసీఆర్ ఈ దుర్నీతిని ఎండగట్టేదాక ఇదే విధానం కొనసాగింది.
భారీ ఉద్యమాలు.. ఎత్తిపోతల డిమాండ్లు: ఈలోగా నల్లగొండ నీటి కష్టాలు పెరగడం, ఫ్లోరోసిస్ సమస్య వెలికిరావడంతో జిల్లాకు సాగునీరు -తాగునీరు కావాలన్న డిమాండ్లతో రైతులు భారీ ఉద్యమాలు చేపట్టారు. మరోవైపు ఆ మధ్యకాలంలో దేశంలో అనేకచోట్ల ఎత్తిపోతల పథకాలు విజయవంతం కావడంతో సాగర్ మీద ఎత్తిపోతల పథకాలు చేపట్టి నీరివ్వాలనే డిమాండ్‌కు బలం చేకూరింది. రాష్ట్రంలో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమాలు మరింత ఊపందుకున్న నేపథ్యంలో నల్లగొండ సాగునీటి సమస్య మీద అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు ఎప్పటిలాగే శ్రీశైలం- టన్నెల్ కథ వినిపించారు. అది తప్ప మార్గాంతరం లేదన్నారు. అయితే విపక్షాలు ఈ ప్రతిపాదనపై విరుచుకుపడ్డాయి. అసలు టన్నెల్ విధానంలో నిర్మాణం చేపడితే ఈ పథకం ఎప్పటికి పూర్తవుతుందని నిలదీశాయి. అప్పటిదాక నల్లగొండ పరిస్థితి ఏమిటని ప్రశ్నించాయి. అప్పటికే దేశంలో పలు ప్రాంతాల్లో లిఫ్ట్ పథకాలు బాగానడుస్తున్నాయి కాబట్టి తాత్కాలికంగానైనా సాగర్‌నుంచి నీటిని లిఫ్ట్ చేసి నల్లగొండకు ఇవ్వాలని పట్టుబట్టాయి. ముందు లిఫ్ట్ ద్వారా నీళ్లిచ్చి ఆ తర్వాత ఎస్సెల్బీసీ పూర్తి చేసి శాశ్వత పరిష్కారం చూపాలని సూచించాయి. ఈ వాదనను అన్ని పక్షాలు సమర్థించాయి. దీనికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఎన్టీఆర్ అధికారంలో ఉన్న దాదాపు 7 ఏండ్లలో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తన సొంత ఎజెండా అమలులో భాగంగా ఎస్సెల్బీసీ పథకంలో మార్పులు చేశారు.
చంద్రబాబు బుర్రలో పుట్టిన తుంపరసేద్యం నిబంధనను ఈ పథకానికి అంటగట్టి ప్రతిపాదిత ఆయకట్టును రెండున్నర రెట్లు పెంచారు. ఎస్సెల్బీసీ నీటిని తుంపర సేద్యం పద్ధతిలో మాత్రమే వాడుకోవాలని నిబంధన విధించారు. దీనిపై రైతులు భగ్గుమన్నారు. ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో ఆనాటి ప్రభుత్వం సాగర్ బ్యాక్‌వాటర్ వద్ద పుట్టంగండి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన చేసింది.
అయితే ఆ లిఫ్ట్ పథకాన్ని వివిధ అవసరాలకు కేటాయించడంతో ఆనాటి శంకుస్థాపన కార్యక్రమం యుద్ధరంగంగా మారిపోయింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఓ ఎస్ఐ మరణించారు. చివరికి లిఫ్ట్ పథకం కాల్వల పనులు పూర్తయ్యాయి. అయితే ఎస్సెల్బీసీ పథకం మాత్రం ప్రారంభం కాలేదు. అదిగో ఇదిగో అనే మాటలతోనే నెట్టుకు వచ్చారు. ఈ పథకానికి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుమతుల విషయంలో పెద్దగా సహకారం అందించలేదు.
భారీ బ్యాలెట్ నిరసన..: ప్రభుత్వ తాత్సారానికి నిరసనగా ఉద్యమాలు వెల్లువెత్తడంతో పాటు 1996 పార్లమెంటు ఎన్నికల్లో 500 మందికి పైగా రైతులు నల్లగొండ ఎంపీ స్థానానికి నామినేషన్లు వేయడం ద్వారా తమ సమస్యను దేశం దృష్టికి తీసుకువచ్చారు. ఆనాటి ఎన్నికల్లో బాలెట్ పేపర్‌ను ఒక దినపత్రిక సైజులో ముద్రించాల్సి వచ్చింది. పోలింగ్ బాక్సులు సరిపోక డ్రమ్ములు వినియోగించాల్సి వచ్చింది. మొత్తానికి నల్లగొండ సమస్య దేశం దృష్టికి వచ్చింది.
ఓట్ల వేటకు ఎస్సెల్బీసీ..: 1993-94 ప్రాంతంలో తెలంగాణ బిడ్డ, నల్లగొండ ప్రజల కష్టాలు తెలిసిన పీవీ నరసింహారావు ప్రధాని హోదాలో కలుగచేసుకున్న తర్వాతే ఎస్సెల్బీసీకి చాలా అనుమతులు వచ్చాయి. అయినా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలనుంచి శుష్కప్రియాలు శూన్యహస్తాలు విధానమే కొనసాగింది. ప్రతి ఎన్నికలో ఈ పథకం పేరు చెప్పుకోవడం కాంగ్రెస్ నాయకులకు ఆనవాయితీగా మారింది. తర్వాత కాలంలో తెలంగాణ మలిదశ ఉద్యమం తలెత్తిన నేపథ్యంలో 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలో రావటం, ఆనాటి ప్రభుత్వంలో టీఆర్ఎస్ భాగస్వామి కావడంతో తొలిసారి బడ్జెట్లో ఎస్సెల్బీసీకి కేటాయింపులు ప్రారంభమయ్యాయి. అయితే అటవీ, పర్యావరణ, న్యాయ సమస్యల కారణంగా మూడేండ్లు గడిచిపోయాయి. చివరకు 2007లో సుప్రీం కోర్టు క్లియరెన్స్ ఇచ్చాక లాంఛనంగా పనులు ప్రారంభమయ్యాయి.
ఎన్నో కష్టాలు..: అప్పటినుంచి ఆ సొరంగం పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పనుల్లో ప్రమాదాలు జరగడం కొత్త కాదు, గతంలో 2009 అక్టోబర్‌లో వచ్చిన వరదల్లో టన్నెల్ యంత్రం మునిగి పోయింది. దాన్ని బాగు చేసి పని చేయించడానికి 21 నెలల కాలం పట్టింది. భూసేకరణలో మరో సంవత్సరం గడిచింది. యంత్రానికి సమస్యలు, కాంట్రాక్టర్ బిల్లుల సమస్యలు వంటి వాటితో కాలహరణం జరుగుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అసెంబ్లీలో ఈ పథకం మీద సుదీర్ఘ చర్చ జరిగింది. పథకం కార్యరూపం దాల్చేందుకు పాత ప్రభుత్వం వదిలిపోయిన రూ.150 కోట్లను కేసీఆర్ ప్రభుత్వం చెల్లించింది. కాంట్రాక్టర్ అడిగిన అన్ని సౌకర్యాలు సమకూర్చింది. అయినా పనుల్లో వేగం పుంజుకోలేదు.
పలుమార్లు డ్రిల్లింగ్ యంత్రం మొరాయించడం, మట్టి పెళ్లలు కూలిపడడం వల్ల నెలల తరబడి పనులు నిలిచిపోవడం సాధారణమై పో యింది. దీనివల్ల కాలహరణం జరుగుతూ వచ్చింది. ఎన్ని నిధులు కుమ్మరించినా.. ఎంత ఒత్తిడి చేసినా దీని తవ్వకానికి ఎన్నుకున్న టెక్నాలజీ.. డ్రిల్లింగ్ యంత్రం వేగం.. పనుల్లో పెద్ద పురోగతిని సాధించే అవకాశం లేకుండా చేశా యి. గతంలో వరద నీరు ప్రవేశించిన కారణంగానే దాదాపు రెండేండ్లు పనులు నిలిచిపోయిన అనుభవం దృష్ట్యా తాజా ప్రమాద తీవ్రత చూస్తే ఈసారి తిరిగి పనులు ప్రారంభించడానికి ఎంతకాలం పడుతుందనేది ఎవరూ చెప్పలేకుండా ఉన్నారు.
– ఎస్జీవీ శ్రీనివాసరావు