కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి కేటాయిస్తున్న నిధులు అంతకంతకూ క్షీణించిపోతున్నాయి. నాణ్యమైన విద్యను అందిస్తామని హామీనిచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ మాటను ఎప్పుడో మర్చిపోయింది. బడ్జెట్లో విద్యకు మనం చేస్తున్న కేటాయింపులు ప్రపంచ దేశాలతో పోల్చితే చాలా తక్కువ. విద్యారంగం మీద ప్రాధాన్యం మేరకు ఖర్చు చేస్తున్న దేశాలు చక్కటి అభివృద్ధి సాధిస్తున్నాయి. అరకొర నిధుల కేటాయింపుతో విద్యాభివృద్ధి అసాధ్యం.
జాతీయ విద్యా విధానంలో ప్రమాణాలతో కూడిన ఆధునిక, నాణ్యమైన విద్యను అందిస్తామని మోదీ గ్యారెంటీ పేరుతో విడుదల చేసిన సంకల్ప పత్రంలో బీజేపీ వాగ్దానం చేసింది. పాఠ్యప్రణాళిక ప్రక్రియ, ఉపాధ్యాయ శిక్షణ, మౌలిక వసతుల కల్పన, సాంకేతిక అంశాలను వినియోగిస్తూ జ్ఞాన నైపుణ్యాలను ఆధునికీకరిస్తామని హామీ ఇచ్చింది.జాతీయ విద్యా విధానంలో చెప్పినట్టుగా అత్యుత్తమ పాఠశాల విద్య అందించడానికి పీఎం శ్రీ, ఏకలవ్య పాఠశాలలను అభివృద్ధి చేస్తామని కూడా హామీ ఇచ్చింది.
మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ తన మొదటి బడ్జెట్లో విద్యారంగాన్ని విస్మరించింది. గణనీయమైన నిధులు, సంస్కరణల వాగ్దానాలు చేసినప్పటికీ అనేక కీలక అంచనాలను అందుకోవడంలో బడ్జెట్ విఫలమైంది. స్థూల జాతీయోత్పత్తిలో విద్యపై ప్రభుత్వ వ్యయం చాలా తక్కువగా కేవలం 2.7 శాతంగానే ఉన్నది. జాతీయ విద్యా విధానం స్థూల జాతీయోత్పత్తిలో 6 శాతాన్ని సిఫారసు చేసింది. విద్య నాణ్యతను ఈ తక్కువ వ్యయం నేరుగా ప్రభావితం చేస్తుంది.
బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది 2013-14 బడ్జెట్లో 3.16 శాతం నిధులను విద్యకు కేటాయించగా, 2024-25లో అది 1.53 శాతానికి తగ్గిపోయింది. ఉన్నతవిద్యకు కేటాయింపులు 2013-14లో 1.6 శాతం ఉండగా 2024-25లో ఒక శాతానికి పడిపోయాయి. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో 2.53 శాతం నిధులను మాత్రమే విద్యకు కేటాయించారు. అందులో పాఠశాల విద్యకు 1.5 శాతం, ఉన్నత విద్యకు 0.988 శాతం నిధులు దక్కాయి. ఈ మాత్రం నిధులతో దేశంలోని 1,50,000 ఉన్నత పాఠశాలల్లోని 10 వేల బడుల్లో అటల్ టింకరింగ్ ప్రయోగశాలలను అభివృద్ధి చేస్తామని, వచ్చే నాలుగేండ్లలో 40 వేల పాఠశాలలకు విస్తరిస్తామని ప్రతిపాదించారు. పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని, రూ. 500 కోట్లతో ఏఐ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
దేశంలోని అన్ని రాష్ర్టాల్లో దాదాపు 10 లక్షలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘సాత్’ (సస్టెయినబుల్ యాక్షన్ ఫర్ ట్రాన్స్ఫామింగ్ హ్యూమన్ క్యాపిటల్) నివేదిక తెలిపింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 33 శాతం అధ్యాపకుల ఖాళీలు, ఐఐటీల్లో 40 శాతం, ఐఐఎంలలో 31.6 శాతం బోధన పోస్టులు ఖాళీగా ఉన్న విషయాన్ని, వాటిని భర్తీచేసే విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి పట్టించుకోలేదు.
ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ 200 విశ్వవిద్యాలయాల్లో భారతీయ యూనివర్సిటీలు మూడు మాత్రమే ఉన్నాయి. నిధుల కేటాయింపు లేకుండా భారతీయ సంస్థలు అంతర్జాతీయంగా పోటీ పడలేని పరిస్థితి ఉన్నది. అవసరాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి అవసరమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు కూడా బడ్జెట్ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఉపాధిని పెంపొందించడానికి బలమైన వృత్తి శిక్షణ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం సిఫారసులు చేసినప్పటికీ, స్కిల్ ఇండియా మిషన్ 1.4 కోట్ల మంది వ్యక్తులకు శిక్షణను ఇచ్చినప్పటికీ విద్యా ఫలితాలను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మార్చడానికి మరింత మద్దతు అవసరమని నిపుణులు చెప్తున్నారు. కొత్తగా పరిశోధన కేంద్రాల స్థాపన, డిజిటల్ విద్యను మెరుగుపరచడానికి, అట్టడుగు వర్గాలకు అవసరమైన సహాయాన్ని అందించడానికి విద్యా రంగానికి మరిన్ని నిధులు కేటాయించాలి.
భారత్ తన జీడీపీలో విద్యకు కేటాయిస్తున్న 2.53 శాతం నిధులు ప్రపంచవ్యాప్తంగా సిఫారసు చేసిన ఆరు శాతం కంటే తక్కువ కావడం గమనార్హం. 26 కోట్ల మందికి పైగా పాఠశాల విద్యార్థులున్న దేశంలో, ఉన్నత విద్యకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో విద్యకు ఇంత తక్కువ కేటాయింపులు సరికాదు. బీజేపీ ఎన్నికల వాగ్దానాలకు, ఆచరణలో విద్యా రంగానికి నిధుల కేటాయింపునకు నక్కకు నాకలోకానికి ఉన్న తేడాను తెలుపుతుంది. ఈ అరకొర నిధులతో విద్యారంగాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేం. విద్యారంగం మీద ప్రాధాన్యం మేరకు ఖర్చు చేస్తున్న దేశాలు చక్కటి, వినూత్న ఆర్థిక వ్యవస్థలను నిర్మించుకుంటున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని మన దేశంలో విద్యకు చేసే ఖర్చును రెట్టింపు చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ఫలితంగా..భారత్లోని మారుమూల ప్రాంతాలనే సంబంధం లేకుండావిద్యార్థులకు నాణ్యమైన బడులు, అందరికీ వనరుల లభ్యత, సమాన అవకాశాలుంటాయి.
(వ్యాసకర్త: పూర్వ అధ్యక్షులు, ఏపీటీఎఫ్)
-కె. వేణుగోపాల్,98665 14577