సంక్రాంతి భారతదేశంలో కేవలం మతపరమైన పండుగ మాత్రమే కాదు. గ్రామ, నగర జీవనాల మధ్య ఉన్న వెలితిని చెరిపేసే సామాజిక భావోద్వేగం కూడా. తెలుగు రాష్ర్టాల్లో ఈ పండుగ ప్రాధాన్యం వేరు. హైదరాబాద్ నుంచి లక్షల మంది తెలంగాణ, ఏపీ గ్రామాలకు తరలిపోతారు. ఈ సందర్భంలో ప్రతి ఏడాది పునరావృతమయ్యే చర్చ ఒకటే. ట్రాఫిక్ జామ్. ఆ ట్రాఫిక్‌ను తగ్గించేందుకు అనే సాకుతో తెలంగాణ నుంచి ఆంధ్రకు వెళ్లే వాహనాలకు టోల్ చార్జీల మినహాయింపు ఏ మేరకు న్యాయం?
ఈ తరహా ట్రాఫిక్ జామ్ నిజంగా అసాధారణమా? వరుస సెలవులప్పుడు రద్దీ పెరగడం ఒక అసాధారణ సంఘటనా? కాదు కదా. అది పూర్తిగా సహజం. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా పండుగల సమయంలో రహదారులపై రద్దీ పెరుగుతుంది. ఇది పండుగ స్వభావంలో సామాజిక భాగం. కానీ, ఇలాంటి సహజ పరిస్థితిని ట్రాఫిక్ జామ్ అనే భయంకరమైన సమస్యగా చూపించి, పాలనా వైఫల్యాన్ని దాచిపెట్టే ప్రయత్నమే టోల్ మినహాయింపుల రూపం.
రద్దీ ఉంటుందని ముందే తెలిసినప్పుడు, దానికి సరైన పరిష్కారాలను వెతకడం ప్రభుత్వ బాధ్యత. అదనపు లైన్లు, సిబ్బంది, సమయ నియంత్రణ, డిజిటల్ పరిష్కారాల వంటివన్నీ పక్కనపెట్టి టోల్ తీసుకోకపోతే సమస్య తీరిపోతుందనడం ఒక అతి బద్ధకపు ఆలోచన. సమస్య మూలాన్ని చూడని ఉపరితలాన్ని మాత్రమే స్పృషించే తప్పుడు వివక్షాపూరిత కనికరం. ఇది నిజానికి అసలు సిసలు అసమానత. ఆంధ్రకు వెళ్లేవారి పట్ల చూపించే కనికరం, తెలంగాణలోనే సొంతూరికి వెళ్లే ప్రజల పట్ల ఎందుకు చూపించరు? హైదరాబాద్ నుంచి నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వెళ్లే రహదారులపై కూడా అదే స్థాయిలో రద్దీ ఉంటుంది. అక్కడ కూడా కుటుంబాలు, పిల్లలు, వృద్ధులు ప్రయాణిస్తారు. మరి వారి ప్రయాణం విలువ తక్కువదా? ఒకే పండుగ, ఒకే రద్దీ, ఒకే సంప్రదాయ భావోద్వేగం అయినప్పుడు, ఒక వర్గానికి మాత్రమే సడలింపు అన్యాయం కాదా? ఇది పాలనలో సమానత్వ సూత్రానికి విరుద్ధం. కనికరానికి ప్రాంతీయ విభేదం ఉండకూడదు.
అవునూ ఇది నిజంగా కనికరమా, రాజకీయ ఎంపికా? ఆర్థిక భారం ఎవరి మీద పడుతున్నది? టోల్‌చార్జీల మినహాయింపు అంటే మరో ఉచితమా? అనుకుంటాం కానీ ఏదీ ఉచితం కాదు. టోల్ వసూలు కాకపోతే, ఆ ఆదాయ లోటును చివరికి రాష్ట్ర ఖజానానే భర్తీచేయాలి. అంటే పరోక్షంగా తెలంగాణ ప్రజల పన్నులతోనే ఆంధ్రకు వెళ్లే వారి ప్రయాణ ఖర్చు భరించాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక సూటి ప్రశ్న. ఆంధ్రకు వెళ్లేవారి డబ్బులు తెలంగాణ ప్రజలు ఎందుకు కట్టాలి? ప్రభుత్వ ఖజానా అంటే ప్రజల డబ్బే. బస్సులో ప్రయాణించే పేదవాడు, సైకిల్‌పై పనికివెళ్లే కార్మికుడు, గ్రామీణ ప్రాంత రైతు లాంటి ఇంకా అనేకమంది డబ్బుతో ఒక ప్రత్యేక వర్గానికి ప్రయాణ సౌకర్యం కల్పించడం ఎంతవరకు సమంజసం? భావోద్వేగ రాజకీయాలు వర్సెస్ విధాన పాలన అనుకుందామా?
పండుగ కాబట్టి మినహాయింపు అనే వాదన వినడానికి బాగుంటుంది. కానీ, పాలన భావోద్వేగ వ్యవహారం కాదు. అది విధానాలే ప్రధానంగా నడవాలి. ఒకసారి మినహాయింపు ఇచ్చిన తర్వాత, ప్రతి పండుగకు అదే డిమాండ్ వస్తుంది. దసరాకు ఎందుకు లేదు? వేసవి సెలవులకు ఎందుకు లేదు? ఎన్నికల సమయంలో ఎందుకు లేదు? ఇలా మినహాయింపులు ఒక సంప్రదాయంగా మారితే, రేపు వాటిని తిరస్కరించే నైతిక హక్కు ప్రభుత్వానికి ఉండదు. ఇది పాలనను పాలనా సూత్రాల నుంచి విడదీసే ప్రమాదకర పరిష్కారం.
అసలు సమస్య టోల్లోనా, నిర్వహణలోనా, నిజంగానే రద్దీలోనా? సమస్య టోల్ చార్జీల్లో లేదు. నిర్వహణలో ఉన్నది. ఈ రోజు మనం ఫాస్టాగ్ అనే సాంకేతికతను ఉపయోగిస్తున్నం. కానీ, వాస్తవంగా అది పూర్తిస్థాయిలో ఉపయోగంలో ఉన్నదా? వేగంగా కదులుతున్న వాహనం నుంచి కూడా టోల్ కటయ్యే సాంకేతికత ప్రపంచంలోని అనేక దేశాల్లో అమలులో ఉన్నది. మన దగ్గర ఎందుకు లేదు? సంక్రాంతి వంటి పీక్ సీజన్‌కు ఒక వారం రోజుల ముందు టోల్ చెల్లించే అవకాశం కల్పించే యాప్ ఎందుకు ఉండకూడదు? ఆ రోజుల్లో వాహనం టోల్ ప్లాజా వద్ద ఆపకుండా, స్కాన్ అయ్యి నేరుగా వెళ్లే విధానం ఎందుకు అమలు చేయకూడదు? నంబర్ ప్లేట్ రికగ్నిషన్, జీపీఎస్, రియల్ టైమ్ డేటా ఇవన్నీ ఈ రోజు సాధారణ సాంకేతిక సాధనాలే.
ఇలాంటి పరిష్కారాలు అమలైతే ట్రాఫిక్ జామ్ తగ్గుతుంది. టోల్ ఆదాయం తగ్గదు. ప్రజల్లో అన్యాయం, వివక్ష అన్న భావన ఉండదు. పాలన మీద విశ్వాసం పెరుగుతుంది. అయితే ఇవన్నీ దీర్ఘకాలిక ఆలోచనలు. మినహాయింపులు మాత్రం తక్షణ రాజకీయ లాభాలు. సహజంగా బద్ధక పాలకులు సులభ మార్గాన్నే ఎంచుకుంటారు. టోల్ మినహాయింపులు ఒక విధంగా పాలనా అలసత్వానికి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. సమస్యను పరిష్కరించకుండా ప్రజలను కాసేపు సంతృప్తిపరచే ప్రయత్నం. కానీ, దీనివల్ల పాలన మరింత ఉచితాలుగా మారుతుంది. ప్రజలు సమస్యల మూల పరిష్కారాన్ని అడగడం మరిచిపోతారు. మినహాయింపులతో మమ అనుకుంటారు.
పండుగ కలపాలి, విడదీయకూడదు. సంక్రాంతి మనుషులను కలిపే పండుగ. కానీ, విధానాల్లో అసమ నిర్ణయాలు ప్రజలను సమూహాలుగా విడదీస్తాయి. ట్రాఫిక్ జామ్ అనే సాకుతో ఒక వర్గానికి మాత్రమే లాభం చేకూర్చి, మరో వర్గంపై భారం మోపడం సమన్యాయం కాదు. మినహాయింపుల కన్నా మెరుగైన నిర్వహణ, సాంకేతిక వినియోగం మాత్రమే నిజమైన పరిష్కారం. పాలన ప్రజలపై కనికరం చూపించాలి. కానీ, అది పక్షపాతిగా ఉండకూడదు. సమస్యలకు తాత్కాలిక ఉపశమనాలు కాదు, శాశ్వత పరిష్కారాలు ఇవ్వగలిగినప్పుడే ఒక ప్రభుత్వానికి నిజమైన విలువ ఉంటుంది. లేకుంటే ప్రజలు శ్రద్ధగా తోలు వలుస్తారు.
పండుగ కలపాలి, విడదీయకూడదు. సంక్రాంతి మనుషులను కలిపే పండుగ. కానీ, విధానాల్లో అసమ నిర్ణయాలు ప్రజలను సమూహాలుగా విడదీస్తాయి. ట్రాఫిక్ జామ్ అనే సాకుతో ఒక వర్గానికి మాత్రమే లాభం చేకూర్చి, మరో వర్గంపై భారం మోపడం సమన్యాయం కాదు.
-ప్రసేన్ ,7013358154