తెలంగాణ బాపు జన్మదినం.. అయ్య కడుపు సల్లగుండాలని కోటి దీవెనలతో జనం ఎర్రవల్లి బాట పట్టారు. వాళ్లలో నేనూ కలిసిపోయాను. మహా స్వాప్నికుని ఆత్మీయ స్పర్శ కోసం ఇంటి ముందర గుంపులు గుంపులుగా జన సందోహం. కాలు కదప సందు కాలేదు. సారును కలవలేక పోయిన. కానీ జనం మధ్యకే కేసీఆర్ వచ్చి మాట్లాడారు. ‘తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను చైతన్య పరుస్తూ, తెలంగాణ అస్తిత్వ పటిష్టతకు కృషిచేస్తూ, గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను తిరిగి అవే కష్టాలపాలు కాకుండా, దోపిడీ వలసవాదుల బారిన పడకుండా తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా మనం కృషి చేయాలి’ అని ప్రజలకు పిలుపునివ్వడం విని ఆశ్చర్యపోయాను.
తాను తపన పడిన ఈ తెలంగాణ సమాజమే బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించింది. కానీ, ఆయన ప్రతి మాటలో తెలంగాణ జీవనయానాన్ని వికసింపజేయాలనే తపన, విధ్వంసమైపోతున్న వ్యవస్థలను తిరిగి వింగడింపు చేయాలనే ఆలోచన, ఆవేదన తప్ప ఇసుమంతైనా రాజ్యకాంక్ష వ్యక్తపరచని నిగ్రహం, నైతిక సంఘర్షణను, రాజకీయ ఆపేక్షను వేరు పరిచి చూసిన నిర్గుణ స్వరూపం నా కండ్ల ముందు సాక్షాత్కరిస్తుంటే, జనం మధ్యలోంచే రెండు చేతులెత్తి దండం పెట్టి వెనుదిరిగిన.
రెండు రోజులు ఆగి ఈ దృగ్విషయానికి అక్షర రూపం ఇచ్చేందుకు కూర్చున్న. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోని ప్రతి అనుభవానికి అక్షరాలను ఏరుకొని పదాలుగా పొందించి, వ్యాసరూప అక్షరమాలగా గుదిగుచ్చే పనిలో నిమగ్నమైపోయాను. ‘నల్లమలలోని దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్..’ అనే పదాలు టీవీలో వినిపిస్తుంటే తలపైకెత్తి చూసిన. నల్లమలతో నాది భావోద్వేగమైన అనుబంధం. అక్కడి చెంచులతో కలిసి అడవంతా కలెదిరిగి, కృష్ణమ్మ ఒడిలో సేద తీరిన మధుర జ్ఞాపకాలు అనేకం. అందుకే నల్లమల అనే పేరు ఏ స్వరంలో పలికినా.. ఆ నాధును నా మనసు పట్టేస్తుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలిందని బ్రేకింగ్ న్యూస్ హెడ్‌లైన్‌గా పడుతున్నది. అన్ని టీవీల్లోనూ అదే వార్త. మనుసు కలవరపడ్డది. కొద్దిసేపటికే హృదయ విదారక దృశ్యాలు టీవీ స్క్రీన్ల మీద ప్రత్యక్ష ప్రసారమవుతున్నాయి. మనసు కకావికలమైంది. పేగులు మెలిపెడుతున్నయి. పెన్ను ముందుకు కదలడం లేదు. నాలుగు పొద్దుల నుంచీ ఇదే తంతు. టన్నెల్ 14వ కిలోమీటర్ దాటిన తరువాత దోమలపెంట వద్ద సొరంగం 140 మీటర్ల పొడవున, నాలుగైదు మీటర్ల మేర పైకప్పు కుప్ప కూలిందట. గాలి కూడ చొరబడని మృత్యు కుహరంలో 8 మంది కార్మికులు ప్రాణాలతో పోరాడుతున్నారట. రెస్క్యూ బృందాలు పగలు రేయి శ్రమిస్తున్నాయట. ఎలక్టానిక్ మీడియా, సోషల్ మీడియాలో కథనాలు కథలు కథలుగా ప్రసారమవుతున్నాయి.
అందులోనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మీద కేసీఆర్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. 2016లో అసెంబ్లీలో కేసీఆర్ సభకు వివరిస్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అది. “ప్రపంచంలోనే లాంగెస్టు టన్నెల్ అధ్యక్షా. 43 కిలోమీటర్ల పొడవు. 1960 యాజిటేషన్ తరువాత మాకు నీళ్లు ఇయ్యాలే అని అడిగితే.. చర్చలు అధ్యక్షా.. చర్చోప చర్చలు. తెలంగాణ సమస్యలను ముందుపడనియ్యరు, తెమలనియ్యరు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మళ్లొక్కసారి చర్చలు పెడితే ఇది కాల్వనా? లిఫ్టా? సొరంగమా? అని చర్చ అధ్యక్షా.. ఆఖరికి టైగర్ వ్యాలీ కింద నుంచి టన్నెల్ బోర్ మిషన్ అని పెట్టిండ్రు. అది ముందుకు పోదు వెనక్కి రాదు. శ్రీశైైలం నిండినప్పుడల్లా టన్నెల్లోకి నీళ్లు వచ్చి మునిగిపోతున్నది. మళ్లీ వాటిని క్లియర్ చేయాల్సి వస్తున్నది. టైగర్వ్యాలీ కాబట్టి అడవిలోకి జనాలు వెళ్లొద్దు. వెళ్తే అభ్యంతరాలుంటయి. మళ్లీ వీళ్లే కోర్టుకెక్కుతారు. పర్యావరణ సంఘాలు వస్తాయి. ఇది పర్యావరణ వ్యతిరేకమంటయి”.. అని ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఆయన మాటలు వినసొంపుగా, ప్రొఫెసర్ పాఠం చెప్పినట్టు, అమ్మలక్కలు తీరువాటుగ కూసొని ముచ్చట పెట్టినట్టు చెప్తున్నారు. టన్నెల్లోకి గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాటు చేద్దామంటే కూడా వీలు లేదు అధ్యక్షా.. రెండు చివర్ల నుంచి మిషన్లు పెట్టి గాలి వదిలితే, ఆ గాలి పీల్చుకుంటూనే లోపల కార్మికులు సొరంగం తవ్వాలి. ముందు డ్రిల్లింగ్ చేసుకుంటూ వెనుక నుంచి లైనింగ్ చేసుకుంటూ వెళ్తుంది. వెనక్కి లాగుదామంటే లాగలేం. ఒకవేళ లాగాలంటే వెనుక చేసిన లైనింగ్ అంతా కూల్చేయాల్సిందే. ఇప్పుడు దాన్ని బలవంతంగా కొనసాగించడం తప్ప గత్యంతరం లేని భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ.. ఇలా ఎవరైనా పెడతారా అధ్యక్షా! నీళ్లు ఇచ్చే విధానం ఇదేనా? ఎస్ఎల్బీసీ గురించి ఎప్పటి నుంచి వింటున్నాం.. ఇంకెన్ని ఏండ్లకు కంప్లీట్ కావాలి.. ఇది ఎవరి పాపం.. తెలంగాణ ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలి’ అంటూ కేసీఆర్ మథనపడుతున్న క్లిప్పింగ్ వైరల్ అవుతున్నది. కేసీఆర్‌కు జలప్రాజెక్టు మీద ఉన్న సంపూర్ణమైన పరిజ్ఞానం, ముందుచూపునకు ఇది నిదర్శనం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి శ్రీశైైలం, నాగార్జునసాగర్ కాకుండా కృష్ణా, పెన్నా నదుల మీద కలిసి ఆంధ్రాలో 650 టీఎంసీల నీటి నిల్వ రిజర్వాయర్లు ఉన్నయి. అదే తెలంగాణలో కృష్ణా నది మీద 20 టీఎంసీలకు మించి రిజర్వాయర్లు లేవు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జలయజ్ఞం కింద ప్రారంభించిన కృష్ణా బేసిన్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులుగా దు మ్ము పేరుకుపోయాయి. కేసీఆర్ కొలువు కూటాల మీదికి వచ్చాక ఎస్ఎల్బీసీకి 40 టీఎంసీలు, కల్వకుర్తి ప్రాజెక్టుకు 40 టీఎంసీలు, భీమాకు 20 టీఎంసీలు, నెట్టెంపాడుకు 25 టీఎంసీలు మొత్తం 125 టీఎంసీల జలాలు తక్షణ వినియోగం కోసం పట్టుబట్టారు. కేసీఆర్ కేంద్రంతో కొట్లాడి నీటి వినియోగానికి అనుమతులు సాధించారు.
అప్పటి నీళ్ల మంత్రి హరీశ్‌రావును పురమాయిస్తే, ఆయన కాళ్లకు చక్రాలు కట్టుకొని కాళేశ్వర్వం-కల్వకుర్తి మధ్య తిరిగి రన్నింగ్ ప్రాజెక్టులుగా మలిచారు. రోజుకు 1,600 క్యూసెక్కుల నీళ్ల చొప్పున కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాల్లో 3 లక్షల ఎకరాలకు నీళ్లందినయి. నెట్టెంపాడు ద్వారా 1.2 లక్షలు, భీమా ద్వారా 1.4 లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్ ద్వారా 8 వేల ఎకరాలు కొత్త ఆయకట్టుకు నీరు పారింది. బీడువడ్డ నేల ఆకుపచ్చ తెలంగాణగా పునరుజ్జీవం పోసుకున్నది.
కొత్త కాపురం చేసేటోనికి సొంత తెలివైనా ఉండాలె. లేదంటే అనుభవజ్ఞుడు చెప్పిన మాటై నా వినాలె. అటూఇటూ కాని కొసెర్రోని తోనే కొంపలు కూలుతయని పల్లెల్లో ఇప్పటికీ ఓ మోటు నానుడి ఉన్నది. హైదరాబాద్ చుట్టూ మూడు సముద్రాలున్నయని, బంగాళాఖాతం, అరేబియా సముద్రం అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పి న నాడే ఆయనకు నీటి వనరుల మీదున్న అవగాహన రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. తనకు ఎలాగూ తెలియదు కాబట్టి, నిఖార్సయిన తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్ సలహాలు, సూచనలైనా తీసుకోవాలి కదా, అదీ లేదు. నాలుగేండ్ల నుంచి పడావుపడిన ప్రాజెక్టులోనికి ఎకాఎకిన కార్మికులను సొర్రగొడితివి. ఎనకాముందు ఆలోచన లేకుండా పట్టుర పట్టు అని బోరింగ్ మిషన్‌ను ఆన్చేయిస్తే, దాని డ్రిల్లింగ్ అదురుకు పైకప్పు కూలిపోయిందని నిపుణులు చెప్తున్నారు. అది పోతే పోయింది. కార్మికులు చిక్కుకోవడమే హృదయ విదారకం.
ఇక్కడో సంఘటన గుర్తు చేయాలి. కాళేశ్వరం కాడి పర్రెల పంచాయితీ ప్రతి రైతన్నకు అనుభవమే. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం నదీ గర్భాశయ జలాశయాలు. 16 భూ ఉపరితల జల భాండాగారాలు. 228 పిల్లర్లు.. 20 లిఫ్టులు.. 21 బాహుబలి పంపులు.. 21 సంపుహౌజ్లు.. 203 కిలోమీటర్ల సొరంగాలు.. 1,531 కిలోమీటర్ల కాల్వల సమాహారాన్ని నేర్పుగా కూడగట్టి కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపం ఇచ్చిన ఆధునిక జల ప్రదాత కేసీఆర్. కాల గమనంలో మేడిగడ్డ కింద రెండు పిల్లర్లు పర్రెలు బాసిన సంగతి తెలంగాణ రైతాంగానికి విదితమే. ఒక వాయి మం త్రుల బృందం, మరో వాయి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడిగడ్డకు వెళ్లి పర్రెల్లో పుర్రెలు దూర్చి ఎగాదిగా చూసి వచ్చారు. పర్రెల పంచాయితీనే ముందుపెట్టి ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టిండ్రు. కేసీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేందుకు ఎంక్వైరీ కమిషన్ వేశారు. అక్కడ ఏమీ లేకున్నా నానాయాగీ చేస్తున్నరు. కానీ ఇవాళ ఎస్ఎల్బీసీ కూలిపోయింది. పాలకుని అవగాహన రాహిత్యంతో పని మొదలు పెట్టి వారం తిరక్క ముందే సొరంగం కుప్పకూలింది. ఇవ్వాల్టికి ఐదు దినాల పొద్దు. 8 మంది ప్రాణాలు సొరంగంలో కొట్టుమిట్టాడుతున్నయి. ఈ వ్యాసం రాసే సమయానికి ముఖ్యమంత్రికి ఇవేమి పట్టనట్టు గుళ్లు, ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నరు. ఇప్పటి వరకు సంఘటనా స్థలానికి వెళ్లలేదు. రెస్క్యూ టీం అధికారులను వెన్నుతట్టి ప్రోత్సహించలేదు. బాధిత కుటుంబాలకు నేనున్నాననే భరోసా ఇవ్వలేదు. ఇక్కడ విషాద ఘోషలు మిన్నట్టుతుంటే అక్కడ ఆకాశ వీధుల్లో విహార యాత్రలతో గడుపుతారా? ఇదా.. పరిపాలకునికి ఉండే తరీఖా.
అటు మేడిగడ్డ మీద, ఇటు ఎస్ఎల్బీసీ మీద జనానికి అనుమానాలున్నయి. నూరు కుట్రలు, వంద అబద్ధాలు కలగలిస్తే ఆ పెద్ద మనిషి అంటరు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరును దత్త త తీసుకున్నడు. ఇంకుడు గుంతలను మించిన అభివృద్ధే లేదని, ఇంటికో గుంతతోడి పాలమూరు జనకాంక్షను ఇంకుడు గుంతల్లోనే బొందపెట్టిన ఘనుడు. అంతకు తగ్గ బొంత ఈయనే అంటరు. గురుదక్షిణ కింద తెలంగాణ ప్రాజెక్టులను బొంద పెడుతున్నరనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విపరీతం మీద విచారణ చేయమని మాజీ నీళ్ల మంత్రి హరీశ్‌రావు అడుగుతున్నరు.
కండ్ల ముందు జరుగుతున్న దారుణాలు ఓపుకోలేక గుండెలు మండుతున్నయి. పర్తం మల్లయ్య గుడికెళ్లి ఇట్టెందుకు చేశావని నిలదీయాలని ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ నిట్టనిలువునా కుప్ప కూలినందుకు కాదు. సొరంగంలో 8 నిండు ప్రాణాలు విషాద వదనంతో ఘోషిస్తున్నాయనీ కాదు, మూడు దశాబ్దాల ఎస్ఎల్బీసీ టన్నెల్ మోసానికి కారకులెవరని? సొరంగంలోనే నల్లగొండ ఫ్లోరైడ్ బాధితుల ఆశలు సమాధి చేసిన పాపాత్ముడు ఏడని? పాలమూరు, నల్లగొండను ఎండబెట్టి కృష్ణా జలాలను ఆంధ్రోళ్లకు సద్దికడుతున్నది ఎందుకని?
పంతానికి పోయి 8 మందిని మృత్యుకుహరంలోకి నెట్టిన పాపం మూట కట్టుకున్నది ఎవరని? పోతిరెడ్డిపాడుకు పొక్కలు కొట్టి ఈ ఒక్క ఏడాదిలోనే 220 టీఎంసీల నీళ్లు ఎత్తుకపోతుంటే కండ్లు మూసుకున్న ధృతరాష్ట్ర పాలన ఏమిటని అడగాలని ఉన్నది. ఆనాటి రోజులు మళ్లీ వస్తాయంటే ముందు వెనుక ఆలోచన లేకుండా ఓటు పక్కకు తిప్పి ఒక్క తప్పిదం చేసినందుకు ఎంతపని చేస్తివిరా సాంబశివా! అని అడగాలని ఉన్నది.
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు