భారతీయ సామాజిక వ్యవస్థలో కులానికి ఉన్న ప్రాధాన్యం ఏమిటన్నది అందరికీ తెలిసిందే. మన దేశంలో వర్ణ వ్యవస్థే తదనంతర కాలంలో కులాలుగా రూపం సంతరించుకున్నది. అయితే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అభివృద్ధి పథంలో ఉన్నవి 10 శాతమున్న అగ్రకులాలైతే.. అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురవుతున్నవి మాత్రం 90 శాతమున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలేనన్నది జగమెరిగిన సత్యం.
Reservations | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పిన విషయం విదితమే. ధర్మాసనంలోని ఆరుగురు న్యాయమూర్తులు వర్గీకరణను సమర్థించగా.. జస్టిస్ బేలా త్రివేది మాత్రం వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో మరోసారి వర్గీకరణ చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఏపీలో వలె మాదిగ- దాని ఉపకులాలకు 7 శాతం, మాల- దాని ఉపకులాలకు 6 శాతం మేర రిజర్వేషన్లు కల్పిస్తే.. మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. జనాభా పెరగడమే అందుకు కారణం. అందుకే జనాభా దామాషా ప్రకారం.. ఎస్సీలలో ఎక్కువగా ఉన్న మాదిగలకు 11-12 శాతం, మిగతా ఉప కులాలకు వారి ప్రాతినిధ్యానికి తగ్గట్టుగా వాటా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తద్వారా ఎస్సీల్లోని అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుంది.
మన దేశ మొత్తం జనాభాలో ఎస్సీలు దాదాపుగా 20 శాతం ఉండగా.. తెలంగాణలో 18-20 శాతం వరకు ఉన్నట్టు అంచనా. తెలంగాణలో మాదిగలు 50 లక్షల మంది ఉండగా.. మాలలు 30 లక్షలు, ఇతర ఉపకులాలతో కలిపి మొత్తం ఎస్సీ జనాభా కోటి వరకు ఉండొచ్చు. ఇప్పటివరకు విద్య, ఉద్యోగ రంగాల్లో ఎస్సీల్లోని కొన్ని వర్గాలే ఎక్కువగా లబ్ధి పొందగా.. అనేక ఉపకులాలు నష్టపోయాయి. ఈ కారణంగానే ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మొదలైంది. సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తాజా తీర్పుతో ఇప్పటివరకు నష్టపోయిన వర్గాలకు లబ్ధి చేకూరనున్నది. ఆయా వర్గాలు రాజ్యాంగబద్ధంగా వారికి దక్కాల్సిన హక్కును పొందనున్నాయి. అయితే ఎస్సీ వర్గీకరణతోనే ఆయా కులాలు అభివృద్ధి పథంలోకి వస్తాయనుకోవడం భ్రమే.
ఎందుకంటే, రాజ్యాధికారంలో ఉన్న కులాలు మాత్రమే అన్నిరంగాల్లో వృద్ధి చెందుతున్నాయన్నది చరిత్ర మనకు చెప్తున్న సత్యం. అందుకే అణగారిన వర్గాల సకల సమస్యలకు రాజ్యాధికారమే అంతిమ పరిష్కారమని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పారు. రాజ్యాధికారంలో ఉన్న కులాలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెంది.. అణగారినవర్గాల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తాయన్న సత్యాన్ని ఆయన మాటల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని గ్రహించిన కాన్షీరాం యూపీ వేదికగా 20 ఏండ్ల పాటు సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పోరాటం చేసి దళితుల నాయకత్వంలో రాజ్యాధికారాన్ని సాధించారు. మరి తెలంగాణ వేదికగా మెజారిటీ ప్రజల రాజ్యాధికారం కోసం ఎంతమంది పోరాటం చేస్తున్నారనేది మేధావులు, విద్యావంతులు ఒక్కసారి ఆలోచించాలి.
అగ్రవర్ణాలతో పోరాడి అణగారిన వర్గాలకు కూడా ఓటుహక్కును సాధించిన మరుక్షణం అంబేద్కర్ ఇలా చెప్పారు. ‘ఓ నా అణగారిన సమాజమా! మీరు తరతరాలుగా అగ్రవర్ణ సమాజం చేత అన్నివిధాలుగా అణచివేతకు గురవుతున్నారు. కాబట్టి, మీకు ఓటు అనే వజ్రాఆయుధాన్ని ఇచ్చాను. ఇకపై ఆ ఓటును మీ ప్రయోజనాల కోసం వేసుకొని, దేశానికి పాలకులుగా మారాలి’ అని హితబోధ చేశారు. మరి ఆ మహనీయుడు చూపిన మార్గంలో నేడు మనం వెళ్తున్నామా, లేదా? అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇకనైనా బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలి. వర్గీకరణతోనే సంతృప్తి చెందకుండా రాజకీయ పోరాటం కూడా చేస్తే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా వృద్ధి చెందవచ్చు. లేకపోతే కేవలం పది శాతం ఉన్న అగ్రకుల పాలకులిచ్చే సంక్షేమ పథకాల కోసం మరికొంత కాలం ఎదురుచూడక తప్పదు.
– పుల్లెంల గణేష్ 95530 41549