దశాబ్దం పాటు దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిన తెలంగాణ గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఏడాదిన్నరగా అవస్థలు, ఆక్రందనలు కనిపిస్తూ, వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా కులకచర్ల గిరిజన ఆశ్రమంలో అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతిచెందగా, తాడూరు గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇక మెట్ల చిట్టాపూర్ గురుకులంలో ఏడుగురు విద్యార్థులను ఎలుకలు కరవడం కలకలం రేపింది. ఇలా వరుస సంఘటనల నేపథ్యంలో ఈ ఏడాది ప్రభుత్వం నిర్వహించిన 5వ తరగతి ప్రవేశ పరీక్షలో 40 వేలకు పైగా దరఖాస్తులు తగ్గడం గమనార్హం. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ సొంత జిల్లా నాగర్‌కర్నూల్‌లోని కొండనాగుల ఎస్సీ వసతి గృహంలో ‘వంట వండలేదు.. ఆలయాల్లో అన్నం తిని కడుపు నింపుకోవాలని’ సిబ్బంది హుకూం జారీచేసిన విషయం మనందరికీ తెలిసిందే.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేద, బలహీనవర్గాలకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంగా నవీన విధానాలతో 1001 గురుకులాలను నెలక్పొలారు. వీటిలో ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ అయినవి 597 కాగా, డిగ్రీ గురుకులాలు 68 ఉన్నాయి. ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై సగటున రూ.1.25 లక్షలు ఖర్చుచేసింది. ఇంటర్ నుంచే అగ్రికల్చర్, ట్యాక్సేషన్, కంప్యూటర్ గ్రాఫిక్స్, ఫిజియోథెరపీ వంటి కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ఎంసెట్, ఐఐటీ, నీట్ వంటి పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించడం యావత్ సమాజం గమనించింది. కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, మాస్ మ్యూచువల్స్ వంటి బహుళజాతి సంస్థలు గురుకుల కళాశాల విద్యార్థులను ఏరికోరి ఎం చుకున్నాయి. క్రీడల్లోనూ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఎవరెస్టును అధిరోహించడంతో పాటు పేద విద్యార్థులు చదువులు ఖండాంతరాలకు విస్తరించాయి.
ఇదంతా గతం, ప్రస్తుతం ‘మార్పు’ పుణ్యమాని పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏడాదిన్నరలోనే వసతి గృహాల్లో అను మానాస్పద మరణాలు, బలవన్మరణాలు, అనారోగ్యం, కలుషిత ఆహా రం తిని ఏకంగా మొత్తం 52 మంది విద్యార్థులు మృత్యుఒడికి చేరా రు. 980 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారినపడి తీవ్ర అనారోగ్యం పాలయ్యారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వసతి గృహాల్లో నాణ్యమైన పౌష్ఠికాహారం అందడం లేదు. మౌలిక సదుపాయాలు అధ్వాన్నస్థితిలో ఉన్నాయి. ఆహార మెనూ, విద్యార్థుల రికార్డుల నిర్వహణ సరిగా లేదంటూ ప్రభుత్వ సంస్థలైన ఏసీబీ, తూనికలు కొలతలు, ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారుల పరిశీలన బృందం ఇప్పటికే తేల్చిచెప్పింది. కొద్దిరోజుల కిందట మాగనూరు ఘటనపై స్పందిస్తూ ‘పాలకుల్లో మానవత్వం కరువైంది’ అంటూ హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసి మొట్టికాయలు వేసింది. ఇంత జరుగుతున్నా ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్న చందంగా పాలకులు వ్యవహరిస్తుండటం బాధాకరం.
‘ప్రజా పాలన’ అంటూ బీరాలు పలుకుతున్న ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలి. పెండింగ్‌లో ఉన్న కాస్మొటిక్ చార్జీలు చెల్లించాలి. శిక్షణ పొందిన పర్మినెంట్ వంట మనుషులను నియమించాలి. నాసిరకం సరుకుల సరఫరాకు అడ్డుకట్ట వేయాలి. రాజకీయ దురుద్దేశంతో గురుకులాల వ్యవస్థను నీరుగారుస్తామంటే ప్రజలు కాంగ్రెస్ పాలకులకు గుణపాఠం చెప్పక తప్పదు.
– నరేష్ పాపట్ల, 95054 75431